Yuvagalam: లోకేశ్‌ను కలిసిన నందమూరి రామకృష్ణ
ABN , First Publish Date - 2023-06-23T21:33:20+05:30 IST
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు.
సూళ్ళూరుపేట: యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు. బాలాయపల్లి మండలం నిడిగల్లు గ్రామం వద్ద ఆయన లోకేశ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మేనమామ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్‌కు సంఘీభావం ప్రకటించిన రామకృష్ణ కొంత దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర ముగించిన లోకేశ్ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రవేశించారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఓజిలి మండలంలో రాత్రి బస చేశారు.
బ్రాహ్మణులతో రచ్చబండ
బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో నియోజకవర్గంలోని బ్రాహ్మణులతో లోకేశ్ రచ్చబండ నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విన్నారు. అనంతరం మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో బ్రాహ్మణుల్లో పేదరికాన్ని గుర్తించారన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ కార్పొరేషన్ ద్వారా రూ. 2085 కోట్లు ఖర్చు చేసి బ్రాహ్మణులను ఆదుకోవడం జరిగిందన్నారు. ఆలయ అర్చకుల గౌరవ వేతనాలను కూడా పెంచామన్నారు. ప్రస్తుతం తాను చేపట్టిన పాదయాత్రలో బ్రాహ్మణులను బాధితులుగా గుర్తించానన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, బ్రాహ్మణులను బాధితులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను పటిష్టం చేసి ఉన్నత విద్య అయిన పీజీ, విదేశీ చదువుకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామన్నారు.