విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్న..!
ABN , First Publish Date - 2023-02-13T10:25:31+05:30 IST
సినీ నటుడు నందమూరి తారకరత్నకు ఇంకా బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్సను అందిస్తున్నారు. ఆయనకు విదేశీ వైద్యులతో చికిత్సను అందిస్తున్నారు.
బెంగళూరు : సినీ నటుడు నందమూరి తారకరత్నకు ఇంకా బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్సను అందిస్తున్నారు. ఆయనకు విదేశీ వైద్యులతో చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు రామకృష్ణ స్వయంగా మీడియాకు వెల్లడించారు. జనవరి 28న ఆయనను కుప్పం నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించారు. తారకరత్నకు హృద్రోగంతో పాటు, నాడీ (న్యూరో) సమస్యలకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అంతా హుషారుగా కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కొంత దూరం నడిచిన మీదట సడెన్‌గా అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అయితే తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటీవల తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్తారనే వార్తలు వచ్చాయి. అయితే విదేశీ వైద్యులే ఇక్కడికి వచ్చి తారకరత్నకు చికిత్సను అందిస్తున్నారని రామకృష్ణ వెల్లడించారు. అయితే తారకరత్న ఇంకా కోమాలోనే ఉన్నారు. త్వరలోనే ఆరోగ్యం మెరుగుపడి కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.