Share News

Red sandalwood : తిరుమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా

ABN , First Publish Date - 2023-11-10T04:26:58+05:30 IST

ఎర్రచందనాన్ని దర్జాగా రాజమార్గంలో రవాణా చేస్తున్న వైనం తిరుపతిలో గురువారం వెలుగు చూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ పట్టుబడటం కలకలం రేపింది. బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన ..

Red sandalwood  : తిరుమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా

అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వద్దదుంగలు తరలిస్తున్న వాహనం..

తొలుత వివరాలు వెల్లడించని

పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు..

ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటన

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 9: ఎర్రచందనాన్ని దర్జాగా రాజమార్గంలో రవాణా చేస్తున్న వైనం తిరుపతిలో గురువారం వెలుగు చూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ పట్టుబడటం కలకలం రేపింది. బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన టీఎన్‌ 07 ఏఆర్‌ 3333 నంబరుగల టవేరా వాహనం తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరింది. తిరుమల 2 టౌన్‌ పరిధిలో ఘాట్‌రోడ్‌-1లో చెక్‌పోస్టు వద్ద వాహనంలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వాహనాన్ని అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉంచారు. వాహనంలోని ఎర్రచందనం దుంగలు కనబడకుండా దుప్పటి కప్పారు. ఎర్రచందనం అక్రమరవాణాకు సంబంధించి వివరాలు కనుక్కునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా పోలీసు అధికారులు స్పందించలేదు. అలిపిరి పోలీసులను అడగ్గా.... ఆ వాహనాన్ని తాము పట్టుకోలేదని, తమకేమీ తెలియదని చెప్పారు. అలాగే తిరుమల టూ టౌన్‌ పోలీసులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు కూడా స్పందించలేదు.

ఇక అసలు ఎర్రచందనం రవాణా చేస్తున్న వాహనం ఘాట్‌రోడ్‌లో పట్టుబడినట్టు తమకు ఎటువంటి సమాచారం లేదని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు చెప్పడం పైనా అనేక అనుమానాలు తలెత్తాయి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి పోలీసు, టాస్క్‌ఫోర్స్‌, టీటీడీ విజిలెన్స్‌ అధికారులను సంప్రదించగా అందరూ తమకు తెలియదని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక పెద్దతలకాయలే ఉన్నట్టు అనుమానం కలుగుతోందని లేకుంటే అంత గోప్యత ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.30 గంటలకు అలిపిరి సీఐ అబ్బన్న పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. టవేరా వాహనంలో 12 ఎర్రచందనం దుంగలను తలకోన నుంచి చెన్నైకి తరలిస్తుండగా గురువారం సాయంత్రం 6.30 గంటలకు తిరుపతి కపిలతీర్థం సర్కిల్లో పట్టుకుని సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. వాహన డ్రైవరు రాజవెంకటేశన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-11-10T04:27:00+05:30 IST