Ketu Viswanatha Reddy Death:ప్రసిద్ధ కథకులు కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం
ABN , First Publish Date - 2023-05-23T04:03:27+05:30 IST
ప్రముఖ కథారచయిత, అభ్యుదయ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు, విద్యావేత్త కేతు విశ్వనాథరెడ్డి(84) సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలులో మరణించారు.
ఒంగోలులో కుమార్తె ఇంట గుండెపోటుతో మృతి
రాయలసీమ సాహిత్యానికి కేతు విశేష సేవ
‘కేతు కథల’కు కేంద్ర సాహిత్య పురస్కారం
పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక పాత్ర
ఒంగోలు(కల్చరల్), ఎర్రగుంట్ల(కడప), మే 22/హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథారచయిత, అభ్యుదయ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు, విద్యావేత్త కేతు విశ్వనాథరెడ్డి(84) సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలులో మరణించారు. ఒంగోలులోని తన పెద్ద కుమార్తె మాధ వి దగ్గరకు 2 రోజుల క్రితం ఆయన వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య పద్మావతిని అక్కడి ఓ ఆస్పత్రిలో చే ర్చి వైద్యం అందిస్తున్నారు. ఇంతలో.. సోమవారం తెల్లవారుజామున కేతు విశ్వనాథరెడ్డి హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొం దుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన భార్యకు తన భర్త మరణం విషయం తెలియకపోవడం విషాదం. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రంగశాయిపురంలో 1939 జూలై 10న విశ్వనాఽథరెడ్డి జన్మించారు. పాత్రికేయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అనంతరం అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించారు. 1962 నుంచి 1976 వరకు ప్రభుత్వ కాలేజీల్లో పనిచేశారు. ఎస్వీ వర్సిటీలో 1983 వరకు, అంబేడ్కర్ వర్సిటీలో 1997 వరకు పనిచేశారు. అంబేడ్కర్ వర్సిటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎన్‌సీఈఆర్‌టీ సంపాదకునిగా వ్యవహరించారు. పాఠశాల నుంచి వర్సిటీ స్థాయి వరకు అనేక పాఠ్యపుస్తకాల ప్రచురణలో కీలక భూమిక పోషించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సిబ్బందికి ఇచ్చే శిక్షణలో అధ్యాపకుడిగా పాల్గొన్నారు.
సీమకు పట్టం..
కేతు విశ్వనాథరెడ్డి 1958లో కడప ప్రభుత్వ కళాశాలో డిగ్రీ చదివే రోజుల్లో ‘అమ్మ’ అనే కథ రాశారు. 1963లో రచించిన ‘అనాది వాళ్లు’ కఽథ అచ్చయిన తొలి రచన. స్నేహితుడు నల్లపాటి రామప్పనాయుడు ద్వారా కళాశాల విద్యార్థి దశలో వామపక్ష సాహిత్యానికి, సామ్యవాద భావజాలానికి ఆయన దగ్గరయ్యా రు. కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలెన్నో రచించారు. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యలోకంలో కథకునిగా కేతు విశ్వనాథరెడ్డి శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితం గా పరిశీలించి, శాస్త్రీయ దృక్పథంతో మానవ సంబంధాలను విశ్లేషిస్తూ రచనలు చేశారు. ముఖ్యంగా కడప గ్రామీణ జీవితంతో మమేకమై రచనలు సాగించారు. విశ్వనాథరెడ్డి కడప జిల్లా గ్రామ నామాలపై లోతైన పరిశోధన చేసి..డాక్టరేట్ పొందారు. అధ్యాపకుడిగా ఉంటూనే రచయితగానూ గుర్తిం పు పొందారు. అభ్యుదయ రచయితల సంఘం(అ.ర.సం.)లో అనేక బాధ్యతలు నిర్వహించారు. కేంద్రసాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా చాలాకాలం పనిచేశారు.
విశాలాంధ్ర ప్రచురించిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సంపాదకులు గా వ్యవహరించారు. తెలుగు చరిత్ర–సంస్కృతి, రాయలసీమ రాగాలు వంటి సంకలనాలకు సంపాదకత్వం వహించారు. కొన్నేళ్ల పాటు అ.ర.సం. అధ్యక్షునిగా కొనసాగారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కఽథలు’ పేరిట వెలువడిన పుస్తకానికి కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు లభించింది. భారతీయ భాషాపరిషత్(కలకత్తా), తెలుగు విశ్వవిద్యాలయం(హైదరాబాద్) నుంచి పురస్కారాలు అందుకున్నారు. రావిశాస్త్రి పురస్కారం, తుమ్మ ల వెంకటరామయ్య బంగారు పతకం, అజో–విభో–కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం ఆయనను వరించింది. కాగా, విశ్వనాథరెడ్డి ఉద్యోగ విరమణానంతరం కడపలో స్థిరపడ్డారు. ఆయన భౌతికకాయాన్ని ఒంగోలు నుంచి కడపలోని సింగపూర్ టౌన్‌షిప్‌కు మంగళవారం తీసుకురానున్నారు. బుధవారం ఆయ న కుమారుడు శశికాంత్‌రెడ్డి, చిన్న కుమార్తె శిరీష అమెరికా నుంచి తిరిగిరాగానే స్వగ్రామమైన రంగసాయిపురంలో అం త్యక్రియలు నిర్వహిస్తారు.
సాహితీలోకం నివాళులు
మంచి వచనం రాసిన అతికొద్దిమందిలో విశ్వనాథరెడ్డి ఒకరని రచయిత్రి ఓల్గా కొనియాడారు. కథాసాహిత్య శిఖరం కూలిపోయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ విచారం వ్యక్తం చేశారు. రచయితలు బండి నారాయణస్వా మి, వేంపల్లి గంగాధర్, కవి యాకూబ్, రాపోలు సుదర్శన్, విజయవాడ బుక్‌ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్‌నాయుడుతో పాటు పలువురు సాహితీవేత్త లు కేతు సేవలను గుర్తుచేసుకున్నారు. ఒంగోలులో ఆయన పార్థివదేహానికి అ.ర.సం. జాతీయ ప్రధానకార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు నివాళులర్పించారు.