AP CRDA: సీఆర్‌డీఏపై కొత్త డ్రామా

ABN , First Publish Date - 2023-02-13T02:20:40+05:30 IST

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల కోసం సీఆర్‌డీఏ తెచ్చిన అప్పుల వాయిదాలు చెల్లించని నేపథ్యంలో అవి నిరర్థక ఆస్తి(ఎన్‌పీఏ)గా మారకుండా ఉండేందుకు జగన్‌ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరదీసింది.

AP CRDA: సీఆర్‌డీఏపై కొత్త డ్రామా

ఎన్‌పీఏ ముద్ర పడకుండా

జగన్‌ సర్కారు ఎత్తుగడ

బ్యాంకులను నమ్మించే ప్రయత్నం

అమరావతిలో ఉద్యోగుల క్వార్టర్లు

80 శాతం పూర్తయ్యాయని నివేదన

గడువిస్తే వినియోగంలోకి వస్తాయట!

అప్పుడు అద్దె డబ్బులతో

ఈఎంఐలు చెల్లిస్తామని వివరణ

జీఏడీకి భవనాలు అప్పగిస్తున్నట్లు కలరింగ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల కోసం సీఆర్‌డీఏ తెచ్చిన అప్పుల వాయిదాలు చెల్లించని నేపథ్యంలో అవి నిరర్థక ఆస్తి(ఎన్‌పీఏ)గా మారకుండా ఉండేందుకు జగన్‌ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరదీసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని చెబుతూ బ్యాంకులను నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. కొంత సమయమిస్తే ఇళ్లు వినియోగంలోకి వస్తాయని, వాటి ద్వారా వచ్చే అద్దె డబ్బులతో ఈఎంఐలు చెల్లిస్తామని బ్యాంకులకు సీఆర్‌డీఏ నచ్చచెబుతోంది. వాస్తవానికి రాజధాని ప్రాంతంలోని ఉద్యోగుల క్వార్టర్స్‌ పనుల పురోగతి విషయంలో వైసీపీ సర్కారు మొక్కుబడి చర్యలు తీసుకుంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయాలన్న యోచనే లేదు. హైకోర్టు ఆదేశించినా, బ్యాంకులు పనుల పురోగతిపై వాకబు చేసినా.. ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మాణాలను ఇంకా పూర్తి చేయలేదు. ఆ క్వార్టర్స్‌ను నివాసయోగ్యంగా చేయాలంటే ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. సర్కారుకు వాటిని అభివృద్ధి చేసే ఆలోచన లేనందున వదిలేసింది.

అయితే క్వార్టర్స్‌ నిర్మాణాల కోసం సీఆర్‌డీఏ తెచ్చిన అప్పుల ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకులు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేదని ఇటీవల బ్యాంకర్లు సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి తిష్ఠ వేశారు. దీంతో పనులు పురోగతిలో ఉన్నాయని బ్యాంకర్లను నమ్మించకపోతే సీఆర్‌డీఏను ఎన్‌పీఏ కింద ప్రకటించే ప్రమాదముంది. బ్యాంకులు ఎన్‌పీఏగా ప్రకటిస్తే ప్రభుత్వానికి అప్రతిష్ట ఖాయం. మిగిలిన అన్ని బ్యాంకులు బకాయిల కోసం సర్కారుపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదముంది. ఈ నిర్మాణాల కోసం బ్యాంకులు కొంత గడువు పెంచాయి. ఈ నెలతో గడువు కూడా పూర్తవుతుంది. దీంతో ప్రభుత్వం కొత్త నాటకానికి తెరదీసింది.

అద్దెతో ఈఎంఐలు చెల్లిస్తారట

అమరావతిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్‌-4 ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయని, కొంత సమయమిస్తే 6800 ఇళ్లు వినియోగంలోకి వస్తాయని, వాటి ద్వారా ప్రతి నెలా రూ.6 కోట్ల అద్దె లభిస్తుందని సీఆర్‌డీఏ బ్యాంకర్లకు నచ్చచెబుతోంది. ఇప్పటికే సీఆర్‌డీఏ, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) మధ్య ఒప్పందం కూడా జరిగినట్టు సర్కారు చెబుతోంది. ఈ ఒప్పందం ప్రకారం సీఆర్‌డీఏ నిర్మాణాలను పూర్తి చేసిందని, వాటిని స్వాధీనం చేసుకుని ఉద్యోగులకు కేటాయించాలని జీఏడీకి అప్పగిస్తున్నట్లు చెబుతోంది. వాటి ద్వారా వచ్చే అద్దెతో ఈఎంఐలు చెల్లిస్తామని చెబుతోంది. బ్యాంకర్లు కూడా తెగేదాకా లాగకూడదన్న ఉద్దేశంతో తాత్కాలికంగా కాస్త మొత్తబడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎప్పటికప్పుడు ఈఎంఐలు చెల్లించే విధంగా చర్యలకు ఉపక్రమించారు.

అమరావతిలో కనిపించని అభివృద్ధి

రాజధానిలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. హైకోర్టు పరిసర ప్రాంతాలు కంపచెట్లతో అడవిని తలపిస్తున్నాయి. కంపచెట్లను తొలగించాలన్న ధ్యాస కూడా సీఆర్‌డీఏ అధికారులకు, ప్రభుత్వానికి లేదు. రాజధాని ప్రాంతంలోని రోడ్లకు మరమ్మతులు చేయడం అటుంచి.. రోడ్లను తవ్వుకుని పోతున్నా చర్యలు తీసుకోవడం లేదు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ వ్యవహారాలు కానీ జరగరాదన్న కృతనిశ్చయంతో ఉన్న సర్కారు ఉద్యోగుల క్వార్టర్స్‌ను పూర్తి చేస్తామని చెప్పడం బ్యాంకర్లను మభ్యపెట్టడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో పలు బ్యాంకింగ్‌ సంస్థలు నిర్మాణంలో ఉన్న పలు భవనాలను శిక్షణా సంస్థలుగా మార్చుకుంటామని, అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని ప్రతిపాదనలు చేసినా సర్కారు నిరాకరించింది.

వాయిదాలు చెల్లించాం

సీఆర్‌డీఏ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రుణాలపై జనవరి 31 వరకు చెల్లించాల్సిన వాయిదాలను కట్టామని సీఆర్‌డీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ బండ్ల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘అప్పుకట్టండి.. సీఆర్‌డీఏపై బ్యాంకర్ల దాడి’ కథనంపై స్పందించారు. జనవరి 31 వరకూ ఏ బ్యాంకుకూ బకాయిలు పెండింగ్‌లో లేవని తెలిపారు. సీఆర్‌డీఏ బ్యాంకులకు రుణ చెల్లింపులు జరిపిన మీదట క్రిసిల్‌ సంస్థ క్షేత్రస్థాయిలో సమీక్షించి రేటింగ్‌ను తిరిగి సవరించిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-13T02:20:41+05:30 IST