Red alert : తుఫాన్ ముప్పు
ABN , First Publish Date - 2023-12-04T05:21:08+05:30 IST
‘మిచౌంగ్’ తుఫాన్ పలు జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారింది.
మరో రెండ్రోజులు రెడ్ అలెర్ట్
మచిలీపట్నానికి 450 కి.మీ.ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతం
నేటి ఉదయానికి దక్షిణ కోస్తా తీరానికి..
మచిలీపట్నం, నెల్లూరు మధ్య
తీరం దాటే అవకాశం.. అటుపై తీవ్ర తుఫాన్
రేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక
నేడు, రేపు పలుచోట్ల కుంభవృష్టిగా వర్షాలు
నీట మునిగిన వేల ఎకరాల వరి
అమరావతి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, ఏలూరు సిటీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘మిచౌంగ్’ తుఫాన్ పలు జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారింది. ఆదివారం సాయంత్రానికి నెల్లూరుకు 330 కిలోమీటర్లు ఆగ్నేయంగా, బాపట్లకు 440 కి.మీ.లు, మచిలీపట్నానికి 450 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి సోమవారం ఉదయానికి బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుంది. ఆ తరువాత ఉత్తరంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. ఈ క్రమంలో ఈ నెల ఐదో తేదీ ఉదయానికి ఒంగోలు-మచిలీపట్నం మధ్య చీరాల లేదా బాపట్లకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర తుఫాన్ తీరం దాటేటప్పుడు దక్షిణకోస్తాలో గంటకు 90-100 కి.మీ.లు, అప్పుడప్పుడు 110 కి.మీ.లు, ఉత్తరకోస్తాలో 45-55 కి.మీ.లు, అప్పుడప్పుడు 65 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గాలుల తీవ్రత నేపథ్యంలో దక్షిణ కోస్తాలో తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు మీటరు నుంచి మీటన్నర ఎత్తు వరకు ఎగిసిపడతాయని, దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతాయని హెచ్చరించింది.
కాగా, ఐదో తేదీన తుఫాన్ తీరం దాటిన తరువాత కోస్తా మీదుగా పయనించేటప్పుడు చాలాసేపు తీవ్ర తుఫాన్ లేదా తుఫాన్‌గా కొనసాగుతుందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించేటప్పుడు వాయుగుండంగా మారి తరువాత ఒడిశావైపుగా వెళుతుందని నిపుణులు అంచనావేశారు. ఆదివారం రాయలసీమ, దక్షిణ కోస్తాలో అనేకచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కోస్తా, రాయలసీమలో గాలులు బలంగా వీస్తున్నాయి. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, కోస్తాలోని మిగిలిన రేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోంగా మారడంతో సముద్ర అలలు ఎగసిపడుతుండంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఈ జిల్లాలు అలర్ట్!
రానున్న రెండు రోజులు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనంతపురం, కడప, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (రెడ్ అలెర్ట్)ప్రకటించింది. అలాగే నెల్లూరు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీసత్యసాయి, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కాగా, ఆదివారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాలతో పాటు సమీప ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కోస్తా ప్రాంతంలో గంటకు 70-90కిలో మీటర్ల గాలులు వీచాయి. మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మధ్య ఉన్న పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
మందులు సిద్ధం చేసుకోండి: వైద్య ఆరోగ్యశాఖ
మిచౌంగ్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వోలకు ఆరోగ్యశాఖ కమిషన్ జె.నివాస్ ఆదేశించారు. మారుమూల ప్రాంతాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో సరిపడా మందుల్ని ముందుగానే నిల్వ చేసుకోవాలి ఆదేశించారు. ఈ వారంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణిలను ముందుగానే సమీప ఆస్పత్రులకు తరలించాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని, వైద్య ఆరోగ్య సిబ్బంది హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా వెంటనే రాష్ట్ర కార్యలయాన్ని సంప్రదించాలని ఆదేశించారు.
నెల్లూరు, తిరుపతిపై తీవ్ర ప్రభావం
నెల్లూరు, తిరుపతి జిల్లాలను మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేస్తోంది. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. కాలువలు పూడుకుపోవడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రైల్వే అండర్ బ్రిడ్జిలు మునిగిపోవడంతో తూర్పు, పడమర ప్రాంతాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను తుఫాన్ షెల్టర్లకు తరలించారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల్లో వేసిన వరి నాట్లు నీట మునిగాయి. మరో 200 ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. మరో 120 ఎకరాల్లో వేరుశనగ నీట మునిగింది. ఉప్పు కయ్యల్లో నీరు నిలబడడంతో ఉప్పు కరిగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ గాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విపత్తును ఎదుర్కొనేందుకు మూడు ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాకు రప్పించారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తీర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ఏర్పేడులో గోడకూలి నాలుగేళ్ల బాలుడి మృతి
తిరుపతి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చెరువులు, రిజర్వాయర్లు నిండిపోయాయి. ఆదివారం స్వర్ణముఖి, కాళంగి, అరుణ, కైవల్య, ఉప్పుటేరు తదితర నదులతోపాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. కాజ్‌వేలపైకి వరద నీరు చేరడంతో అనేకమార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఏర్పేడు మండలం గుడిమల్లం ఎస్టీ కాలనీలో ఇంటి గోడ కూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు తీవ్రగాయాలతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వరదయ్యపాలెం మండలం పెద్దపాండూరులో విద్యుత్ తీగలు తెగిపడి గేదె మృతి చెందింది. తిరుచానూరు-ముళ్లపూడి మార్గంలో స్వర్ణముఖి నదిపై మట్టి వంతెన కొట్టుకుపోయింది. తిరుచానూరులో పంచాయతీ కార్యాలయం, అమ్మవారి ఆలయ పరిసరాలతోపాటు అనేక కాలనీలు నీట మునిగాయి. వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజీకి 4900 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు. కాళంగి రిజర్వాయర్‌కు 3300 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా మాసూళ్లు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని అధికారులను ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు.