ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు జగన్ బొమ్మతో జెండాలు
ABN , First Publish Date - 2023-06-03T05:16:11+05:30 IST
ప్రభుత్వ పథకాలపై సీఎం ముద్ర, ఫొటో ఉండటం సహజమే. కానీ ఈసారి రైతు గ్రూపులతో ప్రచారం చేయించడం గమనార్హం. యంత్రసేవ పథకంలో ఆర్బీకేల స్థాయిలో రైతు గ్రూపులకు సీఎం జగన్ 2,562 ట్రాక్టర్లు, 1
ప్రభుత్వ పథకాలపై సీఎం ముద్ర, ఫొటో ఉండటం సహజమే. కానీ ఈసారి రైతు గ్రూపులతో ప్రచారం చేయించడం గమనార్హం. యంత్రసేవ పథకంలో ఆర్బీకేల స్థాయిలో రైతు గ్రూపులకు సీఎం జగన్ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ చేశారు. వీటి అన్నింటిపై జగన్ బొమ్మఉన్న జెండాలను కట్టారు. వైఎస్సార్ యంత్రసేవ పథకం పేరుతో వ్యవసాయశాఖ ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ జెండాలను ట్రాక్టర్లు, హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లలో కొన్నింటికి కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో జాతీయ రహదారి మధ్యలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వరుస క్రమంలో నిలిపిన వీటిని.... సీఎం జగన్ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ యంత్రాలను డ్రోన్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసి, మీడియాకు ఇచ్చారు.
అమాత్యులకు ఇవ్వని అవకాశం
గతంలో వ్యవసాయ యంత్ర పరికరాలను జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నేరుగా రైతులకు పంపిణీ చేసేవారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ‘రైతు రథం’ పేరుతో ట్రాక్టర్లు, ఊబరైజేషన్ కింద వ్యవసాయ పనిముట్లును మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులే పంచారు. కానీ నిరుడు, ఈ ఏడాది యంత్ర పరికరాలను వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పటినుంచే అన్ని సంప్రదాయాలను పక్కకుపోయాయి. క్లస్టర్ హైరింగ్ సెంటర్లకు ఒకేచోట సీఎం జగనే మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు యంత్ర పరికరాలు పంచే అవకాశమే ఇవ్వలేదు. గతేడాది, ఈ ఏడాది గుంటూరులోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం మొత్తానికి సంబంధించి ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇక్కడే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నా.. పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు.
యంత్రాలతో అవస్థలు...
గుంటూరులో యంత్రాలను తీసుకున్న రైతు గ్రూపులు వాటిని వ్యయప్రయాసలతో తమ స్వస్థలాలకు తరలించాల్సి వచ్చింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల వారు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తీసుకుని, మండుటెండలోనే వెళ్లాల్సి వచ్చింది. కోస్తాంధ్రకి చెందిన వారు కూడా ఎండలోనే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడుపుకుంటూ వెళ్లారు. రాష్ట్రానికి గుంటూరు మధ్యలో ఉన్నా.. 100 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల దూరం నానా అవస్థలు పడి ఈ యంత్రాలను తీసుకెళ్లారు. యంత్రాలను తరలించడానికి అధికారులు ప్రత్యేకంగా రవాణా సౌకర్యాన్ని కల్పించకపోవడంతో ఎవరికి వారే తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు. సీఎంకు పబ్లిసిటీ రావాలన్న ఆలోచనతోనే చేసినట్లు తెలుస్తోంది.