DKT drama : డీకేటీ డ్రామా!
ABN , First Publish Date - 2023-12-09T03:47:20+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం-1977ను సవరించి 75 రోజులవుతోంది. అంతకుముందు అదే చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి నెలన్నర రోజులు అమలు చేశారు.
జగన్ సర్కారు మరో భూమాయ
ఇదీ జగన్ మాట
‘రాష్ట్రంలో డీకేటీ భూములున్న ప్రతి రైతునూ యజమానిని చేస్తాం. 20 ఏళ్ల క్రితం అసైన్ చేసిన డీకేటీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి హక్కులు కల్పిస్తాం. ఇదిగో చట్టాన్ని సవరించాం. ఇక ఆ భూములను అమ్ముకోవచ్చు’’.
-సెప్టెంబరులో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలవి.
ఇదీ వాస్తవం
ఈ ఏడాది సెప్టెంబరులో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చినట్టు అదే నెల 25న ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇప్పటికి 75 రోజులవుతోంది. ఇప్పటి వరకూ ఒక్క రైతుకూ డీకేటీ భూములపై హక్కులు కల్పించలేదు. సెంటు భూమికీ 22 (ఏ) నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించలేదు.
డీకేటీ భూములపై హక్కులు ఏవీ?
సెప్టెంబరులోనే అసెంబ్లీలో బిల్లు
చట్టం చేసినట్టు గెజిట్ కూడా జారీ
అసైన్డ్ రైతుల భూములకు స్వేచ్ఛ
ఇచ్చామంటూ జగన్ ప్రకటన
ఇలా మేలు చేసిన సీఎం మరొకరు
లేరని తనకు తాను గొప్పలు
చరిత్ర పురుషుడంటూ మంత్రుల భజన
చట్టం వచ్చి నేటికి 75 రోజులు
ఒక్క రైతుకూ హక్కులు కల్పించలేదు
22(ఏ) నుంచి ఎకరాకూ విముక్తి లేదు
చట్టసవరణ పేరిట కొత్త మోసం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం-1977ను సవరించి 75 రోజులవుతోంది. అంతకుముందు అదే చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి నెలన్నర రోజులు అమలు చేశారు. అంటే... ఈ ఏడాది ఆగస్టు నుంచి జగన్ సర్కారు డీకేటీ మంత్రం జపిస్తోంది. అయితే ఇప్పటిదాకా చేసిందేమీలేదు. ఈ చట్టం తీసుకొచ్చినంత సులువుగా దాన్ని అమలు చేయలేకపోతోంది. ఇందుకు క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు తోడు రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయి. అయినా డీకేటీ భూములకు హక్కులు కల్పించినట్టుగా జగన్ సర్కారు గొప్పలు చెబుతూనే ఉంది. ఎన్నికల ముందు అంటే మార్చి వరకు ఈ డ్రామాను రక్తికట్టించి చివరకు చుక్కల భూములు, అనాధీనం భూముల తరహాలోనే.. ‘గంపగుత్తగా ఇచ్చేశాం. మా పనైపోయింది’ అనే ప్రకటన చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అటు రాజకీయ లబ్ధి, ఇటు వ్యక్తిగత ప్రతిష్ఠను తమ ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతోంది. సర్కారీ లోగుట్టు తెలియని రైతులు చట్టం చేసిన భూమిపై తమకు హక్కులు ఎందుకు రావడం లేదో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అబ్బో.. ఎంత హడావుడి!
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కమిటీ సిఫారసుల మేరకు తొలుత అసైన్డ్ చట్టాన్ని సవరిస్తూ జూలై 31న ప్రత్యేకంగా ఆర్డినెన్స్ (9 ఆఫ్ 2023) తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ప్రకారం 20ఏళ్ల క్రితం అసైన్ చేసిన భూములను గుర్తించి రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని నిషేధిత జాబితా 22(ఏ) నుంచి వాటిని తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. డీకేటీ భూములున్న రైతులకు పూర్తిహక్కులు కల్పించామని, ఇక ఆ భూములను అమ్ముకోవచ్చని జగన్‌తో పాటు మంత్రులు, కలెక్టర్లు హడావుడి చేశారు. జగనన్న పేదల పక్షపాతి అని, అద్భుత నిర్ణయం తీసుకున్నారని మంత్రులు, వైసీపీ నేతలు కీర్తించారు. అయితే అసెంబ్లీలో చట్టసవరణ చేసి గెజిట్ విడుదల చేసేనాటికి (సెప్టెంబరు 25) 56రోజుల పాటు ఆ ఆర్డినెన్స్ ఆధారంగా ఒక్క రైతుకు కూడా డీకేటీ భూమిపై పూర్తి హక్కులు కల్పించలేదు. సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అసైన్ట్ భూముల ఆర్డినెన్స్(2023) స్థానంలో చట్టాన్ని మార్చేందుకు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. అదేనెల 25న గెజిట్ నోటిఫికేషన్‌తో చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభల్లో అసైన్డ్ రైతుల భూములకు స్వేచ్ఛనిచ్చామంటూ జగన్ ప్రకటించారు. గత నెల 17న నూజివీడులో జరిగిన సభలోనూ జగన్ తనను తానే పొగుడుకున్నారు. జగన్ చరిత్ర పురుషుడని మంత్రులు కొనియాడారు.
ఆ మాటల్లో నిజం ఎంత?
అసైన్డ్ చట్టసవరణ జరిగి 75 రోజులవుతోంది. 36లక్షల ఎకరాలకు గాను 32లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు కల్పించాలి. 42లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలి. చట్ట సవరణ చేసినప్పటి నుంచి రోజుకు వెయ్యి ఎకరాల చొప్పున ఇప్పటికి కనీసం 75వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి బయటకు తీయాలి. కానీ అధికారిక లెక్కల ప్రకారం 75 ఎకరాల భూమిని కూడా 22(ఏ) నుంచి తొలగించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎకరా భూమికీ విముక్తి లభించలేదు. 32లక్షల ఎకరాలకు హక్కులు ఇచ్చామని చెప్పుకోవడం వెనుక మర్మం దాగుంది. ఈ ప్రక్రియను రాజకీయ అజెండాతో ముడిపెట్టి నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలని సర్కారు భావిస్తున్నట్టు చర్చసాగుతోంది.
అధికార పార్టీ నేతల దందా
డీకేటీ భూములకు హక్కులు కల్పించే విషయంలో జరుగుతున్న జాప్యం అధికార పార్టీ నేతలకు పండుగలా మారింది. ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా డీకేటీ భూములను 22(ఏ) నుంచి తీసేయిస్తామంటూ కొందరు సరికొత్త దందాకు తెరలేపారు. భూమికున్న డిమాండ్, ధరను బట్టి ఎకరాకు 25 వేల నుంచి కనీస ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలా నేతల జోక్యం ఉన్న భూముల వివరాలనే అధికారులు త్వరగా ప్రాసెస్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా ప్రాసె్‌సలోనే..
డీకేటీ భూములకు హక్కులు కల్పించే విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ అధికారులను సంప్రదించింది. ఈ అంశంపై నేరుగా స్పందించేందుకు వారు నిరాకరించారు. ఇంకా ఈ అంశం ప్రాసె్‌సలో ఉందని ముక్తసరిగా చెప్పారు. ప్రాసె్‌సలో ఉండటం అంటే ఏమిటనుకుంటున్నారా? పూర్తి హక్కులకు అర్హులైన వారి జాబితాల తయారీ. ఈ జాబితా ఎప్పుడో సిద్ధమైంది. హక్కులు కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడం, ఆపై భూములను 22(ఏ) నుంచి తొలగించడమే మిగిలింది. అసలు పనిని చేపట్టకుండా, ఇంకా ప్రాసె్‌సలో ఉందని చె ప్పడంలో మర్మం దాగుంది. అదే... ఎన్నికల అజెండా. సీరియ్‌సగా ప్రాసెస్ చేయనంత వరకు ఈ అంశం ప్రాసె్‌సలోనే ఉంటుందని ఓ అధికారి చెప్పడం కొసమెరుపు. అసైన్డ్ భూముల విషయంలో పైరవీలు, సెటిల్‌మెంట్లు అంటూ రైతుల వద్దకు వెళ్తున్న వారిపై సర్కారు ఏ చర్యలూ తీసుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నేత దివాకర్ అన్నారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే, పైరవీల పేరిట వచ్చే నేతలను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా పిలుపునివ్వగలరా? ఆదేశాలు ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.
జగన్ లెక్క సరిపోవడం లేదు
చట్ట సవరణతో రైతులకు కలిగే లబ్ధిపై సీఎం జగన్ చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే కుదరడం లేదు. 32 లక్షల ఎకరాలపై రైతులకు లబ్ధి కలగబోతోందని సీఎం చెబుతున్నారు. 15.21 లక్షల మందికి హక్కులు రాబోతున్నాయని అంటున్నారు. కానీ ఇదంతా అబద్ధ్దమని రెవెన్యూ శాఖ రెండున్నర నెలల క్రితం సర్కారుకు పంపిన నివేదికే చెబుతోంది. 10.58 లక్షల ఎకరాలే ఒరిజినల్ అసైనీల (హక్కుదారులు) చేతుల్లో ఉన్నాయి. వారంతా 5.75 లక్షల మంది పేదరైతులు. చట్టంలోని నిబంధనల ప్రకారం భూమి అసైన్ అయిన 20 ఏళ్ల తర్వాతే హక్కులు కల్పించాలి. ఆ భూములపై అసైనీలే పొజీషన్(సాగు)లో ఉండాలి. అప్పుడే డీకేటీ భూమిపై ఆ అసైనీకి సంపూర్ణ హక్కులు వస్తాయి.