TS High Court : వివేకా హత్య కేసులో నిందితులు చాలా బలవంతులు
ABN , First Publish Date - 2023-08-25T02:31:35+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వీరు చాలా బలవంతులని.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు స్వయానా తన డ్రైవర్‌నే బెదిరించారని సీబీఐ స్పెషల్ పీపీ అనిల్ తన్వర్ వెల్లడించారు. హత్యకు సంబందించిన కుట్రలో.. ఆ తర్వాత
ఏపీకి వెళ్లినప్పుడు నా డ్రైవర్‌నే బెదిరించారు
సీబీఐ స్పెషల్ పీపీ అనిల్ తన్వర్ వెల్లడి
పరిస్థితుల్లో ఏ మార్పూ లేదు
భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కి బెయిల్ ఇవ్వొద్దు
తెలంగాణ హైకోర్టుకు అభ్యర్థన
బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వీరు చాలా బలవంతులని.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినప్పుడు స్వయానా తన డ్రైవర్‌నే బెదిరించారని సీబీఐ స్పెషల్ పీపీ అనిల్ తన్వర్ వెల్లడించారు. హత్యకు సంబందించిన కుట్రలో.. ఆ తర్వాత ఆధారాల చెరిపివేతలో వీరు కీలక భాగస్వాములని నివేదించింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసినందున తమకు బెయిల్ ఇవ్వాలని ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. స్పెషల్ పీపీ తన్వర్ వాదనలు వినిపిస్తూ.. నిందితులు పలుకుబడి కలిగిన వ్యక్తులని.. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైనప్పుడు స్వయంగా తన డ్రైవర్‌నే బెదిరించారని తెలిపారు. ఏపీ పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా ఏమీ చేయడానికి సిద్ధంగా లేరని.. తాము ఇచ్చిన ఫిర్యాదును ఏమీ జరగలేదంటూ మూసేశారని పేర్కొన్నారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. సంబంధిత కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ దాఖలు చేయలేదా.. హైకోర్టును ఆశ్రయించలేదా అని ప్రశ్నించింది. తమనే కాదు.. సీఐ శంకరయ్య సహా చాలా మందిని బెదిరించారని తన్వర్ పేర్కొన్నారు. ‘గతంలో దర్యాప్తునకు ఏవిధంగా ఆటంకాలు కలిగించారో చూశాం. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను అరెస్టు చేసినప్పుడు భయాందోళనలు సృష్టించారు. నిరసనలు చేపట్టారు. వారు అరెస్టయ్యేనాటికి, ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పూ లేదు. ఇప్పుడు బెయిల్ ఇస్తే చాలా ఆటంకాలు సృష్టిస్తారు. దస్తగిరి క్షమాభిక్షను సవాల్ చేయడానికి ఇది వేదిక, సమయం కాదు. కావాలంటే సీబీఐ కోర్టులో ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు’ అని తెలిపారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నళిన్‌కుమార్ వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని.. వారికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని.. ఈ దశలో బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారని పేర్కొన్నారు. తండ్రిని చంపిన కిరాయి హంతకుడు అయిన దస్తగిరిని సునీతారెడ్డి ఎలా క్షమిస్తున్నారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్‌మెంట్ తప్ప పిటిషనర్లకు వ్యతిరేకంగా ఏ ఆధారమూ లేదన్నారు. వారు ఇప్పటికే నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని.. 73 ఏళ్ల భాస్కర్‌రెడ్డికి చాలా అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
శివశంకర్‌రెడ్డి బెయిల్‌పై 29న తీర్పు
వివేకా హత్య కేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఈ నెల 29న తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్‌పై గురువారం వాదనలు ముగిశాయి. కేసులో దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి కోరగా.. సీబీఐ వ్యతిరేకించింది. కడప ఎమ్మెల్సీ టికెట్ లభించపోవడంతో వివేకాపై శివశంకర్‌రెడ్డి కక్షపెంచుకున్నారని.. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డితో కలిసి హత్యకు కుట్ర చేయడంతోపాటు ఆధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారని తెలిపింది.