కన్నుల పండువగా ధ్వజావరోహణం

ABN , First Publish Date - 2023-09-28T01:02:52+05:30 IST

వైభవంగా స్వామివారి త్రిశూల స్నానం కాణిపాకంలో ముగిసిన వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు

కన్నుల పండువగా ధ్వజావరోహణం
ఆలయ పుష్కరిణిలో త్రిశూల స్నానం

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 27: కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో బుధవారం సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహంచారు. నూతన ధ్వజ స్తంభంపై ఉన్న మూషిక ధ్వజ పటాన్ని మేళ తాళాలు, వేదమంత్రాల నడుమ కిందకు దించారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గురువారం నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిని 11 రోజుల పాటు ఉభయదారులు నిర్వహించనున్నారు. ఇక, వినాయకస్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఆలయ పుష్కరిణి వద్ద త్రిశూల స్నానాన్ని ఉప ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారికి రక్షగా యాగశాలలో త్రిశూలాన్ని ఉంచుతారు. ప్రతి రోజు ఉదయం పుర వీధులలో టింగ్‌టింగ్‌ పిళ్లారప్పగా(సప్పరం) త్రిశూలాన్ని ఊరేగిస్తారు. చివరి రోజున పుష్కరిణి వద్ద ఈ త్రిశూలాన్ని ఉంచి పూజలు చేశారు. అనంతరం యాగశాలలో మంత్రబద్ధంగా 108 మట్టి కుండలలో ఉంచిన నవ ధాన్యాలను తీసుకొచ్చి పుష్కరణి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం త్రిశూలాన్ని, మట్టి కుండలలో మెలకెత్తిన నవధాన్యాలను పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశు,, ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాబు,సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-28T01:05:22+05:30 IST