LOKESH : బీసీలకు జగన్‌ వెన్నుపోటు

ABN , First Publish Date - 2023-02-17T03:04:13+05:30 IST

‘ఒక్క చాన్స్‌ అన్న జగన్‌కు అధికారం ఇచ్చి.. పాలిచ్చే ఆవును కాదనుకుని, ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మదమెక్కిన దున్నను ఈసారి తరిమితరిమి కొట్టాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

LOKESH : బీసీలకు జగన్‌ వెన్నుపోటు

కామధేనువును కాదని.. ఎగిరి తన్నే దున్నను తెచ్చుకున్నారు

విద్యావ్యవస్థలో పెను మార్పులు తెస్తాం

వెళ్లిపోయిన కంపెనీలన్నింటినీ రప్పిస్తాం

ఏటా జాబ్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం: లోకేశ్‌

21వ రోజు 17.2 కి.మీ. నడక

lokesh-(2).jpg

కేవీబీపురం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ‘ఒక్క చాన్స్‌ అన్న జగన్‌కు అధికారం ఇచ్చి.. పాలిచ్చే ఆవును కాదనుకుని, ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మదమెక్కిన దున్నను ఈసారి తరిమితరిమి కొట్టాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర 21వ రోజు(గురువా రం) తిరుపతి జిల్లా సత్యవేడులోని కేవీబీపురం మండలం రాయపేడు నుంచి అదే మండలం బైరాజుకండ్రిగ వరకు 17.2 కిలోమీటర్లు కొనసాగింది. మార్గమధ్యంలో పొలం పనులు చేసుకుంటున్న రైతు కూలీలతో లోకేశ్‌ సెల్ఫీలు దిగి, వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళా కార్మికులు ప్రయాణించే డిక్సన్‌ కంపెనీ బస్సు ఎక్కి, ఇలాంటి పరిశ్రమలు ఎన్నో టీడీపీ హ యాంలో వచ్చాయంటూ వారితో సంభాషించా రు. యువత, రైతులు, ముదిరాజ్‌ సామాజిక వర్గీయులతో మాట్లాడారు. 21 రోజుల్లో మొత్తం 278.5 కిలోమీటర్లు లోకేశ్‌ నడిచారు.

lokesh-(3).jpg

నిరుద్యోగప్రదేశ్‌గా రాష్ట్రం..

‘జగన్‌ పాలనలో ఏపీ నిరుద్యోగప్రదేశ్‌గా మారిపోయింది. జగన్‌ ప్యాలె్‌సలో ఉంటే, యు వత నడిరోడ్డు మీద నిలబడింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాం. సీమను ఆటోమొబైల్‌-ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా తయారుచేశాం. ప్రభుత్వ రంగంలో 32వేల పోస్టులు భర్తీ చేశాం. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో నిరుద్యోగులు కనిపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం. పరీక్ష నుంచి నియామకం తేదీ వరకు ముందే ప్రకటిస్తాం. సైకో పోయి సైకిల్‌ పాలన వచ్చిన వెంటనే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలన్నీ తిరిగివస్తాయి’ అని లోకేశ్‌ వివరించారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్‌ను, పాడిపరిశ్రమను, ఆక్వాకల్చర్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్రాన్ని ఒక్కచాన్స్‌ అంటూ గద్దెనెక్కిన జగన్‌ సర్వనాశనం చేశాడు. ముదిరాజ్‌ సోదరుల పుట్టినిల్లు టీడీపీ. ఆదరణ పథకాన్ని చంపేసి జగన్‌ బీసీలకు వెన్నుపోటు పొడిచారు. బీసీ మంత్రికి మరోసారి ఛాలెంజ్‌ చేస్తున్నా, ఎవరి హయాంలో ఏం చేశామో చర్చకు నేను సిద్ధం. మండలి, శాసనసభలో ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తాం’ అనిప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని తనను కలిసిన పంచాయతీరాజ్‌ చాంబర్‌ ప్రతినిధులకు లోకేశ్‌ హామీ ఇచ్చారు.

lokesh-(3).jpg

టీడీపీ జెండాలు పీకేసిన పోలీసులు..

పాదయాత్ర మార్గంలో టీడీపీ శ్రేణులు కట్టిన జెండాలను, బ్యానర్లను పోలీసులు తొలగించి వాహనాల్లో తరలించారు. ఇదేమి న్యాయమని ప్రశ్నించిన కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. ‘పోలీసులూ నన్ను ఇబ్బంది పెడితే రేపు ఇబ్బంది పడేది మీరే. ఐపీఎస్‌ అధికారి రఘురామిరెడ్డి తాడేపల్లి ప్యాలె్‌సలో జగన్‌ సంక నాకుతున్నాడు. నడిరోడ్డుపైనే పడుకుంటా. ప్రజల మధ్యే ఉంటా’ అని లోకేశ్‌ అన్నారు.

Untitled-7.jpg

నేను తెచ్చిన డిక్సన్‌ కంపెనీ ఇది

పాదయాత్రలో లోకేశ్‌కు ఎదురుగా డిక్సన్‌ కంపెనీ బస్సు కనిపించింది. బస్సు ఎక్కి అందులో ఉన్న మహిళా సిబ్బందితో ఆయన మాట్లాడారు. తాను ఐటీ మంత్రి గా ఉన్నప్పుడు డిక్సన్‌ కంపెనీని తీసుకొచ్చానని, అక్కాచెల్లెమ్మలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. అష్టకష్టాలు పడి తెచ్చిన కంపెనీలు పచ్చని చెట్లు అయ్యాయని, ఆ నీడన ఉపాధి దొరికిందని, ఇంతకుమించిన ఆనందం ఏముంటుందన్నారు.

Updated Date - 2023-02-17T03:04:14+05:30 IST