Share News

Nara Lokesh : జైత్రయాత్ర!

ABN , Publish Date - Dec 20 , 2023 | 03:40 AM

తెలుగుదేశం-జనసేన కూటమి జైత్రయాత్ర ప్రారంభమైందని, జన సునామీ తీర్పును సైకోలు, దాడులు, కేసులు అడ్డుకోలేవని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు.

Nara Lokesh : జైత్రయాత్ర!

యువగళం పాదయాత్ర.. మా కూటమిది..

సైకో సర్కారును దించడమే టీడీపీ, జనసేన ఉమ్మడి లక్ష్యం

స్టాన్‌ఫోర్డ్‌ నేర్పని పాఠాలు పాదయాత్ర నేర్పింది

కష్టాల కన్నీటి తడి చూస్తూ వచ్చా..

గద్దెనెక్కితే ఆ కన్నీటిని తుడుస్తాం

తప్పుడు అధికారులను వదిలిపెట్టం

ప్రతి హామీ అమలు చేస్తాం

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం

ఉద్యోగులకు కచ్చితంగా 1నే జీతాలు

అంగన్‌వాడీ, ఆశాలను ఆదుకుంటాం

విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే!

తప్పుడు మార్గాల్లో టీడీపీ శ్రేణులను వేధించిన ప్రతి అధికారిపైనా విచారణ జరిపిస్తాం. తప్పులు రుజువైతే ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయిస్తాం. కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.

యువతకు 40 శాతం టికెట్లు తప్పకుండా ఇవ్వాలనే భావిస్తున్నాం. మంచి అభ్యర్థులను అన్వేషిస్తున్నాం. కొందరికి ఎంపీలుగా కూడా ఇవ్వాలనుకుంటున్నాం.

రాష్ట్రంలో ఉన్న అవినీతి ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ సిద్ధపడితే ఆ పార్టీని మా కూటమిలోకి ఆహ్వానిస్తాం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రంలోని 25 మంది ఎంపీలను మాకిస్తే మనం అనుకున్న ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది.

గతంలో ప్రభుత్వమే పార్టీని నడిపేది. ఈసారి కచ్చితంగా మార్పు ఉంటుంది. పార్టీ కేంద్ర బిందువుగా ఉండి ప్రభుత్వాన్ని నడుపుతుంది.

నేను 97 నియోజకవర్గాల్లో నడిచాను. క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడగలిగాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పాలంటే కనీసం రెండ్రోజులు పడుతుంది.

- లోకేశ్‌

3 నెలలు ఓపిక పడితే దద్దమ్మ ప్రభుత్వం పోతుంది

బీజేపీ కలిసొస్తే ఆహ్వానిస్తాం

కోడ్‌ వచ్చాక అభ్యర్థుల ప్రకటన

మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తా

అర లక్ష మెజారిటీతో గెలుస్తా

మా ముఖ్యమంత్రి చంద్రబాబే

పార్టీ ఏ బాధ్యత ఇస్తే అది చేస్తా

అభివృద్ధి, సంక్షేమం కావాలన్నా.. కరెంటు చార్జీలు తగ్గాలన్నా మాకే ఓటేయాలి: లోకేశ్‌

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం-జనసేన కూటమి జైత్రయాత్ర ప్రారంభమైందని, జన సునామీ తీర్పును సైకోలు, దాడులు, కేసులు అడ్డుకోలేవని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. జగన్‌ అవినీతి పాలనపై పోరాటానికి బీజేపీ ముందుకొస్తే తమలో కలుపుకోవడానికి ఆహ్వానిస్తామని ప్రకటించారు. తప్పుడు హామీలిచ్చి.. జగన్‌ మాదిరిగా పరదాల చాటున తిరగాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. చేయగలిగిన హామీలే ఇస్తున్నామని.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తామని తెలిపారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం విశాఖ సమీపంలో ముగిసిన సందర్భంగా మంగళవారం ‘ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాల కన్నీటి తడి చూస్తూ వచ్చానని.. ఎన్ని వర్గాల ప్రజలు, ఎన్ని కష్టాలు, అవస్థలు పడుతున్నారో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ‘పాదయాత్రకు ముందు లోకేశ్‌ వేరు...ఈ లోకేశ్‌ వేరు. ఈ లోకేశ్‌ జన జీవితాన్ని ప్రత్యక్షంగా చూశాడు. విన్నాడు. అధికారంలోకి వచ్చాక ప్రజల కన్నీరు తుడిచి సమస్యలకు పరిష్కారాలు చూపించడమే ప్రథమ లక్ష్యం’ అని ఉద్ఘాటించారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ నేర్పని పాఠాలను పాదయాత్ర నేర్పిందన్నారు. మూడు నెలలు ఓపిక పడితే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పోతుందని.. టీడీపీ-జనసేన జైత్రయాత్రతో కొత్త ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..

ప్రశ్న: టీడీపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు?

లోకేశ్‌: ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. ఈ లోపు కనీసం 150 నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థో త్వరలోనే స్పష్టత ఇస్తాం. జనసేనతో పొత్తు ఉంది కాబట్టి దానిని కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తాం.

వైసీపీ అభ్యర్థులను మారిస్తే ఫలితం ఉంటుందా?

మనింట్లో చెత్తను పక్కింటి ముందు పోస్తామా? జగన్‌ అదే పనిచేస్తున్నాడు. ఒకచోట పనికిరారని తేల్చినవాళ్లను మరోచోటకు పంపిస్తున్నాడు. దీనిని ప్రజలు ఆమోదించరు.

బీజేపీతో పొత్తుపై మీ పార్టీ వైఖరేంటి?

రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి కేంద్ర సహకారం కోసం అప్పట్లో బీజేపీతో కలిసి పనిచేశాం. అభివృద్ధి విషయంలోనే పేచీ తప్ప వేరే ఏమీ లేవు. హోదా, విభజన హామీలు అమలు కాలేదని తప్పుకొన్నాం. ఇప్పు డు రాష్ట్రం పరిస్థితి విభజన నాటి కంటే వందరెట్లు ఘోరంగా ఉంది. కేంద్ర సహాయం మరింత కావాలి.

జనసేనతో మీ పొత్తు సాఫీగా ఉంటుందా?

కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. వాటిని మేం పరిష్కరించుకోగలం. టీడీపీ, జనసేన ఉమ్మడి లక్ష్యం ఈ సైకో ప్రభుత్వాన్ని దించడం. ఆ దిశగా కలసి పనిచేసి, లక్ష్యం సాధిస్తాం.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సీఎం ఎవరు?

చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారు. నేను పార్టీ కోసం పనిచేస్తాను. నాకు ఏ బాధ్యత ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది.

అభివృద్ధి, సంక్షేమం రెండూ చేయలేక వైసీపీ చతికిలబడింది. మీరెలా చేస్తారు?

ఈ రెండూ వేర్వేరు కాదు. పేదలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. వాళ్లూ తమ పిల్లలను చదివిస్తున్నారు. ఉద్యోగావకాశాలు వచ్చి తమ జీవితాలు మెరుగుపడాలని ఆశిస్తున్నారు. కరెంటు చార్జీలు పెంచితే పరిశ్రమలు బతకలేవు. అందుకే వాటికి ఉపయోగకరంగా తగ్గించాం. అవి కొత్త ఉద్యోగాలు తెచ్చాయి. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే ఆదాయం పెరిగి సంక్షేమం, అభివృద్ధి రెండూ వస్తాయి.

అభ్యర్థుల ఎంపికలో మీ పాత్ర?

పాదయాత్రలో ఏ నియోజకవర్గంలో ఎవరి శక్తి ఏమిటో.. ఎవరెలా పనిచేస్తున్నారో చూశాను. నా అభిప్రాయాలు పార్టీ నాయకత్వానికి చెబుతాను.

సామాజిక న్యాయం పేరుతో వైసీపీ హడావుడిపై...

బస్సు పెట్టి అందరినీ తిప్పితే సామాజిక న్యాయం వస్తుం దా? అన్ని వర్గాల వారిని గౌరవించే మనస్తత్వం ఉండడం ముఖ్యం. హోంమంత్రి నియోజకవర్గంలో దళితుడిపై దాడి జరిగితే పట్టించుకునే దిక్కు లేదు. అమరనాథ్‌ గౌడ్‌ అనే పిల్లవాడిని వైసీపీకి చెందినవారు పెట్రోలు పోసి తగలబెడితే చిన్న విషయంగా చూశారు. ఆ కేసులో అరెస్టయినవారు విడుదలైతే పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లారు. బడుగు బలహీన వర్గాలపై ఇంత దారుణంగా ఏనాడూ దాడులు, అత్యాచారాలు జరగలేదు. దీనిని టీడీపీ సరిచేస్తుంది.

పాదయాత్రలో ఏం తెలుసుకున్నారు?

ప్రజల నుంచి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇదొక అద్భుత అవకాశంగా నిలిచింది. నేనే కాదు.. ప్రజా జీవితంలో పనిచేయాలనుకునే ప్రతి నాయకుడూ జనంలోకి నడిచి వెళ్తే చాలా విషయాలు తెలుసుకుంటాడు. అనేక వర్గాల సమస్యలు చూశాను. వారినుంచి విన్నాను. సీమలో కొన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనాన్ని ప్రత్యక్షంగా చూశాను.

పాదయాత్ర సఫలమైందనుకుంటున్నారా?

ప్రజల ఆశీర్వాదం లభించింది. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని భవిష్యత్‌లో నడిపించే నేతగా నన్ను చూస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపన, జరిగిన ప్రతి అన్యాయానికీ సమాధానం చెప్పాలన్న కసి నాలో ఉన్నాయని ప్రజలు, పార్టీ శ్రేణులు గుర్తించారు. ఆ కోణంలో సఫలమైంది.

పాదయాత్రలో మీ మనసును కదిలించిన ఘటన?

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒకరోజు రాత్రిపూట రోడ్డు పక్కన ఒక ముసలావిడ పునుగులు వేస్తోంది. ఆమె దగ్గర కూర్చుని పునుగులు తింటూ మాట్లాడాను. తాను 35ఏళ్లుగా పునుగులు, బోండాలు వేస్తూ తన ఇద్దరు పిల్లలను చదివించానని, వారిద్దరికీ ఉద్యోగాలు వస్తే చూడాలన్నదే తన కోరికను చెప్పింది. కష్టపడి పిల్లలను చదివిస్తున్నవారి మనసు ఎలా ఉంటుందో ఆమెను చూస్తే అర్థమైంది. ఉద్యోగాల కల్పనే నా ప్రథమ ప్రాధాన్యం. అందుకే 20 లక్షల ఉద్యోగాల కల్పనను మేనిఫెస్టోలో పెట్టించాను. కర్నూలు జిల్లా ఆలూరులో పెద్దసంఖ్యలో మహిళలు బిందెలు పట్టుకుని మంచినీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. వారి సమస్య చూశాక తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. భూముల రిజిస్ట్రేషన్‌ను కూడా పెద్ద సమస్యగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది.

ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎ్‌సపై మీ వైఖరేంటి?

మేం వస్తే 1న జీతాలు, పింఛన్లు ఇస్తాం. వేధింపులు తగ్గిస్తాం. ఈ ప్రభుత్వం వేధించని వర్గం లేదు. పోలీసు కానిస్టేబుళ్లకు అలవెన్సులు కత్తిరిస్తూ జీవో 17 ఇచ్చారు. మేం వస్తే 100రోజుల్లో దానిని రద్దు చేస్తాం. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను ఆదుకుంటాం. సీపీఎ్‌సపై కమిటీ వేశాం. దానిప్రకారం వెళ్తాం.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మీ వైఖరి ఏమిటి?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దానివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపేణా ఇప్పటివరకూ రూ.45వేల కోట్ల ఆదాయం వచ్చింది. అది నిలబడాలంటే ఆధునికీకరణ జరగాలి. ఈ కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. దానికోసం మా వంతు కృషి చేస్తాం.

యాత్ర చేస్తున్నప్పుడే బాబు అరెస్టు జరిగింది. దానినెలా ఎదుర్కొన్నారు?

చేయని తప్పునకు 52 రోజులు నిర్బంధంలో ఉండాల్సి వస్తుందని మొదటిసారి తెలుసుకున్నాను. దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు ఎలా పెడతారో అర్థమైంది. బాబును అరెస్టు చేసినప్పుడు మొత్తం తెలుగు ప్రజలు మావెంట నిలిచారు. ఆ సమయంలో రోడ్లపైకి వచ్చినవారిలో నూటికి 80ు స్వచ్ఛందంగా వచ్చినవారే. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు కూడా స్పందించి నిరసన తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో సభ పెడితే క్రికెట్‌ మ్యాచ్‌ను కాదనుకుని వేలమంది వచ్చారు. చంద్రబాబు తమ జీవితాలను మార్చడానికి కృషి చేశారన్న కృతజ్ఞత ఇంతమందిని కదిలించింది.

ఆ సమయంలో మిమ్మల్ని కూడా అరెస్టు చేసి ఉంటే ఏం చేసేవారు?

చంద్రబాబు అరెస్టు సమయంలో మొత్తం పార్టీ ఒక్క తాటిపై నిలిచి పనిచేసింది. నన్నూ అరెస్టు చేసి ఉంటే తర్వాత నిలబడి పనిచేయడానికి ఒక టీమ్‌ సిద్ధమైంది. ఈ అరెస్టులతో టీడీపీ కుప్పకూలిపోతుందని వైసీపీ అనుకుంది. కానీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించి పోరాడారు.

20 లక్షల ఉద్యోగాల హామీ అమలు సాధ్యమేనా?

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి కచ్చితంగా తేగలుగుతాం. గత ప్రభుత్వ హయాంలో డిక్సన్‌, టీసీఎల్‌ వంటి ఎన్నో కంపెనీలు తెచ్చాం. వాటివల్ల లక్షల ఉద్యోగాలొ చ్చాయి. ఆ పరిశ్రమల్లో కొన్ని పోయాయి.. కొన్ని ఉన్నాయి. అనువైన వాతావరణం కల్పిస్తే అవన్నీ మళ్లీ వస్తాయి.

పరదాలు కట్టుకుని తిరగలేను..

అలవిగాని హామీలు ఇచ్చి చేయలేక జగన్‌ మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగలేను. నేను కనీసం నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉంటాను. అంతకాలం పరదాల మధ్య బతకడం నావల్ల కాదు. అవీ ఇవీ చెప్పాలని మా పార్టీ నేతల నుంచీ ఒత్తిడి వచ్చింది. నేను చెప్పలేదు. ఆ సమస్యపై అధ్యయనం చేసిన తర్వాత చెబుతానని అన్నా ను తప్ప వెంటనే వాగ్దానం చేయలేదు. మేం చేస్తామని చెప్పినవన్నీ చేయగలిగినవే. మేం పోయిన ప్రభుత్వంలో చెప్పనివి కూడా చాలా చేశాం. పట్టిసీమ కడతామని చెప్పలేదు.. కట్టాం. పింఛన్‌ రూ.2 వేలు చేస్తామని చెప్పలేదు.. చేశాం. పండుగ కానుకలు ఇస్తామని చెప్పలేదు.. ఇచ్చాం. మేం ఏ పన్నులూ వేయకుండా ప్రాజెక్టులు కట్టాం. అభివృద్ధి, సంక్షేమం రెండూ నడిపించాం. కరెంటు చార్జీలు పెంచలేదు. ప్రజలు మా పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నారు. ప్రతి సభకు వస్తున్న స్పందనే దీనికి నిదర్శనం.

రెడ్‌ బుక్‌ అంటే ఏమిటి.. ఏం చేస్తారు?

సామాన్య ప్రజలు, టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధించినవారు, తప్పుడు మార్గాల్లో అణచివేతకు గురి చేసిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నాను. మా పార్టీకి కక్ష సాధింపులపై నమ్మకం లేదు. కానీ జగన్‌ ప్రభుత్వం సైకో మాదిరిగా వ్యవహరిస్తోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడాన్ని ఒక వ్యూహంగా అమలుచేస్తోంది. కొందరు అధికారులు ఇందులో భాగస్వాములుగా మారి తీవ్రంగా వేధించారు. చ ంద్రబాబుకు వ్యతిరేకంగా కొందరు అధికారులు 164 సెక్షన్‌ కింద తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తుంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అధికారులపై ఒత్తిడి ఉండవచ్చు. చేయలేమని చెప్పి పక్కకు తప్పుకోవాలి. ఒత్తిడి ఉందని అడ్డగోలుగా చేస్తారా? బాగా పనిచేశారని కొందరు ఎస్పీలకు డీజీపీ ఇటీవల అవార్డులు ఇచ్చి సత్కరించారు. వారిలో సగం మంది ఇలాంటివారే. పనికిమాలిన తలతిక్క పనులుచేసిన వారు. వారినెలా వదిలిపెడతాం? ఎన్నికలు కాగానే బదిలీపై వెళ్లిపోతే తమను మరచిపోతారని కొందరు అనుకుంటున్నారు. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికే రెడ్‌ బుక్‌ పెట్టాను. దానిని చంద్రబాబుకు ఇచ్చి ఒక కాపీ నా వద్ద పెట్టుకుంటాను.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి?

అభివృద్ధి కావాలన్నా.. సంక్షేమం రావాలన్నా.. కరెంటు చార్జీలు తగ్గాలన్నా.. పన్నుల బాదుడు ఆగాలన్నా.. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలన్నా.. అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్నా.. శాంతి భద్రతలు మెరుగుపడాలన్నా.. డ్రగ్స్‌, గంజాయి రహిత రాష్ట్రంగా ఉండాలన్నా.. ఏపీ బ్రాండ్‌ వాల్యూ పెరగాలన్నా మా పార్టీకి ఓటు వేయాలి.

మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తారా?

సందేహం ఎందుకు? కచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తా. ఆ సీట్లో చాలా ఏళ్లుగా టీడీపీ గెలువలేదు. నేను ఆకస్మికంగా ఎన్నికలకు 21 రోజుల ముందు అక్కడ పోటీ చేశాను. అది పొరపాటు. ఏడాది ముందు అనుకుంటే తేలిగ్గా గెలవగలిగే వాడిని. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాను. గత ఎన్నికల్లో 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఈసారి దాని పక్కన ఒక సున్నా చేర్చి అర లక్ష మెజారిటీతో గెలవగలనని నమ్మకంతో ఉన్నాను.

పాదయాత్ర లక్ష్యం నెరవేరిందా?

జగన్‌ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను తుంగలో తొక్కింది. ప్రత్యేకించి యువత ఆశలు నీరుగారి వారిలో అసంతృప్తి పెల్లుబికింది. వారు నోరు తెరిచి ప్రశ్నించినా.. చిన్న పోస్టు పెట్టినా అణచివేతతో నోరు మూయించాలని చూసింది. వారి మనోభావాలను వ్యక్తం చేయడానికి ఒక వేదికగా నిలవడానికే యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. రోజులు గడిచేసరికి అది మొత్తం ఆంధ్రుల గళంగా మారింది. సమాజంలో వేదనను అనుభవిస్తున్న ప్రతివర్గం, అన్యాయానికి గురైన ప్రతి కుటుంబం దీనికి జత కలిశాయి. ప్రజలు తమ బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి ఒక బలమైన వేదికగా నిలవడంలో యువగళం సఫలమైంది.

మీ తదుపరి కార్యాచరణ?

ముందు మంగళగిరిలో అడుగుపెడతాను. పాదయాత్ర వల్ల వారికి కొంత దూరమయ్యాను. ఒక నెల అక్కడే పనిచేస్తాను. తర్వాత ప్రతి నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులను కలుసుకుని వారిని ఎన్నికలకు సన్నద్ధం చేసే పని మొదలు పెడతాను. ఎన్నికలు సమీపిస్తున్నాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

హామీలన్నీ అమలు చేయగలరా?

నూటికి నూరుశాతం చేస్తాం. మేం చెప్పిన వాటిలో చాలావరకూ గతంలో అమలు చేసినవే. వాటిని జగన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. అందుకే ధైర్యంగా చెబుతున్నాం. టీడీపీ సైకిల్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలు. వనరులు పెంచుకుంటే రెండూ చేయవచ్చు. మేం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచలేదు. మద్యం, ఇసుక ధరలు పెంచలేదు. చెత్త పన్ను వంటివి వేయలేదు. కొత్తగా ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం. దీంతో ఆదాయం పెరిగింది. ఈసారీ మాది అదే వ్యూహం.

Updated Date - Dec 20 , 2023 | 03:40 AM