Lokesh Padayatra: నేను మాట్లాడితే ప్యాలస్ పిల్లి వణికిపోతోంది: లోకేశ్
ABN , First Publish Date - 2023-02-23T21:33:21+05:30 IST
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాజీ సీఎం వైఎస్‌ఆర్, సీఎం జగన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల (YSR Jagan Reddy Sharmila) పాదయాత్రలు చేశారు.
తిరుపతి: ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాజీ సీఎం వైఎస్‌ఆర్, సీఎం జగన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల (YSR Jagan Reddy Sharmila) పాదయాత్రలు చేశారు. ఏనాడు వారిని అడ్డుకోలేదు. ఇప్పుడు నేను ఒక చిన్నగ్రామంలో మాట్లాడినా ప్యాలస్ పిల్లి వణికిపోతోంది. నేను మాట్లాడితే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారనే భయం ప్యాలస్ పిల్లిని వెంటాడుతోంది. నువ్వు ఎంత అడ్డుకుంటే నేను అంత ఎక్కువ మాట్లాడతా’ అని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. 25వ రోజైనన గురువారం యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti) నియోజకవర్గం నుంచి తిరుపతి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
మాట్లాడే హక్కు హరించే అధికారం మీకెక్కడిది?
శ్రీకాళహస్తి నియోజకవర్గం నీలిసానిపేటలో లోకేశ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిలబడి మాట్లాడిన స్టూల్‌ను సీజ్ చేశారు. గాజులమండ్యం గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో జీవో1 ప్రకారం మాట్లాడటానికి వీలులేదని పోలీసులు అడ్డుపడ్డారు. ‘చంద్రబాబు హయాంలో కంపెనీలు వస్తే ఇప్పుడు జగన్ వీధికో జే బ్రాండ్ లిక్కర్ షాపులు తెరిచాడు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకోవడానికి వస్తే నన్ను అడ్డుకుంటున్నారు. ఊరూరా తిరిగి పాదయాత్ర చేసి అనేక హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు అన్నీ మరిచిపోయాడు. ఇచ్చిన ప్రతి హామీని గుర్తుచేస్తా. ప్రతి మోసాన్ని ఎండగడతా. జగన్ పాదయాత్రలో 9 మంది చనిపోయారు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు పాదయాత్రకు ఎందుకొచ్చాయి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ వేసి చర్యలు తీసుకుంటాం. నేను మైక్‌లో మాట్లాడటంలేదు. ప్రజలతో మాట్లాడే హక్కు రాజ్యాంగం ద్వారా వచ్చింది. నా హక్కులు హరించే అధికారం మీకు లేదు’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోను జీ పాళెం విడిదికేంద్రం వద్ద 25వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించే ముందు దివంగతనేత ఎర్రంనాయుడు జయంతి సందర్భంగా లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు.