ఏకలవ్య..ఇదేందయ్యా!
ABN , First Publish Date - 2023-01-06T00:09:11+05:30 IST
ఏకలవ్య పాఠశాలలు.. మంజూరై దశాబ్దకాలం సమీపిస్తోంది. కానీ పాఠశాల భవన నిర్మాణ పనులు మాత్రం కొలిక్కి రాలేదు. మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగి ఆర్థిక భారమవుతున్నాయే తప్ప.. కొత్త భవనాల నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. మారు మూల గిరిజన ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించేందుకు 2017-18లో కేంద్ర ప్రభుత్వం పాచిపెంట మండలానికి ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది.
ఏకలవ్య..ఇదేందయ్యా!
ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణంలో జాప్యం
మూడేళ్లు గడుస్తున్నా.. పది శాతం పనులు దాటని వైనం
పరాయిపంచలో కొనసాగుతున్న పాఠశాల
అరకొర వసతులతో విద్యార్థులకు అసౌకర్యం
(పాచిపెంట)
ఏకలవ్య పాఠశాలలు.. మంజూరై దశాబ్దకాలం సమీపిస్తోంది. కానీ పాఠశాల భవన నిర్మాణ పనులు మాత్రం కొలిక్కి రాలేదు. మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగి ఆర్థిక భారమవుతున్నాయే తప్ప.. కొత్త భవనాల నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. మారు మూల గిరిజన ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించేందుకు 2017-18లో కేంద్ర ప్రభుత్వం పాచిపెంట మండలానికి ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. రూ.36 కోట్లు కేటాయించింది. 2020 జనవరి 3న కొటికిపెంట సమీపంలో భవన నిర్మాణానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి భూమి పూజ చేశారు. సుమారు మూడేళ్లవుతున్నా కనీసం పది శాతం పనులు కూడా పూర్తికాలేదు.
తప్పని ఇబ్బందులు
ప్రస్తుతం సరాయివలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గల కొన్ని గదుల్లో ఏకలవ్య పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 6 నుంచి 12వ తరగతి వరు 231 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతీ తరగతిని రెండు విభాగాలుగా విభజించారు. దీనిని బట్టి 14 గదులు అవసరం. కానీ ప్రస్తుతం అరకొరగానే గదులు ఉన్నాయి. తరగతులు, డార్మేటరీ, భోజన నిర్వహణ ఇలా అన్నింటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలీచాలని వసతులతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు పూర్తిచేసి వచ్చే విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తేవా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు ఇక్కట్లు
చాలీచాలని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నాం. అవసరాన్ని బట్టి వరండాల్లో కూడా విద్యాబోధన సాగించాల్సి వస్తోంది. విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.
- ఎం.అప్పలరాజు, ప్రిన్సిపాల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల