లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఉద్యమ విరమణ
ABN , First Publish Date - 2023-03-04T02:38:46+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
న్యాయమైన సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమం: బొప్పరాజు
ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 3: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అమరావతి జేఏసీ ఉద్యమం ప్రకటించడంతో గురువారం అప్పటికప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో అనధికారిక సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారన్నా రు. కానీ సమస్యలన్నింటిపైనా ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి లిఖితపూర్వకమైన హామీ ఇస్తేనే ఈ ఉద్యమాన్ని విరమిస్తామని వారికి తేల్చి చెప్పామని వెల్లడించారు. ఒంగోలులోని రెవెన్యూ భవన్‌లో అమరావతి జేఏసీ పక్షాలతో కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 9నుంచి జరగనున్న ఉద్యమంలో ఎన్‌జీవోలతో పాటు ఉద్యోగ సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృత ప్రచారాన్ని బొప్పరాజు ప్రారంభించారు.