Anganwadi Strike : సమ్మెపై సమ్మెట!
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:45 AM
న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన అంగన్వాడీలపై వైసీపీ సర్కారు సచివాలయ సిబ్బంది ద్వారా ఒత్తిడి పెంచింది.
సర్కారు గుప్పెట్లోకి అంగన్వాడీలు
ఒళ్లు బలిసి సమ్మె
బొబ్బిలి ఎమ్మెల్యే వ్యాఖ్యలు
నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోకి కేంద్రాలు
మహిళా పోలీసులకు నిర్వహణ, వలంటీర్లకు వంట బాధ్యత
ఉదయం 9 నుంచి 12 వరకు కేంద్రాలు తెరవాలని ఆదేశం
ఉన్న తాళాలు తొలగించండి.. వేరే తాళాలు వేయండి
అంగన్వాడీల సమ్మె ముగిసే వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సమస్యలు పరిష్కరించకపోగా రెచ్చగొట్టేలా చర్యలు
సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన అంగన్వాడీలపై వైసీపీ సర్కారు సచివాలయ సిబ్బంది ద్వారా ఒత్తిడి పెంచింది. ‘మీరు లేకపోతే సచివాలయ ఉద్యోగుల ద్వారా కేంద్రాలు నడిపిస్తామ’నే సంకేతం పంపింది. విధులకు హాజరుకాకపోతే తొలగిస్తామంటూ మంగళవారం రాత్రి అంగన్వాడీ సంఘాల నేతలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. సచివాలయ సిబ్బంది ద్వారా కేంద్రాలను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. అంగన్వాడీలపై సచివాలయ సిబ్బందికి అజమాయిషీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాలను వేసిన తాళాలు తొలగించి తెరవాలని, సరుకులను రికార్డు చేసుకోవాలని, మళ్లీ కొత్త తాళాలు వేసిన తర్వాత ఆ సచివాలయాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పజెప్పాలని ఆదేశించింది. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపని ప్రభుత్వం, ఇలా వారిని మరింత రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది. అంగన్వాడీల సమ్మె విరమించే వరకు ఈ విధంగా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తెరవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా కేంద్రాలను తెరవగానే క్రాస్ చెక్ చేయాలన్నారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేయాలని సూచించారు. కాగా, సమ్మె చేస్తున్న వారిని మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్నాళ్లిలా?
అంగన్వాడీలకు శిక్షణ ఉంటుంది. పరీక్షలు ఉంటాయి. చిన్న పిల్లలను ఏ విధంగా డీల్ చేయాలో వారికి తెలుస్తుంది. ఇప్పటికే చిన్నారులు వారికి అలవాటు పడి ఉంటారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బాధ్యతగా చూసుకోగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అవైలబులిటీని అనుసరించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రాన్నీ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ చేసిన సిబ్బందికి సంబంధింత ఎంపీడీవో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను తొలగించి, ఆయా కేంద్రాల్లోని ఫుడ్ స్టాకు వివరాలను పంచనామా నిర్వహించి రికార్డు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీల సమ్మె ముగిసేవరకూ కేంద్రాలన్నీ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. గర్భవతులు, బాలింతలు, టీహెచ్‌ఆర్ పిల్లలు, వీరిలో ఇంకా టీహెచ్‌ఆర్ తీసుకోకుండా ఉన్నటువంటి వారికి టీహెచ్‌ఆర్ ఇవ్వాలని పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు రోజూ కేంద్రంలోనే టీహెచ్‌ఆర్ ఇవ్వాలని, ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి మ్యాపింగ్ చేసిన సచివాలయంలో ఉంచాలని ఆదేశించారు. కేంద్రాలకు ఫుడ్ స్టాక్ వస్తే సంబంధిత సెక్టారు సూపర్‌వైజర్ వాహనాన్ని అనుసరించి మ్యాప్ చేసిన సచివాలయ సిబ్బంది స్టాకును తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా అంగన్వాడీల నిర్వహణ బాధ్యతను మహిళా పోలీసులకు, వంట బాధ్యతలను వలంటీర్లకు అప్పగించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పలు చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకున్నా అంగన్వాడీలు మాత్రం తమ నిరసనను కొనసాగిస్తున్నారు.