Share News

Nimmagadda Ramesh Kumar : సీఎం అనుకున్నదే చట్టం

ABN , First Publish Date - 2023-12-11T03:01:10+05:30 IST

ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రులు అనుకున్నవే చట్టాలుగా మారిపోతున్నాయని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి, హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎంఎన్‌ రావు వ్యాఖ్యానించారు. సిటిజన్‌ ఫర్‌

Nimmagadda Ramesh Kumar : సీఎం అనుకున్నదే చట్టం

రాత్రికి రాత్రే చట్టాలు అమలైపోతున్నాయి

రాజ్యాంగం ఓ విచిత్రమైన డాక్యుమెంట్‌

బ్రిటిష్‌ చట్టాలపై ఆధారపడి రూపొందింది

సీఎ్‌ఫడీ సమావేశంలో జస్టిస్‌ ఎంఎన్‌ రావు

రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన లేదు

ఏపీలో బ్రిటిష్‌ పాలన కనిపిస్తోంది

రాజ్యాంగేతర శక్తులుగా సలహాదారులు

సీఎఫ్‌డీ నేత నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ధ్వజం

తిరుపతి/తిరుమల, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రులు అనుకున్నవే చట్టాలుగా మారిపోతున్నాయని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి, హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎంఎన్‌ రావు వ్యాఖ్యానించారు. సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎ్‌ఫడీ) ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘రాజ్యాంగ పరిపాలన- న్యాయపరమైన క్రియాశీలత’ అంశంపై ఆయన ప్రసంగించారు. ‘శాసనసభ శాసనాలు చేస్తుంది. అయితే ప్రజలకు అనుగుణంగా ఉండే శాసనాలు చేస్తున్నారా? లేదా?... సీఎం అనుకుంటే రాత్రికి రాత్రే చట్టాలు అమలైపోతున్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు స్వతంత్రంగా ఆలోచించి చట్టాలు చేయడంలో పాలుపంచుకుంటున్నారు? నియోజకవర్గ పరిధిలో ఉండే ఎమ్మెల్యే అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి’ అని ఆయన స్పష్టం చేశారు. ‘రాజ్యాంగం ఒక విచిత్రమైన డాక్యుమెంటు. బిట్రీష్‌ చట్టాలపై అధారపడి మన రాజ్యాంగం రూపొందింది. నాలుగేళ్లు న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు చట్టాలు ఎలా చేస్తారో తెలుసుకున్నా. మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం అంటే ఎవరని అడిగారు. ప్రభుత్వం అంటే మీరే అన్నాను. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని ఒక్కరోజులోనే అమలయ్యేలా చేశాం. ఆ తర్వాత 20ఏళ్లకి దేశవ్యాప్తంగా ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది’ అన్నారు.

ఓటర్ల నమోదులో ఎన్నో అనుమానాలు: నిమ్మగడ్డ

ఓటర్ల నమోదులో అనేక అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మరో రెండు రోజులు పొడిగించాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషనరును సీఎ్‌ఫడీ కోరగా.. తోసిపుచ్చారని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్‌ తీరు బాధాకరమన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలని సీఎ్‌ఫడీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగబద్ధ పాలన ఎక్కడా జరగడంలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘పాలకులం కాదు... సేవకులం’ అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించ్నారు. సచివాలయ వ్యవస్థను ఎన్నికలకు వాడుకోవడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా 13 మందికి కేబినెట్‌ స్థాయి కల్పించడం విడ్డూరంగా ఉందని, వారంతా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు. ఏపీ సమాచార శాఖ భ్రష్ఠు పట్టిందని ఆరోపించారు. ఏపీలో బ్రిటిష్‌ పాలన కనిపిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతి పౌరుడు ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. రాజ్యాంగబద్ధ పాలన జరగకపోతే ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకలో ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోయిందని, అక్కడ పాలన చేతగాక ప్రజాప్రతినిధులు పారిపోయారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్యలు ఉండాలన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని చదివితే అందులోని విలువైన సందేశం అర్థమవుతుందన్నారు. మనం బ్రిటిష్‌ కాలంలో బతకడం లేదని, ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి: జస్టిస్‌ భవానీప్రసాద్‌

వెలుగు నీడల మధ్య దోబూచులాడే పరిస్థితిలో ఉన్నామని సభకు అధ్యక్షత వహించిన ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ భవానీప్రసాద్‌ అన్నారు. సామాజిక బాధ్యత, స్పృహ ప్రతి ఒక్కరికీ ఉండాలని అన్నారు. సామాజిక విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి కడుతున్నారని, ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య వాదులకు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సీఎ్‌ఫడీ సభ్యులు ఫల్గుణ కుమార్‌, లక్ష్మణ్‌ రెడ్డి, రఘు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో నిమ్మగడ్డ, ఎల్వీ

శ్రీవారి ఆలయం నుంచి పరకామణిని వెలుపలకు తీసుకురావడంతో ఆలయంలో చక్కటి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. చాలాకాలం తర్వాత స్వామిని దర్శించుకునే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, మాజీ సీఎస్‌, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను శ్రద్ధగా చూసుకోవాలని సూచించారు. ఇటీవల తిరుమలలో జరిగిన అన్నదానం ఘటనతో పాటు మరికొన్ని చాలా బాధ కలిగించాయని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని టీటీడీ సిబ్బందిని కోరారు. అందరికీ సుఖసంతోషాలు కలగాలని, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించానన్నారు. ధర్మప్రచారానికి పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని ఆయన టీటీడీ బోర్డును కోరారు.

Updated Date - 2023-12-11T03:11:32+05:30 IST