హలో... ‘తాడేపల్లి’!
ABN , First Publish Date - 2023-02-04T03:20:07+05:30 IST
కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్‌లను శుక్రవారం కడప సెంట్రల్ జైలులోని అతిఽథిగృహంలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని బృందం ఆరున్నర గంటల పాటు ప్రశ్నించింది.
వివేకా హత్య కేసులో మరో సంచలనం
సీఎం దంపతుల సహాయకులను ప్రశ్నించిన సీబీఐ
ఒకరు భారతీరెడ్డి వద్ద పనిచేసే నవీన్
మరొకరు జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి
వైఎస్ కుటుంబానికి నమ్మినబంట్లు
కడపలో ఆరున్నర గంటలపాటు విచారణ
ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్‌డేటాయే ఆధారం
ఎన్నిసార్లు ఫోన్లు, ఎవరు మాట్లాడారు, ఎంతసేపు?
ఇదే ప్రధానంగా ప్రశ్నించిన అధికారులు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి సన్నిహిత బంధువు, ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు... శుక్రవారం సీఎం జగన్ ఓఎస్డీని, సతీమణి భారతి వద్ద సహాయకుడిగా పనిచేసే నవీన్‌ను ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సుమారు ఆరున్నర గంటలపాటు ఈ విచారణ జరిగింది. గత నెల 28వ తేదీన ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో విచారించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన కాల్‌డేటా కీలకంగా మారింది. వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజున, ఆ తర్వాత... భారతితో మాట్లాడేందుకు నవీన్‌కు, జగన్‌తో మాట్లాడేందుకు మరో నంబర్‌కు అవినాశ్ రెడ్డి పలుమార్లు కాల్ చేసినట్లు ఆ విచారణలో తేలింది. ఆ మరో వ్యక్తి ఇంకెవరో కాదని... జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డేనని స్పష్టమైంది. వీరిద్దరికీ సీబీఐ నోటీసులు జారీ చేసిందని, వారంలోనే విచారించే అవకాశముందని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించింది. ఇప్పుడు అదే జరిగింది.
కడప, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్‌లను శుక్రవారం కడప సెంట్రల్ జైలులోని అతిఽథిగృహంలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని బృందం ఆరున్నర గంటల పాటు ప్రశ్నించింది. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ముగిసింది. వివేకా హత్య జరిగిన రోజున ‘తాడేపల్లి’ కేంద్రంగా ఏం జరిగిందనే కోణంలో విచారణ సాగినట్లు తెలిసింది. వివేకా హత్యకు ముందు రోజు, హత్య జరిగిన రోజు, ఆ తర్వాత అవినాశ్ ఫోన్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయి... ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడుకున్నారు... తదితర అంశాలపై దృష్టిసారించినట్లు సమాచారం. కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్... వీరిద్దరూ జగన్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులు. సీఎం ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పులివెందుల ఏరియా డెవల్‌పమెంట్ అధికారిగా (ఓఎస్డీ) పనిచేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే ఆయనకు కృష్ణమోహన్ ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఇక నవీన్ సొంత ఊరు పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామం. నవీన్ కుటుంబీకులు ఎప్పుడో పులివెందులకు వలస వచ్చారు. వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి ఆకుటుంబం వద్ద పని చేస్తున్నారు. నమ్మకం, విధేయత ఉన్న నవీన్ ఇప్పుడు భారతి వద్ద పీఏగా పని చేస్తున్నారు. భారతితో మాట్లాడాలంటే నవీన్‌కు కాల్ చేయాలని... జగన్‌తో మాట్లాడాలంటే ఓఎస్డీ కృష్ణమోహన్‌కు ఫోన్ చేయాలని సీబీఐ విచారణలో అవినాశ్ రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. ఈ కేసులో ‘డిఫాల్ట్’ బెయిలుపై ఉన్న ఏ1 గంగిరెడ్డిని కూడా త్వరలోనే సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. గంగిరెడ్డి బెయిలు రద్దు అంశాన్ని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అప్రూవర్‌గా మారిన డ్రైవరు దస్తగిరి, రిమాండులో ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌లను ఈ నెల 10న విచారణకు రావాలసిందిగా హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
సీఎస్‌తో కలిసి వెళ్లిన ఓఎస్డీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం కడప జిల్లా సింహాద్రిపురం, ముద్దనూరు మండలాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింహాద్రిపురం మండలం భానుకోటలో పార్వతీ సమేత సోమేశ్వరాలయ పునరుద్ధరణ వేడుకల్లో సీఎ్‌సతోపాటు వైఎస్ అవినాశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో కడప సెంట్రల్ జైలు మీదుగా సీఎస్ రేణిగుంటకు బయల్దేరారు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే... కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ల విచారణ ముగిసింది. అక్కడి నుంచి కొద్దిదూరంలో సీఎస్ వేచి చూస్తుండగా... ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.