న్యూయార్క్‌ టైం స్క్వేర్‌పై మెరిసిన ఎన్టీఆర్‌ చిత్రమాలిక

ABN , First Publish Date - 2023-05-29T04:05:10+05:30 IST

న్యూయార్క్‌ టైం స్క్వేర్‌పై మొట్ట మొదటి సారిగా తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. శక పురుషునికి ఎన్నారై టీడీపీ, యూఎస్‌ఏ శత జయంతి నీరాజనం

న్యూయార్క్‌ టైం స్క్వేర్‌పై మెరిసిన ఎన్టీఆర్‌ చిత్రమాలిక

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): న్యూయార్క్‌ టైం స్క్వేర్‌పై మొట్ట మొదటి సారిగా తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. శక పురుషునికి ఎన్నారై టీడీపీ, యూఎస్‌ఏ శత జయంతి నీరాజనం అందించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేళ న్యూయార్క్‌ టైం స్క్వేర్‌పై ఆయన చిత్రాలు తళుక్కున మెరిశాయి. 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు స్క్రీన్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలికను ప్రదర్శించారు. అమెరికా కాలమానం ప్రకారం మే 27 అర్ధరాత్రి నుంచి 28 అర్ధరాత్రి వరకు... 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న ఎన్టీఆర్‌’ చిత్రమాలికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు భారీగా హాజరయ్యారు. అమెరికా వాసులు ఎన్టీఆర్‌ చిత్రమాలికను ఆసక్తిగా తిలకించారు. కాగా బహ్రెయిన్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను గత రాత్రి ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. బహ్రెయిన్‌ టీడీపీ అధ్యక్షుడు రఘునాథ్‌బాబు ఆధ్వర్యంలో మహానాడు జ్ఞాపికగా కేక్‌ కటింగ్‌ జరిగింది. కార్యక్రమానికి సినీ నటుడు నారా రోహిత్‌, గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. శివకుమార్‌, హరిబాబు, మురళీకృష్ణ, రాజశేఖర్‌, గోపాల్‌చౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-29T04:05:10+05:30 IST