Rushikonda : రుషికొండపై రూ.కోట్లు కుమ్మరింత
ABN , First Publish Date - 2023-09-24T04:15:04+05:30 IST
రుషికొండపై పర్యాటక వసతి గృహాల పేరుతో సీఎం జగన్ కోసం నిర్మిస్తున్న భవనాలకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కోట్ల రూపాయలను కుమ్మరిస్తోంది. ఇక్కడి నిర్మాణాలకు రూ.240
జగన్ కోసం భారీ ఖర్చుకు సిద్ధమైన ఏపీటీడీసీ
ఇంటీరియర్‌కు రూ.19.08 కోట్ల టెండర్లు
రోడ్లకు 46 కోట్లు.. ప్రహరీకి 8.58 కోట్లు
ఉద్యానవనాలకు రూ.4.2 కోట్లు
పర్యాటక వసతి గృహాల పేరుతో సీఎంవో!
రాజధాని లేని రాష్ట్రం కాకూడదనే విశాఖకు సీఎం: వైవీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రుషికొండపై పర్యాటక వసతి గృహాల పేరుతో సీఎం జగన్ కోసం నిర్మిస్తున్న భవనాలకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కోట్ల రూపాయలను కుమ్మరిస్తోంది. ఇక్కడి నిర్మాణాలకు రూ.240 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారు. శనివారం రుషికొండపై భవనాలకు ఇంటీరియర్, ఫర్నిచర్ కోసం రూ.19.08 కోట్లతో ఏపీటీడీసీ టెండర్లు ఆహ్వానించింది. దీనికి ముందు కొండ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.8.58 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. దేశంలో ఏ పర్యాటక రిసార్ట్‌లకు కూడా ప్రహరీలు లేవు. అయితే, సీఎం ఉంటారు కాబట్టే భద్రత కోసం ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇటీవలే మొక్కల పెంపకం, గార్డెన్స్ అంటూ రూ.4.2 కోట్ల పనులు కట్టబెట్టారు. కొండపై భవనాల వద్దకు చేరుకోవడానికి వంద అడుగుల వెడల్పున రహదారులు నిర్మిస్తున్నారు. వీటికోసం రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఒత్తిళ్లు పెట్టడం గమనార్హం.
రాజధాని లేని రాష్ట్రం కాకూడదనే...: వైవీ సుబ్బారెడ్డి
మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికలు సమీపిస్తున్నాయని తెరపైకి తీసుకురాలేదని, ఇప్పుడు వాటిని ఏర్పాటు చేయకపోతే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుందని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించారన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన సమావేశానికి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకే మూడు రాజధానులని వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. సీఎంవో, మంత్రుల కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగులకు వసతి తదితర అంశాలపై ఒక కమిటీ ఏర్పాటు అవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రెండు వారాల్లో దీనిపై కార్యాచరణ ప్రారంభమవుతుందన్నారు. విజయదశమి నాడు సీఎంకు స్వాగతం పలికే బాధ్యతను జేఏసీకి అప్పగిస్తున్నామన్నారు. ‘‘విశాఖకు రాజధానిని తరలించేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నా, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చుననే భావనతో జగన్ ఇక్కడకు వస్తున్నా’’రని అమర్నాథ్ తెలిపారు. జేఏసీ చైర్మన్ లజపతిరాయ్, ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.