OHRK Retired IAS PV Ramesh : ఆ ఐఏఎస్ వల్లే ఏపీకి ‘హోదా’ రాలేదు
ABN , First Publish Date - 2023-08-28T05:02:45+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారేనని.. ఆయన ఇప్పుడు ఏపీలో ప్రత్యేక సీఎ్‌సగా పనిచేస్తున్నారని.. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ అన్నారు. అమరావతిని పక్కనపెట్టడం, మూడు రాజధానులని అనడం..
ఆయన ఇప్పుడు ఏపీలో ప్రత్యేక సీఎస్..
అప్పట్లో తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారు
చంద్రబాబు గెలవడంతో ఏపీకెళ్లారు
ఆ రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధేస్తోంది
అమరావతిని పక్కనపెట్టడం పెద్ద దెబ్బ
ల్యాండ్ పూలింగ్ పద్ధతి ఎక్కడా లేదు
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారేనని.. ఆయన ఇప్పుడు ఏపీలో ప్రత్యేక సీఎ్‌సగా పనిచేస్తున్నారని.. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ అన్నారు. అమరావతిని పక్కనపెట్టడం, మూడు రాజధానులని అనడం ఏపీ అభివృద్ధికి ఎంతో నష్టం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు పంచుతూ పోతే ప్రజల జీవితాలు బాగుపడవని.. రాజకీయ నాయకులు వారిని ఓటింగ్ యంత్రాల్లా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. తానొక సాధారణ కుటుంబంలో పుట్టానని.. ఏడేళ్లవరకూ అలంపూర్‌లో పెరిగానని రమేశ్ తెలిపారు. ‘‘మా అమ్మ ప్రైవేట్ టీచర్. నాన్న సెంట్రల్ ఎక్సైజ్‌లో చిరుద్యోగి. ఏడేళ్ల వరకూ అలంపూర్‌లో పెరిగాను. తర్వాత నాన్నకు బదిలీ అవడంతో విజయవాడ వెళ్లాం. నా విద్యాభ్యాసం అక్కడే. 16 ఏళ్లకే వెల్లూరు మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరిలో సీటు పొందాను. నిద్రాహారాలు మాని చదివాను. ఎంబీబీఎస్ తర్వాత ఏం చదవాలని బాగా ఆలోచించాను. సమాజానికి సేవ చేయాలన్న తపన బాగా ఉండేది. ఐఏఎస్ చదివితే దేశానికి సేవ చేయవచ్చని మిత్రుడు చెబితే సివిల్స్ రాశాను. ఆలిండియాలో 33వ ర్యాంకు సాధించాను’’ అని ఆయన వెల్లడించారు.
తాను ఆదిలాబాద్‌లో సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు మంత్రి బోడ జనార్దన్ తనపై నోరు పారేసుకున్నారని.. ఒక దశలో చేయి కూడా ఎత్తారని.. అప్పుడు నాటి సీఎం ఎన్టీఆర్ తనను పిలిపించి.. ‘‘బ్రదర్.. అయాం విత్ యూ.. బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేయండి’’ అన్నారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి కూడా రమేశ్ వివరించారు. ‘‘అప్పట్లో రాష్ట్ర విభజన అంశాలను నేను, రామకృష్ణారావు.. అనే ఇద్దరు అధికారులమే పరిష్కరించాల్సి వచ్చింది. విభజన నాటికి అన్ని అంశాలకూ పరిష్కారాలు కనుక్కోవాలని మేమిద్దరం ఆ రోజుల్లో రోజుకు 20 గంటలు పనిచేశాం. ఏపీకి ప్రత్యేక హోదా అప్పట్లోనే వచ్చేయాల్సింది. కానీ, రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారి. ఆయన ఇప్పుడు ఏపీలో పెద్ద హోదాలో ఉన్నారు. 2014 ఫిబ్రవరి 20న హోదాపై మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారు. 1 మార్చిన క్యాబినెట్ ఆమోదించింది. అదే రోజున ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నోటిఫికేషన్ ఇచ్చారు. మార్చి 5న రాష్ట్ర అపాయింటెడ్ డేట్‌గా జూన్ 2వ తేదీని ప్రకటించారు. అదేరోజు ప్రత్యేక హోదాకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ ప్రణాళికా సంఘాన్ని కోరింది. దానిపై ప్లానింగ్ కమిషన్‌తో నేను ఐదు సమావేశాలు పెట్టించాను. అది ఎన్నికల సమయం కాబట్టి పట్టించుకునే వారు లేక నేనే రంగంలోకి దిగి ప్రణాళికా సంఘం కార్యదర్శిని చాలాసార్లు కలిసి హోదా అంశాన్ని పూర్తి చేయాలని కోరాను. నేను ఐదు మీటింగ్స్ పెట్టిస్తే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రతినిధి రాలేదు. ఆ శాఖలో ఆ రోజు ఆ బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఈ రోజున ఆంధ్ర ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఆయన ఒక్క సమావేశానికి వచ్చి ఉంటే హోదా వచ్చేసి ఉండేది. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు వస్తాయి.. ఆ తర్వాత రాజెవరో రెడ్డెవరో అని భావించి ఎంతో కష్టపడి దానికి ముందు రోజైన మే 15న ప్రత్యేక హోదాకు సంబంధించిన చివరి మీటింగ్ పెట్టించాను. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే నావైపు నుంచి ఏ అభ్యంతరం లేదని, ఈ రోజే హోదా నోటిఫికేషన్ ఇచ్చేద్దామని ప్రణాళికా సంఘం కార్యదర్శి చెప్పారు. ఆ కీలకమైన మీటింగ్‌కు ఆ పెద్దమనిషి రాలేదు. ఆర్థిక శాఖ నుంచి ఎవరినైనా పంపినా సరిపోయేది. అదీ చేయలేదు. దాంతో ఏపీకి హోదా రాకుండా పోయింది. ఆ రోజున ఆ పెద్దమనిషి తెలంగాణ కేడర్ కావాలని కోరుకుని.. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లా రు. అప్పుడున్న పరిస్థితి ఏమిటంటే రాష్ట్రం విడిపోతే తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రలో జగన్ అధికారంలోకి వస్తారని ఐఏఎ్‌సలు భావించారు’’ అని వివరించారు. ప్రస్తుతం ఆయన సర్వీసులోనే ఉన్నారని తెలిపారు.
చంద్రబాబు శ్రమ..
ఏపీలో చంద్రబాబు సర్కారు వచ్చాక ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న తాను పూర్తిగా రాష్ట్ర విభజన అంశాలపై పని చేశానని.. 2014 మే 22 నుంచి 2016 డిసెంబరు వరకూ సర్వీసులో ఉన్న కాలంలో ఏపీకి సంబంధించిన అన్ని విషయాల్లో తాను ఉన్నానని పీవీ రమేశ్ వెల్లడించారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ‘‘ఆ రోజు చంద్రబాబు చేసిన ఆలోచనల్లో మేమం తా కూడా పాలుపంచుకున్నాం. ల్యాండ్ పూలింగ్ అనేది అప్పటి వరకూ ప్రపంచంలోనే ఎక్కడా అమలు చేయని పద్ధతి. గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం, అక్కడి నిపుణులు, జపాన్ ప్రభుత్వం, చైనా ప్రతినిధులు తదితరులంతా విజయవాడకు వచ్చి ఆ ప్రణాళికలో పాలు పంచుకున్నారు. ఒక్క రోజులో ఏదీ రూపొందదు. అమరావతి నిర్మాణం వెనుక విజన్ ఉంది. ఇక వైజాగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని అనేక సంస్థలను తీసుకొచ్చాం. 13 జాతీయ సంస్థలను రాష్ట్రానికి తెచ్చాం. మౌలికవసతుల కల్పనకు ప్రపం చ బ్యాంకు, ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు, న్యూడెవల్‌పమెంట్ బ్యాంకు, జైకాకు ప్రతిపాదనలు పంపాం. ఆ రెండేళ్లలోనే రూ.28 వేల కోట్లకు అప్రూవల్స్ తెచ్చాం. ఇదొక రికార్డు. పెట్టుబడులు తీసుకురావడానికి చైనా, జపాన్ పెట్టుబడిదారులతో చాలా సమావేశాలు నిర్వహించాం. చంద్రబాబు అయితే ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి నాన్‌స్టా్‌పగా రాత్రి 12 వరకూ మీటింగ్స్ జరిపేవారు. పన్నెండున్నరకు కూర్చుని రేపటి ప్రోగ్రాం ఏమిటని మాట్లాడుకునే వాళ్లం. మర్నాడు మళ్లీ ఉదయం ఏడు గంటలకు మొదలయ్యేది.’’ అని రమేశ్ తెలిపారు.