డిగ్రీ చదివేదెలా?
ABN , First Publish Date - 2023-06-10T04:49:29+05:30 IST
రాబోయే విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సు పెద్ద పజిల్‌లా మారింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం ఈ ఏడాది నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘సింగిల్ మేజర్ సబ్జెక్టు’పై అయోమయం
ఏ కాలేజీలో... ఏ కోర్సు ఉందో తెలియదు
ప్రభుత్వ కాలేజీల్లో కొన్ని కోర్సులు రద్దు
ప్రైవేటు కాలేజీలు సైతం అదే బాటలో...
ఇప్పటికీ కాలేజీలకు చేరని ప్రొసీడింగ్స్
జూన్ రెండోవారంలో అడ్మిషన్ల ప్రక్రియ
ఇప్పటికీ పూర్తికాని సబ్జెక్టుల కన్వర్షన్
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాబోయే విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సు పెద్ద పజిల్‌లా మారింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం ఈ ఏడాది నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నెల రెండోవారంలోనే డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అయితే ఇప్పటికీ కోర్సు స్వరూపంపై స్పష్టత లేదు. దీనిపై యూనివర్సిటీలు, ప్రాంతాల వారీగా అవగాహన కల్పిస్తామని మండలి ప్రకటించినా ఇంతవరకూ ఒక్క సదస్సు కూడా జరగలేదు. ఈ ఏడాది మొత్తం కోర్సుల స్వరూపమే మారిపోనుంది. ఇప్పటివరకూ మూడు సబ్జెక్టులుగా ఉన్న డిగ్రీ కోర్సు... ఇకపై సింగిల్ మేజర్ కానుంది. దానికి అదనంగా ఒక మైనర్ సబ్జెక్టును విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. దీనికి అనుగుణంగా కాలేజీల్లో సబ్జెక్టుల కన్వర్షన్ జరుగుతోంది. ఇప్పటివరకూ బీఎస్సీ కోర్సులో గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ ఉంటే ఇకపై వాటిలో ఒక సబ్జెక్టునే విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. దాన్ని ఇకనుంచి బీఎస్సీ ఆనర్స్-గణితం/బీఎస్సీ ఆనర్స్-ఫిజిక్స్/బీఎస్సీ ఆనర్స్-కెమిస్ట్రీ అని పిలుస్తారు. అయితే కన్వర్షన్‌లో భాగంగా కాలేజీలు కొన్ని సబ్జెక్టులను ఏకంగా రద్దు చేస్తున్నాయి. కొత్త విధానంలో ఒకే సబ్జెక్టుపై లోతుగా బోధన చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని సబ్జెక్టులు తమ కాలేజీలో పెట్టబోమని నిర్ణయం తీసుకున్నాయి. అలాగే డిమాండ్ లేకపోయినా ఇప్పటివరకూ అందుబాటులో ఉంచిన కొన్ని కోర్సులను పూర్తిగా తొలగిస్తున్నారు.
సబ్జెక్టు ఎంపికే కీలకం
ప్రస్తుతం 1,200కు పైగా డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సబ్జెక్టులు తక్కువే అయినా వాటిని కాంబినేషన్లుగా మార్చి విద్యార్థులకు అందిస్తున్నారు. ఇప్పుడు సింగిల్ మేజర్ తేవడంతో మూడు సబ్జెక్టుల విధానం కనుమరుగైంది. కొత్త విధానంలో 54 మేజర్, మరో 50 మైనర్ సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థి తొలుత మేజర్ సబ్జెక్టు తీసుకుని, మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక మైనర్ తీసుకోవాలి. ఈ విధానంలో ఎక్కువ క్రెడిట్లతో పాటు బోధనలో ఫోకస్ అంతా మేజర్‌పైనే ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ఒకే సబ్జెక్టుపై పూర్తి పట్టు వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంటర్‌లో చదివిన మూడు గ్రూప్ సబ్జెక్టుల్లో దేన్ని ఎంచుకోవాలనేది విద్యార్థులకు సవాలుగా మారింది.
ఎందుకింత హడావిడి?
రాష్ట్రంలో గతేడాది 1.45లక్షల మంది డిగ్రీలో చేరారు. ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగిన నేపథ్యంలో డిగ్రీ అడ్మిషన్లు కూడా పెరుగుతాయి. ఇప్పుడు వారంతా డిగ్రీ ఎలా చదవాలనే దానిపై అయోమయంలో ఉన్నారు. ఇప్పటివరకూ ఉన్న కోర్సులు ఎలా మారతాయో, సమీపంలో ఉన్న కాలేజీల్లో వారికి కావాల్సిన కోర్సులో అందుబాటులో ఉంటాయో? లేదో? ఇప్పటికీ స్పష్టత రాలేదు. అధ్యాపకుల కొరతతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులు రద్దు చేశారు. దీంతో కొన్ని జిల్లాల్లో ఎంపీసీ విద్యార్థులకు గణితం మేజర్‌గా ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ప్రైవేటు కాలేజీలు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే రెండుసార్లు కోరారు. కానీ సవివరమైన ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో ఏ సబ్జెక్టు ఉంచాలో, ఏది తీసేయాలో వారికి అంతుపట్టడం లేదు. బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్టులను ఉంచి, మిగిలినవి తీసేస్తున్నారు. డిమాండ్ ఉన్నవాటిలోనూ కొన్నింటిని ఎత్తేస్తున్నారు. మూడు సబ్జెక్టుల విధానంలో తరగతుల నిర్వహణ సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు వాటిని వేర్వేరుగా విభజించి, పాఠాలు వేర్వేరుగా చెప్పించాలి. ఇది ఆర్థికంగా భారం అవుతుందనే ఆలోచనతో కొన్ని సబ్జెక్టులు తొలగించుకుంటున్నారు. అయితే ఇంత హడావిడిగా కాకుండా ఈ ఏడాది సమయం ఇచ్చి ఉంటే దీనిపై స్పష్టత వచ్చేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం చేస్తున్న హడావిడి కారణంగా ఏదో ఒక కోర్సులు అన్నట్టుగా దరఖాస్తు చేస్తున్నామని కాలేజీల ప్రతినిధులు చెబుతున్నారు.
కన్వర్షన్ ప్రక్రియ ఇలా...
ఉదాహరణకు ప్రస్తుతం బీఎస్సీ గ్రూపులో 50 సీట్లు అందుబాటులో ఉంటే వాటిని... బీఎస్సీ ఆనర్స్- గణితం/ బీఎస్సీ ఆనర్స్-ఫిజిక్స్/ బీఎస్సీ ఆనర్స్-కెమిస్ర్టీలో 50 సీట్లుగా మార్చుకోవచ్చు. ఒకవేళ రెండు సబ్జెక్టులు సమానంగా కావాలంటే 25 సీట్లతో ఒక్కో సబ్జెక్టును రూపొందించాలి. అదేవిధంగా 30సీట్లు ఉన్న బీఏ(హెచ్‌ఈపీ)ని బీఏ ఆనర్స్-చరిత్ర/ బీఏ ఆనర్స్-ఎకనామిక్స్/ బీఏ ఆనర్స్- పొలిటికల్ సైన్స్ల్‌లో 30 సీట్లుగా మార్చుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గతేడాది వరకూ ఆరుగురు విద్యార్థులున్నా కోర్సును ఉంచేవారు. కానీ కొత్త విధానంలో కనీసం 25మంది ఉంటేనే కోర్సు ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో విద్యార్థులున్నా కొన్ని కోర్సులు పూర్తిగా కనురమరుగు కానున్నాయి. కాగా, ఇప్పటి వరకూ బీఏకు రూ.10వేలు, బీఎస్సీకి రూ.12 నుంచి రూ.15వేలు ఫీజులుగా ఇస్తున్నారు. కొత్త విధానంలో అధ్యాపకుల అవసరం ఎక్కువని ప్రైవేటు కాలేజీలు భావిస్తున్నాయి. దీంతో నామమాత్రపు పెంపుతో ఈ విధానం అమలు చేయడం కష్టమంటున్నాయి. ఇంతవరకూ ఫీజులే నిర్ణయించకుండా విద్యార్థులకు ఏం చెప్పాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. గతేడాదితో ఫీజుల బ్లాక్ పీరియడ్ ముగిసింది. ఈ ఏడాది నుంచి రాబోయే మూడేళ్లకు ఇప్పుడు ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. ఉన్నత విద్యా కమిషన్ దీనిపై కసరత్తు పూర్తిచేసింది. కానీ ఫీజులు ఎంత అనేది వెల్లడించలేదు. పాత విధానానికి అనుగుణంగా కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇప్పుడు వాటికి అనుగుణంగా ఫీజులు నిర్ణయిస్తే, కొత్త కోర్సులు ఎలా అమలు చేయాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.