ప్రవేశం పరిమితం

ABN , First Publish Date - 2023-05-05T00:26:32+05:30 IST

: పేదవాడి సొంతింటిపై ఎన్నెన్నో బీరాలు పోయిన వైసీపీ ప్రభుత్వం.. ఆచరణలో చతికిల పడింది. ఇల్లు కాదు.. ఊళ్లను నిర్మించి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఆయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇది అమలు కాలేదు. సకాలంలో బిల్లులు, సామగ్రి సరఫరా కాలేదు. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి.

ప్రవేశం పరిమితం
పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ గౌతమి

సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యం కుదింపు

మొదట 20 వేలు.. ఇప్పుడు 13 వేల ఇళ్లే..

కుదించిన లక్ష్యంలోనూ 1556 ఇళ్లు పెండింగ్‌

అందని బిల్లులు, నిర్మాణ సామగ్రి

ప్రహసనంగా మారిన జగనన్న ఇళ్ల నిర్మాణం

అనంతపురం సిటీ, మే 4: పేదవాడి సొంతింటిపై ఎన్నెన్నో బీరాలు పోయిన వైసీపీ ప్రభుత్వం.. ఆచరణలో చతికిల పడింది. ఇల్లు కాదు.. ఊళ్లను నిర్మించి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఆయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇది అమలు కాలేదు. సకాలంలో బిల్లులు, సామగ్రి సరఫరా కాలేదు. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పేదలకు ఇళ్ల నిర్మాణం కష్టంగా మారింది. ప్రభుత్వం, గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇళ్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే.. సామూహిక గృహ ప్రవేశాల పేరిట ప్రభుత్వం ఇటీవల హడావుడి మొదలు పెట్టింది. కానీ గృహ ప్రవేశాల తేదీని పదే పదే వాయిదా వేస్తోంది. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని అధికారులు బాగా కుదించారు. ఇప్పటి వరకూ పూర్తయిన ఇళ్లతోనే, ఈ నెల రెండో వారంలో గృహ ప్రవేశాలు చేయించాలని కలెక్టర్‌ అదేశాలు జారీ చేశారు.

లబ్ధిదారుల్లో ఆందోళన

ప్రభుత్వం సకాలంలో బిల్లులు చేయకపోయినా, నిర్మాణ సామగ్రి సరఫరా చేయకపోయినా చాలా మంది సొంత డబ్బుతో ఇళ్లను నిర్మించుకున్నారు. వీటిని కూడా ప్రభుత్వం సామూహిక గృహ ప్రవేశాల జాబితాలో చేర్చింది. ఇలాంటి వాటికి సంబంధించి ఇప్పటికి సుమారు రూ.2 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అధికారులు, పాలకులు లక్ష్యంపై దృష్టి పెట్టారే తప్ప.. మిగిలిన ఇళ్ల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను త్వరగా మంజూరు చేయాలని, మిగిలిన నిర్మాణాలను వేగవంతం చేయాలని బాధిత వర్గాలు కోరుతున్నాయి.

పురోగతి ఏదీ..?

వైసీపీ అధికారంలోకి రాగానే.. జిల్లా వ్యాప్తంగా 68,267 మందికి ఇళ్లను మంజూరు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో నిర్మాణాలు సాగలేదు. జగనన్న లే ఔట్‌లలోనూ అదే పరిస్థితి. నాలుగేళ్లలో కేవలం 11,833 ఇళ్లను పూర్తి చేశారు. వీటిలో ఎక్కువ శాతం లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకున్నేవే ఉన్నాయి. ఇప్పటికి 11,699 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడం, నిర్మాణ సామగ్రిని సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన, కలెక్టర్‌, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహించినా.. క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించలేదు.

పదే పదే వాయిదా

ప్రభుత్వం, పాలకులు, అధికారులు సామూహిక గృహ ప్రవేశాల పేరిట హడావుడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ల ప్రవేశాలు చేయిస్తామని అంటున్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు గృహ ప్రవేశాలను వాయిదా వేశారు. ఇళ్ల నిర్మాణమే పూర్తి కానప్పుడు.. గృహ ప్రవేశాలు ఎలా సాధ్యమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. వాయిదాలపై విమర్శలు వస్తుండటంతో.. కలెక్టర్‌ గౌతమి లక్ష్యాన్ని కుదించారు. ఆరు వేలకు పైగా ఇళ్లను జాబితా నుంచి తొలగించి, మిగిలిన ఇళ్లలో ప్రవేశాలు చేయించాలని నిర్ణయించారు. ఈ నెల రెండో వారంలో సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని ప్రకటించారు. ఇదైనా జరుగుతుందా..? ఇంకోసారి వాయిదా పడుతుందా? అన్న చర్చ మొదలైంది.

కుదింపుతో ప్రవేశాలు

సామూహిక గృహ ప్రవేశాలను పలుమార్లు వాయిదా వేయడంతో ప్రజల్లో వ్యతిరేఖత వస్తుందని వైసీపీ ప్రభుత్వం జంకినట్లు తెలుస్తోంది. భయపెట్టినా, బుజ్జగించినా ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించలేదు. దీంతో ప్రభుత్వమే ఒక అడుగు వెనక్కు వేసింది. లక్ష్యాన్ని కుదించి ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించనట్లు సమాచారం. దీంతో మొదట నిర్ణయించిన 20 వేల గృహ ప్రవేశాల లక్ష్యంలో మార్పు చేశారు. జాబితా నుంచి 6,611 ఇళ్లను తగ్గించారు. మిగిలిన 13,389 ఇళ్లలో ఈనెల రెండో వారంలో ప్రవేశాలను చేయించాలని నిర్ణయించారు. ఇందులో కూడా 1556 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. సామూహిక గృహ ప్రవేశాలకు వారం మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో.. తగ్గించిన లక్ష్యం మేరకైనా సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయా..? ఇంకా తగ్గిస్తారా..? అన్న చర్చ జరుగుతోంది.

- మొదట సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యం : 20,000

- తగ్గించి విధించిన లక్ష్యం : 13,389

- లక్ష్యంలో పూర్తి అయినవి : 11,833

- లక్ష్యంలో నిర్మాణ దశలో ఉన్నవి : 1556

జిల్లాలో జగనన్న ఇళ్ల పరిస్థితి

- మంజూరైన ఇళ్ల సంఖ్య : 68,267

- పూర్తి అయిన ఇళ్ల సంఖ్య : 11,833

- నిర్మాణం ప్రారంభం కానివి : 11,699

- వివిధ నిర్మాణ దశలలో ఉన్నవి : 44,735

ఈనెల 10లోగా పూర్తి చేస్తాం..

ప్రభుత్వ అదేశాల మేరకు ఈనెల 10లోగా సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యం పూర్తి చేస్తాం. కొన్ని ఇళ్ల నిర్మాణం మాత్రమే పెండింగ్‌ ఉంది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతం చేస్తాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే పరిష్కారమవుతాయి.

- కేశవనాయుడు, జిల్లా గృహ నిర్మాణశాఖ ఇనచార్జి పీడీ

Updated Date - 2023-05-05T00:27:09+05:30 IST