CID: ఇక చాలు.. వెళ్లండి..!

ABN , First Publish Date - 2023-03-07T01:19:27+05:30 IST

సీఐడీ విభాగంలో భారీగా మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అడ్డగోలుగా పని చేసి, శ్రుతిమించి వ్యవహరించిన పలువురు అధికారులపై చర్యలు మొదలయ్యాయి.

CID: ఇక చాలు.. వెళ్లండి..!

సీఐడీలో రెచ్చిపోయిన అధికారులకు షాక్‌

మాతృ శాఖకు సరెండర్‌.. ప్రాధాన్య పోస్టింగ్‌ ఇవ్వొద్దని సూచనలు

చిక్కుల్లో నలుగురు అదనపు ఎస్పీలు.. ఆరుగురు డీఎస్పీలు

కానిస్టేబుళ్లూ సుదూరంగా బదిలీ.. బాస్‌ చెప్పాడని ‘వివాదాల్లో’ జోక్యం

ఖరీదైన ఆస్తి రాయించుకున్నారు.. విశాఖ భూ వ్యవహారంలోనూ వేలు

ఉన్నతాధికారిని పక్కనపెట్టాక వెలుగులోకి వస్తున్న ఉదంతాలు

ఉన్నతాధికారి చెప్పిందే వేదమని అడ్డగోలు పనులు చేశారు. ఏది చేసినా బాస్‌ వెనకేసుకొస్తారనే అతి విశ్వాసం. ఏమి చేసైనా బాస్‌ అభిమానం చూరగొనేలా ప్లాన్లు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలిసినా.. చట్టానికి వ్యతిరేకంగా చేయలేమంటూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చట్టవిరుద్ధమైనా అన్నిటిలోనూ తలదూర్చారు. ఇప్పుడు మెడకు చుట్టుకున్నాక వారికి తెలిసివస్తోంది. సీఐడీ నుంచి ఉద్వాసనకు గురైన కొందరు ‘అతి’ అధికారుల బాగోతమిది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సీఐడీ విభాగంలో భారీగా మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అడ్డగోలుగా పని చేసి, శ్రుతిమించి వ్యవహరించిన పలువురు అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఆశించినట్లుగా పని చేస్తూనే... సొంతంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఉన్నతాధికారి సీఐడీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆయన స్థానంలో చట్టాన్ని గౌరవించే అధికారి రావడంతో గతంలో చేసిన పాపాలన్నీ బయటకు వస్తున్నాయి. తప్పులు ఎక్కడ జరిగాయో పోలీస్‌ బాస్‌కు చెబుతూ ఆయన ప్రక్షాళనకు దిగారు. తప్పులు చేసిన అధికారులను సీఐడీ నుంచి సాగనంపుతున్నారు. వారి గత చర్యలను బట్టి... సీఐడీ నుంచి రిలీవ్‌ చేసి అప్రాధాన్య పోస్టుల్లో నియమించడం, దూరంగా బదిలీ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. మరీ బరితెగించి దందాలకు దిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆర్థిక నేరాలు, అంతుచిక్కని హత్యలు, ఇతరత్రా తీవ్రమైన కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా న్యాయస్థానాలు సీఐడీకి అప్పగిస్తుంటాయి. వేలాది మందికి సంబంధించిన అగ్రిగోల్డ్‌ కేసు లాంటివి మాత్రమే ప్రజలకు తెలుస్తుంటాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా సీఐడీ కేసు పెడుతుందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది.

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తే చాలు సీఐడీ సిబ్బంది అర్ధరాత్రి ఇంటికొచ్చి గోడలు దూకి మరీ లాక్కెళ్లడం న్యాయస్థానాల వరకూ చేరింది. అయితే ప్రభుత్వ పెద్దల అభిమానం చూరగొనాలంటే ఇదే సరైన మార్గమని పసిగట్టిన సీఐడీ ఉన్నతాధికారి.. కింది స్థాయి అధికారులతో ఇలాంటి పనులు వరుసగా చేయించారు. సందట్లో సడేమియా అన్నట్లు తెరవెనుక మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మొదట్లో సీరియస్‌గా తీసుకోని వైసీపీ పెద్దలు.. ఆ తర్వాత పరిస్థితి చేయి దాటుతోందని తెలుసుకుని సదరు ఉన్నతాధికారిని పక్కన బెట్టడంతో చిన్న చేపలు ఇప్పుడు విలవిల్లాడుతున్నాయి. 13 జిల్లాల్లో నలుగురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, ఒక రిటైర్డ్‌ అదనపు ఎస్పీ చిక్కుల్లో పడినట్లు తెలిసింది. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాకు సంబంధించిన పోలీసులు సీఐడీ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. ఆరా తీస్తే.. వాళ్లకు నాన్‌ ఫోకల్‌ పోస్టింగ్స్‌ మాత్రమే ఇవ్వండి.. ప్రాధాన్యం ఉన్నవి ఇవ్వొద్దని సూచనలు కూడా ఇచ్చినట్లు తెలిసింది.

అంతా తానే..

సీఐడీలో ఒక డీఎస్పీ.. అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది రిటైరయ్యారు. అయినా సరే నాటి సీఐడీ బాస్‌ ఆయన్ను మళ్లీ తీసుకుని ‘కీలక’ పనులన్నీ అప్పగించారు. తీరా బాస్‌ బదిలీ కాగానే ఆయన లీలలు బయటపడ్డాయి. ఉన్నతాధికారులు పిలిచి అడిగారు. ‘నాదేముంది సార్‌.. అంతా మీకు తెలుసు.. నేను కేవలం పాత్రధారినే’ అని ఆయన అనడంతో.. సరే ఇక నీ సేవలు చాలు.. వెళ్లిపొమ్మని పంపించేశారు. బాస్‌ చెప్పారని రూ.50 కోట్ల విశాఖ భూ వ్యవహారంలో వేలుపెట్టిన మరో అధికారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అటువైపు అధికార పార్టీకి చెందిన కీలక నేత ఉండడంతో కథ సీఎం కార్యాలయానికి చేరింది. ఇంకేముంది.. అక్కడి అధికారి బతుకు జీవుడా అంటూ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆయన దగ్గర పనిచేసిన కానిస్టేబుళ్లు దూరంగా ఉన్న జిల్లాలకు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన హోటల్‌ వివాదంలో సీఐడీ అధికారులు తలదూర్చారు. జిల్లాకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని తీసుకెళ్లి 4 రోజులు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. కోట్లాది రూపాయల వ్యవహారం సెటిల్‌ చేసినట్లు తెలిసింది. డబ్బులు ఇచ్చుకోలేని ఆ వ్యక్తి అత్యంత ఖరీదైన ఆస్తిని రాసివ్వాల్సి వచ్చింది.

సముద్ర తీర ప్రాంతంలోని ఒక గెస్ట్‌ హౌస్‌లో జరిగిన ఉదంతాన్ని.. అతడు తన నాయకుడికి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడని.. విస్తుపోయిన ఆ సీనియర్‌ ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళ్లి వాపోయినట్లు తెలిసింది. దీంతో స్వయంగా ఆరా తీసిన ప్రభుత్వ పెద్ద.. ఇలా జరుగుతుంటే తనకెందుకు చెప్పలేదని పోలీసు ఉన్నతాధికారులకు క్లాస్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని ఒక వ్యాపారితో విదేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐకి హెచ్చరికలతో కూడిన ఫోన్లు సీఐడీ నుంచి వెళ్లాయి. మర్యాదగా పరిష్కరించుకో.. లేదంటే రెడ్‌ కార్నర్‌ నోటీసు ఇస్తాం.. ఇక్కడకు తీసుకొచ్చామంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేవు.. అంటూ బెదిరించారు. దిక్కుతోచని ఎన్‌ఆర్‌ఐ తనను ఇబ్బంది పెట్టొద్దని ప్రాధేయపడ్డారు. ప్రతిఫలంగా కోట్లాది రూపాయల షేర్లు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఆయన ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో.. నిజాన్ని నిగ్గుతేల్చే బాధ్యతను ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2023-03-07T01:19:27+05:30 IST