Share News

Egg prices : రికార్డు స్థాయికి గుడ్డు ధర

ABN , First Publish Date - 2023-12-12T04:02:20+05:30 IST

గుడ్డు రేటు అమాంతం పెరిగింది. మంగళవారం విశాఖ మార్కెట్‌లో హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ.580గా నిర్ణయించారు. విజయనగరం, శ్రీకాకుళం మార్కెట్‌లో రూ.584గా జాతీయ గుడ్ల

Egg prices : రికార్డు స్థాయికి గుడ్డు ధర

టోకుగా వంద గుడ్లు రూ.580

రిటైల్‌లో రూ.6.50 నుంచి రూ.7

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గుడ్డు రేటు అమాంతం పెరిగింది. మంగళవారం విశాఖ మార్కెట్‌లో హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ.580గా నిర్ణయించారు. విజయనగరం, శ్రీకాకుళం మార్కెట్‌లో రూ.584గా జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్‌) ఖరారు చేసింది. నెక్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు అని చెబుతున్నారు. రిటైల్‌లో ఒక గుడ్డు రూ.6.50 నుంచి రూ.7కు విక్రయిస్తున్నారు. క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకలకు కేకుల తయారీకోసం గుడ్లు భారీఎత్తున వినియోగిస్తున్నారు. ఇంకా చలికాలం కోల్‌కతా మార్కెట్‌లో గుడ్డుకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటివరకు ఈ ఏడాది జనవరిలో వచ్చిన రూ.575 రేటే రికార్డు. ఇప్పుడు దానిని అధిగమించింది. ఈ ఏడాది వేసవి తరువాత గుడ్డు రేటు క్రమేపీ తగ్గుతూ రావడంతో కోళ్ల ఫారాల నిర్వాహకులు నష్టాలు చవిచూశారు. జూన్‌ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోళ్ల ఫారాల్లో గుడ్ల ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చారు. రోజుకు సగటున 43 లక్షల నుంచి 45 లక్షల గుడ్లు ఉత్పత్తి జరిగే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం 36 లక్షల నుంచి 37 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రలో రోజుకు సగటున 33 నుంచి 35 లక్షల వరకు వినియోగిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో కార్తీక మాసం ముగియనున్నందున వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు కోల్‌కతా మార్కెట్‌కు రోజు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాలుగైదు లక్షల గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో గుడ్డుకు గిరాకీ ఏర్పడడంతో ధర పెంచారు. రానున్న వారం రోజుల్లో గుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని నెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-12-12T04:02:21+05:30 IST