Lokesh Padayatra : లోకేశ్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధం

ABN , First Publish Date - 2023-01-14T02:53:37+05:30 IST

యువ గళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టబోతున్న పాదయాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. ఈ నెల 27న కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన తన యాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

Lokesh Padayatra : లోకేశ్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధం

కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు

నడక, సమావేశాల కలబోతగా ప్రారంభ ఘట్టం

తొలి రోజు లోకేశ్‌తో యువ బీసీ నేతలు

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): యువ గళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టబోతున్న పాదయాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. ఈ నెల 27న కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన తన యాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 400 రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఆయన సుమారుగా 4,000 కిలోమీటర్ల దూరం నడవనున్నారు. ఆయన ఈ యాత్ర కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఈ బృందం రోజువారీ పాదయాత్ర కార్యక్రమం ఎలా ఉండాలో ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. మొదట పర్యటన జరిగే కుప్పం నియోజకవర్గం వరకూ ఈ ప్రణాళిక ఇప్పటికే ఖరారైంది. దీని ప్రకారం కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటన మూడు రోజులు జరగనుంది. మొత్తం 29 కిలోమీటర్లు సాగనున్నది. నడక, సమావేశాల కలబోతగా ఈ ప్రారంభ ఘట్టం ఉండబోతోంది. ఖరారైన కార్యక్రమం ప్రకారం ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం వరద రాజస్వామి ఆలయంలో పూజ చేసి ఆయన తన యాత్ర ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీకి అండగా నిలిచిన కొందరు సీనియర్‌ నేతలతో ఆయన ఈ పూజ తర్వాత ఆశీర్వచనం తీసుకొంటారు.

తర్వాత కుప్పం పాత మసీదులో ముస్లిం మత పెద్దలతో సమావేశం అవుతారు. అధికార పార్టీ పెట్టిన తప్పుడు కేసులతో ఇబ్బంది పడుతున్న బాధితులను 4 గంటలకు కలుస్తారు. సాయంత్రం ఐదు గంటలకు కుప్పం హెచ్‌పీ పెట్రోల్‌ బంకు పక్కన ఉన్న స్థలంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రభుత్వాసుపత్రి, శెట్టిపల్లి క్రాస్‌, బెగ్గి లింగంపల్లి క్రాస్‌ మీదుగా పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. దానితో మొదటి రోజు పాదయాత్ర ముగుస్తుంది. తొలిరోజు యాత్రలో కొందరు బీసీ యువ నేతలు ఆయనతోపాటు పాల్గొంటున్నారు. వీరిలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, పలాస ఇన్‌చార్జి గౌతు శిరీష, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ యాదవ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, పార్టీ కార్యదర్శి డాక్టర్‌ శ్యామ చంద్ర శేషు, చీపురుపల్లి ఇన్‌చార్జి కిమిడి నాగార్జున, యువత నేతలు రాయపల్లి వెంకట్‌, గుత్తికొండ ధనుంజయ్‌ తదితరులు ఉంటున్నారు. రెండో రోజు యాత్ర పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల నుంచి ప్రారంభమై శాంతిపురం వద్ద ముగుస్తుంది. రెండో రోజు 10 కిలోమీటర్లు, మూడో రోజు 11 కిలోమీటర్ల దూరం సాగుతుంది. ఈ మూడు రోజుల్లో ఆయన కుప్పం పట్ణణంగాక పదమూడు గ్రామాలను సందర్శించనున్నారు.

Updated Date - 2023-01-14T03:13:12+05:30 IST