MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెడిసికొట్టిన వైసీపీ వ్యూహం!.. ముఖ్య నేతల్లో గుబులు
ABN , First Publish Date - 2023-02-27T20:32:41+05:30 IST
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) కాక పుట్టిస్తున్నాయి. ఉపాధ్యాయ..
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) కాక పుట్టిస్తున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను అధికార పార్టీ మినీ అసెంబ్లీ పోరుగా ఎంచుకుంది. పొరపాటున ఈ ఎన్నికల్లో ఓడితే రాయలసీమ (Rayalaseema)లోనే వైసీపీ సిన్మా క్లోజ్ అయిందనే సంకేతాలు ఏడాదికి ముందే అటు జనం, ఇటు కేడర్‌లోకి వెళుతుంది. వైనాట్.. 175 అని ఎంత పబ్లిసిటీ చేసుకున్నా కేడరులో అంత రెస్పాన్స్ ఉండదు. అందుకే ఈ ఎన్నికలను జగన్ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని నామినేషన్ల ఉపసంహరణ ముందే ఏకగ్రీవం కోసం నానా పాట్లు పడింది.
‘కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ (Dr. Madhusudan) ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలి. ఎలాంటి రాజకీయ ఎత్తులు వస్తారో మీ ఇష్టం.. టీడీపీ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థులు ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల మోహన్‌రెడ్డిలను విత్‌డ్రా చేయించాలి’ అని ఈ నెల 25న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి (Katasani Rambhupal Reddy) ఇంట్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana Rajendranath Reddy) చెప్పిన మాటలివి. ‘సీఎం జగన్ (CM Jagan) సీరియస్‌గా ఉన్నారు. ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడొక లెక్క’ అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రుల ఆదేశం మేరకు స్వతంత్రులుగా నామినేషన్లు వేసిన టీడీపీ సర్పంచులను పోటీ నుంచి తప్పించేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. అభ్యర్థుల బంధువులు, సన్నిహితులు ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఓ దశలో పోలీస్ అధికారులను కూడా రంగంలోకి దింపారు. బుజ్జగింపులు, బెదిరింపులు, బేరసారాలు.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
ఈ నెల 23న నామినేషన్ వేసినప్పటి నుంచి భూమా వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి అధికార పార్టీ నాయకులు, పోలీస్ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయని అదే రోజు సెల్‌ఫోన్లు స్వీచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిని ఎలాగైనా విత్‌డ్రా చేయించాలని వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు చేయని ప్రయత్నం అంటూ లేదు. విత్‌డ్రా ఆఖరి గడువు సోమవారం సాయంత్రం 3 గంటలు దాటినా స్వతంత్రులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోలేదు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మధుసూదన్, స్వతంత్ర అభ్యర్థులు భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డిలు పోటీలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన సహా ఎమ్మెల్యేలు రచించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. దీనిని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఖ్యాబలం రీత్యా వైసీపీ విజయం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నా.. క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని వైసీపీ నాయకుల్లో గుబులు మొదలైంది.