Simhachalam: సింహాచలం క్షేత్ర చరిత్రలో ఇది దుర్దినం: స్వరూపానందేంద్ర
ABN , First Publish Date - 2023-04-23T20:08:21+05:30 IST
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి
సింహాచలం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి (Swaroopanandendra Saraswathi) తీవ్రంగా మండిపడ్డారు. భక్తులకు దేవుడిని దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శనివారం అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ఏర్పాట్లు, అధికార యంత్రాంగం తీరును చూస్తే తాను దర్శనానికి ఎందుకు వచ్చానా అని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణ ఏర్పాట్లు గతంలో ఎన్నడూ జరగలేదని, గర్భాలయం, క్యూలైన్లలో పోలీసుల జులుం పెరిగిపోయిందన్నారు. భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఉత్సవ నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. స్వామివారి దర్శన టికెట్లను పోలీసుల ద్వారా అమ్మించడమేమిటని స్వరూపానందేంద్ర ప్రశ్నించారు.
ఇంత పెద్ద దేవస్థానానికి ఆరు నెలలుగా కార్యనిర్వహణాధికారి లేకపోవడం అత్యంత దారుణమన్నారు. భక్తులపై ఎవరికీ కనికరం లేదని, అంతరాలయాన్ని చూస్తే భయమేసిందని, ఆచారం, సంప్రదాయం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింహాచలం క్షేత్ర చరిత్రలో ఇది దుర్దినంగా ఆయన అభివర్ణించారు. క్యూలో భక్తులు పడుతున్న అవస్థలు చూస్తే కళ్లవెంట నీళ్లొచ్చాయని, దేవుడి దర్శనానికి ఎందుకు వచ్చానా అనిపించిందన్నారు. సింహగిరి భక్తులతో నిండిపోయిందని, నిర్వహణ కొరవడడంతో కిక్కిరిసిన క్యూలైన్లు ముందుకు కదలక ఎక్కడికక్కడ స్తంభించాయన్నారు. అసలు ఈ వీఐపీలు ఎందుకు వచ్చారని ప్రశ్నించిన స్వరూపానందేంద్ర, వారి సేవలో అధికారులు తరించారని విమర్శించారు. దేవుడిని పేదలకు దూరం చేయాలనుకోవడం సరైన విధానం కాదంటూ స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు.