Muneru : మునేరు ఉగ్రరూపం

ABN , First Publish Date - 2023-07-28T03:29:20+05:30 IST

మునేరు మహోగ్ర రూపం దాల్చింది. ప్రమాదస్థాయిని మించి పరవళ్లు తొక్కుతోంది. కీసర వంతెన సమీపంలో నీళ్లు రోడ్డెక్కడంతో విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వరద పెరుగుతూనే ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు.

Muneru : మునేరు ఉగ్రరూపం

విజయవాడ-హైదరాబాద్‌ హైవే బంద్‌

వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు

తిరువూరు, ఖమ్మం, మధిర మీదుగా ట్రాఫిక్‌ మళ్లింపు

గ్రామాలను చుట్టుముట్టిన వరద... ముంపులో వేల ఎకరాలు

18 ఏళ్ల తర్వాత మళ్లీ పరవళ్లు తొక్కుతున్న మునేరు

కంచికచర్ల/నందిగామ రూరల్‌, జూలై 27: మునేరు మహోగ్ర రూపం దాల్చింది. ప్రమాదస్థాయిని మించి పరవళ్లు తొక్కుతోంది. కీసర వంతెన సమీపంలో నీళ్లు రోడ్డెక్కడంతో విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వరద పెరుగుతూనే ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. కీసర వంతెన-నందిగామ మండలం ఐతవరం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై మునేరు 2అడుగుల ఎత్తున పొంగుతోంది. దీంతో సాయంత్రం 4.30గంటల నుంచి కంచికచర్ల- నందిగామ మధ్య, విజయవాడ, హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు బంద్‌ అయ్యాయి.

2005 తర్వాత విశ్వరూపం.. మునేరు 2005లో మహోగ్రరూపం దాల్చింది. అప్పట్లో 2లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. 2రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. 18ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి మునేరు విశ్వరూపం చూపించింది. చిల్లకల్లు నుంచి వైరా మార్గంలో వత్సవాయి మండలం లింగాల కాజ్‌వేపై మునేరు ఐదారు అడుగుల ఎత్తున పొంగుతోంది. మూడు రోజులుగా స్టేట్‌ హైవే బంద్‌ కావటంతో తెలంగాణవైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెనుగంచిప్రోలు వంతెనను అధికారులు మూసివేశారు. పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. కేశఖండనశాలలోకి వరద ప్రవేశించింది. వత్సవాయి మండలం లింగాల శివాలయాన్ని ప్రవాహం చుట్టిముట్టింది. కృష్ణానదిలో నీళ్లు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా నందిగామ మండలం కంచెల గ్రామానికి చెందిన రైతు రామిరెడ్డి ఏడుకొండలు చెరుకుతోటలో ఎరువు వేసేందుకు గురువారం 10మంది కూలీలను తీసుకెళ్లారు. తిరిగి ఇళ్లకు బయలుదేరుతుండగా, మునేరుకు భారీ వరద వచ్చింది. వీరికోసం అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, సాంబయ్య తాళ్లు తీసుకెళ్లారు. మొత్తం 13 మందీ చిక్కుకుపోయారు. వారందరినీ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఒడ్డుకు చేర్చాయి. చందర్లపాడు మండలం విభరింతలపాడు వద్ద కృష్ణానది లంక భూముల్లో చిక్కుకున్న పది మందిని, కంచికచర్ల మండలం మోగులూరు వద్ద చిక్కుకున్న ఐదుగురిని స్థానికులు రక్షించారు. నందిగామ మండలం మాగల్లు వద్ద మునేటిలో ఒక కుటుంబంలో ముగ్గురు చిక్కుకుపోయారు.

Updated Date - 2023-07-28T03:29:20+05:30 IST