Pulivendula Josh : టీడీపీలో పులివెందుల జోష్‌

ABN , First Publish Date - 2023-08-04T03:24:07+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌సొంతగడ్డ పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. స్థానిక

Pulivendula Josh : టీడీపీలో పులివెందుల జోష్‌

జగన్‌ కోటలో సభ సక్సెస్‌తో ఉత్సాహం

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌సొంతగడ్డ పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని చోట ఇప్పుడు ప్రజలు పోటెత్తడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణానికి తార్కాణమని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం పులివెందులలో టీడీపీని కకావికలం చేసింది. ఆ నియోజకవర్గంలో గత మూడు సార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లిపోయారు. గ్రామ స్థాయి నాయకుల్లో కొందరు పార్టీని వీడి వెళ్లిపోగా, మరికొందరు మౌనంగా ఉండిపోయారు. దీంతో పులివెందులలో వైసీపీకి ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో 90ు సీట్లు ఏకగ్రీవమయ్యాయి. అధికార పార్టీ సృష్టించిన భయానక వాతావరణానికి తోడు టీడీపీ నుంచి కూడా ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడే నాయకులు తగ్గిపోవడం దీనికి కారణం. గతం నుంచి పులివెందులలో టీడీపీ బలహీనంగా ఉన్నా ఈసారి అది మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత క్రమేపీ కొద్ది కొద్దిగా తేరుకోవడం మొదలు పెట్టింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పాత నాయకులను సమీకరించి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో అక్కడ చంద్రబాబు పర్యటన ఏర్పాటయింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టడం ఇదే ప్రథమం. టీడీపీ పుంజుకుందన్న వాతావరణం కనిపిస్తున్నా ఆయన పర్యటనకు స్పందన ఎలా ఉంటుందోనని ఆ పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. అయితే బాబు సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో టీడీపీ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్‌ కుటుంబం స్వగ్రామం బలపనూరులో కూడా బాబుకు ఎదురేగి స్వాగతం పలికారు. పులివెందుల పట్టణంలో చంద్రబాబు రోడ్‌ షో, బహిరంగ సభ కలిపి మొత్తం 3గంటల సమయం తీసుకొన్నాయి. రోడ్‌ షోలో భాగంగా చంద్రబాబు పూల అంగళ్ల సెంటర్‌కు వచ్చినప్పుడు ఆయన అక్కడే మాట్లాడాలని పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. కాని ఆయన వారికి నచ్చచెప్పి పోలీసులు అనుమతి ఇచ్చిన స్థలానికి వెళ్లారు. సభకు తరలివచ్చిన వారిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉండటం విశేషం. పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్ల వ్యతిరేక వాతావరణం అలుముకొంటోందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జగన్‌ శిబిరంపై ఏహ్య భావం తెచ్చింది. జగన్‌ సహా ఆయన చుట్టూ ఉన్నవారందరి పాత్ర ఇందులో ఉందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వివేకాకు మంచి పేరు ఉంది. ఈ వ్యతిరేకత అంతా చంద్రబాబు పర్యటనలో ప్రతిఫలించింది’’ అని ఒక సీనియర్‌ నేత విశ్లేషించారు.

రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసింది: అచ్చెన్న

చంద్రబాబు పులివెందుల సభ రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘నేల ఈనిందా అన్నట్లు ప్రజలు తరలివచ్చారు. దశాబ్దాలుగా మౌనంగా ఉండిపోయిన పులివెందుల ప్రజలు ఒక్కసారిగా సంకెళ్లు తెంచుకొని బయటకు వచ్చారు. విప్లవ సమానమైన ఈ పరిణామాన్ని సరిగా అర్ధం చేసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. పులివెందుల ప్రజలే తిరుగుబాటు చేస్తే ఇతర ప్రాంతాలవారు చూస్తూ ఉండిపోరు. ఈ అరాచక, దోపిడీ, విధ్వంస పాలన నుంచి విముక్తి కోరుకొంటున్నారని రుజువైంది’’ అని అచ్చెన్న అన్నారు.

Updated Date - 2023-08-04T03:24:07+05:30 IST