Share News

శ్రీధరా.. ఇదేం చోద్యం!

ABN , First Publish Date - 2023-10-23T02:17:52+05:30 IST

వైసీపీ నేతలు ఆఖరికి దేవస్థానాల్లో కూడా తమ వ్యక్తిగత వేడుకలు నిర్వహించే స్థాయికి బరితెగించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పుట్టినరోజు వేడుకలకు శ్రీవారి క్షేత్రం ప్రధాన వేదిక కావడం వివాదాస్పదమైంది.

శ్రీధరా.. ఇదేం చోద్యం!

చిన్న తిరుపతిలో వైసీపీ శ్రేణుల హల్‌చల్‌

పది వేల మందికి ప్రత్యేకించి భోజన ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు

వంటలు చేస్తుండగా ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలు

వివాదాస్పదమైన ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పుట్టినరోజు వేడుక

ద్వారకాతిరుమల, అక్టోబరు 22: వైసీపీ నేతలు ఆఖరికి దేవస్థానాల్లో కూడా తమ వ్యక్తిగత వేడుకలు నిర్వహించే స్థాయికి బరితెగించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పుట్టినరోజు వేడుకలకు శ్రీవారి క్షేత్రం ప్రధాన వేదిక కావడం వివాదాస్పదమైంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పార్టీ కార్యకర్తలు.. వైసీపీ ఎంపీ ఫొటోలతో కూడిన టీషర్టులు, పార్టీ జెండాలతో హల్‌చల్‌ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమేనని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు రోజూ వకుళమాత నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం పరిపాటి. కానీ, ఎంపీ పుట్టినరోజు పురస్కరించుకుని కొండపైనే దేవస్థానం వైజయంతి కల్యాణ మండపంలో ప్రత్యేకించి దాదాపు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎంపీ సొంత మండలమైన కామవరపుకోట నుంచి పార్టీ శ్రేణులు భారీగా పాదయాత్రగా రాగా, వారికి స్వామివారి సేవకు వచ్చిన భక్తులతో దేవస్థానం అధికారులే భోజనాలు వడ్డించడానికి ఏర్పాట్లు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకుముందు ఎంపీ శ్రీధర్‌ స్వామివారిని దర్శించుకోగా, స్వామివారి చిత్రపటంతో ఈవో సత్కరించారు. అనంతరం ఎంపీ శ్రీధర్‌ వైజయంతి కల్యాణ మండపంలోనే పార్టీ శ్రేణులతో కలిసి భోజనం చేశారు. గతంలో ఎంపీ ఈ దేవస్థానానికి విరాళమిచ్చారని, అందువల్ల ఆయన కోరిన రోజున భోజనాలు ఏర్పాటు చేశారని కొందరు చెబుతుండగా, ఎంపీ విరాళమేదీ ఇవ్వలేదని మరికొందరు చెబుతున్నారు. ఎంపీ పుట్టిన రోజు వేడుకల కోసం అదనంగా వంటలు చేస్తుండగా గ్యాస్‌ లీకై ముగ్గురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు.

Updated Date - 2023-10-23T02:17:52+05:30 IST