ఆస్పత్రి మందులు అమ్మేశారు!
ABN , First Publish Date - 2023-11-27T02:22:33+05:30 IST
కార్మిక బీమా సంస్థ (ఈఎ్‌సఐ)లో జరిగిన అక్రమాల విచారణను అధికారులే నీరుగార్చుతున్నారు. గత రెండేళ్లలో ఈఎ్‌సఐలో జరిగిన అవినీతి ఇంతా అంతా కాదు.
రాజమండ్రి మందుల స్కామ్‌లో ప్రాథమిక ఆధారాలు
కార్మిక రాజ్య బీమా సంస్థలో అక్రమాలను సరిదిద్దే నాథుడు కనిపించడం లేదు! పదోన్నతులు, నియామకాల్లో సీనియర్ వైద్యులకు అన్యాయం చేస్తూ, ముడుపులిచ్చిన జూనియర్‌లకు అవకాశాలు కల్పించారన్న ఆరోపణలు ఉండగా, ఇదే సమయంలో రాజమండ్రి ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మందుల స్కామ్‌పై ప్రాథమిక ఆధారాలు లభించాయి. కోట్ల రూపాయలతో మందులను కొనుగోలు చేసిన అధికారులు.. వాటిని ఆస్పత్రికి చేర్చకుండానే తిరిగి బయట మార్కెట్‌లో రూ.43 కోట్లకు అమ్ముకుని నిధులు స్వాహా చేశారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించినా.. పూర్తిస్థాయి దర్యాప్తు మాత్రం ముందుకు సాగడంలేదు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ ఉన్నతాధికారులే ఈ విచారణలను నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈఎస్‌ఐ ఆస్పత్రి పేరిట మందుల కొనుగోలు
కానీ ఆ మందులు అసలు ఆస్పత్రికే రాలేదు
43 కోట్లకు అధికారులే బయట అమ్మేసుకున్నారు
పదోన్నతులు, నియామకాల్లో సీనియర్లకు అన్యాయం
అక్రమాలు నిజమేనని కమిషనర్, కమిటీ నివేదికలు
ఏసీబీ, విజిలెన్స్‌తో విచారణకు సిఫారసులు
అయినా ఈఎస్‌ఐ డైరెక్టర్‌తోనే విచారణకు
కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు
ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగుల్లో అనుమానాలు
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కార్మిక బీమా సంస్థ (ఈఎ్‌సఐ)లో జరిగిన అక్రమాల విచారణను అధికారులే నీరుగార్చుతున్నారు. గత రెండేళ్లలో ఈఎ్‌సఐలో జరిగిన అవినీతి ఇంతా అంతా కాదు. ఈఎ్‌సఐ నిబంధనలను తుంగలో తొక్కి మరీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడింతే పాటగా మారింది. ఈఎ్‌సఐలో అక్రమ పదోన్నతులు, బదిలీలపై ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు కార్మికశాఖ కమిషనర్‌తో ప్రత్యేక విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణలో..
ఈఎ్‌సఐలో పదోన్నతులు, బదిలీలు, ఎసీఆర్‌లను తారుమారు చేసిన విషయం కూడా వాస్తవమేనని కమిషనర్ నిర్ధారించారు. దీని వల్ల అనేక మంది వైద్యులు, ఇతర ఉద్యోగులు నష్టపోయినట్లు ఆయన ప్రాథమికంగా గుర్త్తించారు. తనకు ఇతర పని ఒత్తిడి ఉండటంతో ఏసీబీ, లేదా సీఐడీ లాంటి పెద్ద సంస్థలతో విచారణ చేయించాలని నివేదికలో ముఖ్య కార్యదర్శికి సూచించారు. ఇదే సమయంలో రాజమండ్రిలో ఈఎ్‌సఐలో మందుల స్కామ్ బయటకు వచ్చింది. సరికొత్త పంఽథాలో అధికారులే భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. ఆస్పత్రి పేరుతో ఫేక్ పీవోలు సిద్ధం చేసి ఒక ప్రయివేటు సంస్థ నుంచి కోట్ల విలువైన మందులను కొనుగోలు చేశారు. వాటిని ఆస్పత్రికి చేర్చకుండానే అధిక ధరలకు బయట మార్కెట్‌లో అధికారులే అమ్మేసుకున్నారు. దాదాపు రూ.43 కోట్లకు ఆ మందులను అక్రమంగా అమ్మినట్లు తెలిసింది. దీనిపై కూడా ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో కూడిన విచారణ కమిటీని నియమించగా, ప్రాథమిక ఆధారాలు సేకరించింది. రాజమండ్రి ఈఎ్‌సఐ ఆస్పత్రి పేరుతో మందులు కొనుగోలు చేసిన విషయం వాస్తవమేనని, కానీ ఆ మందులు ఆస్పత్రికి రాలేదని విషయాన్ని తేల్చింది. రాజమండ్రి ఆస్పత్రి పేరుతో ఒక ప్రయివేటు సంస్థ కోట్ల విలువైన మందులు కూడా సరపరా చేసినట్లు నిర్థారించారు. ఈ కమిటీ కూడా విజిలెన్స్ లేదా ఏసీబీ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని, అప్పుడే ఈఎ్‌సఐలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు బయటికి వస్తాయని సూచిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక అందించింది. అయితే కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం.. విజిలెన్స్, ఏసీబీ విచారణ జోలికి పోకుండా, దీనిపై మరోసారి విచారణ చేయాలని ఈఎ్‌సఐ డైరెక్టర్‌ను ఆదేశించడం గమనార్హం. గతంలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారులను కాపాడేందుకే ఇలా కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెండు కమిటీల సూచనల మేరకు విజిలెన్స్ లేదా ఏసీబీ లాంటి సంస్థలతో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికీ అదే తీరు...
ఈఎ్‌సఐలో ఉన్నతాధికారులు మారినా అక్కడ పరిస్థితులు మాత్రం మారలేదు. ఇప్పటికీ అవే అక్రమ పోస్టింగ్స్‌లు, పదోన్నతులు నడుస్తున్నాయి. గతంలో 46 మంది స్టాఫ్‌నర్సుల నియామకాల్లో 10, 15 మంది ఏఎన్‌ఎంలు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడిన అధికారులు, వారికి అర్హత లేకపోయినా స్టాఫ్ నర్సులుగా పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈఎ్‌సఐ డైరెక్టర్‌కు అనేక ఫిర్యాదులు వచ్చినా ఇప్పటికీ దృష్టిసారించడం లేదు.
పదోన్నతుల్లోనూ అంతే..
మరోవైపు ఉన్నతాధికారులు సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు కల్పిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈఎ్‌సఐలో తమకు కావాల్సిన జూనియర్లకు పదోన్నతి కల్పించడం కోసం ఓ మహళా పీడియాట్రిషియన్‌ను బలిపశువును చేశారు. పదోన్నతి వద్దన్ని లేఖ ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆమె భయపడి లేఖ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత తిరిగి ఆ లేఖను వెనక్కి తీసుకుని, తనకు పదోన్నతి కల్పించాలని అదే ఉన్నతాధికారులకు ఆమె మరో లేఖ రాశారు. అయితే రెండోసారి ఇచ్చిన లేఖను పక్కనపడేసి, తొలుత ఇచ్చిన లేఖ ఆధారంగా అధికారులు పదోన్నతి రాకుండా చేసేశారు. గతంలో ఈఎ్‌సఐలో పనిచేసిన ఉన్నతాధికారి సూచనల మేరకే సీనియర్లను పక్కన పెట్టి, ముడుపులిచ్చిన వారికే పదోన్నతులు కల్పించారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై కూడా విచారణ చేపట్టాలని ఉద్యోగుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.