‘ఎర్ర’ స్మగ్లర్ సెల్వరాజ్‌పై ఈడీ చార్జిషీట్ రెడీ
ABN , First Publish Date - 2023-09-08T05:19:33+05:30 IST
ర్ర చందనం స్మగ్లర్ సెల్వరాజ్ రాజేంద్రన్‌పై మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగపత్రం సిద్ధం చేసింది. తమిళనాడుకు చెందిన సెల్వరాజ్‌పై గతంలో
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎర్ర చందనం స్మగ్లర్ సెల్వరాజ్ రాజేంద్రన్‌పై మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగపత్రం సిద్ధం చేసింది. తమిళనాడుకు చెందిన సెల్వరాజ్‌పై గతంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదైంది. శేషాచలం ప్రాంతంలో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఆ సొమ్ముతో ఖరీదైన ఆడి, బెంజ్, రేంజ్ రోవర్ లాంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. స్థిరాస్తి వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. చిత్తూరు పోలీసులు సెల్వరాజ్‌ను అరెస్టు చేసినప్పుడు విదేశాలకు ఎర్రచందనం అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు వెల్లడైంది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కూడా తేలింది. ఈ సమాచారంతో కేసు నమోదు చేసిన ఈడీ నిందితుడికి సంబంధించిన సంజనా మెటల్ వేర్ పేరుతో ఉన్న పరిశ్రమతోపాటు చెన్నైలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ఎనిమిది ఫ్లాట్లు, పుదుచ్చేరిలోని మరిన్ని స్థిరాస్తులు(రూ.7.54 కోట్ల విలువ) జప్తు చేసింది. అయితే, తాను ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా మానేసినట్లు ఈడీ అధికారులకు సెల్వరాజ్ తెలిపాడు. ఏపీ పోలీసులు నమోదు చేసిన స్మగ్లింగ్ కేసు సైతం కోర్టులో వీగిపోయిందని చెప్పాడు. అయితే వన్య ప్రాణుల సంరక్షణ చట్టం, బయో డైవర్సిటీ యాక్టు కింద అతనిపై నమోదు చేసిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడిపై హైదరాబాద్‌లోని కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.