పిడుగులు.. వడగళ్లు

ABN , First Publish Date - 2023-03-18T03:59:12+05:30 IST

దక్షిణ కోస్తా అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన

పిడుగులు.. వడగళ్లు

పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం

భారీగా ఉద్యాన, పంట నష్టాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌ వర్క్‌): దక్షిణ కోస్తా అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పంటలు, పశువులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లా.. విడపనకల్లు మండలం గడేకల్లు, డొనేకల్లు, అంచనహాల్‌, పొలికి, జనార్దనపల్లి, వేల్పుమడుగు, ఆర్‌కొట్టాల, విడపనకల్లు ప్రాంతాల్లో 600 ఎకరాల్లో కోత కోసి పొలాల్లో ఆరబెట్టిన 3,500 క్వింటాళ్ల మిరప పంట తడిసిపోయింది. బాధిత రైతులకు రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. పెద్దవడుగూరు మండలంలోని చిన్నవడుగూరు, పెద్దవడుగూరు, దిమ్మగుడి, కాశేపల్లి ప్రాంతాల్లో 300 ఎకరాల్లో కోతదశలోని కొర్ర, జొన్న నేలకొరిగింది. యాడికి మండలం రాయలచెరువులో ఓ రైతుకు చెందిన 200 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. బొమ్మనహాళ్‌ మండలం గోవిందవాడ, దేవగిరి గ్రామాల్లో మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అమడగూరు మండలంలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, టమాటా, మామిడి పంట దెబ్బతిన్నాయి. ఇండ్లవెంకటాంపల్లి రైతు రాంగోపాల్‌రెడ్డి రూ.3.20 లక్షలు ఖర్చుచేసి నాలుగు ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కోత సమయంలో దెబ్బతింది. నంద్యాల జిల్లాలో ఐదు వేల హెక్టార్లలో పంటలు నీటి పాలయ్యాయి. కోయిలకుంట్ల వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో 3,469 హెక్లార్టలో, ఆళ్లగడ్డ వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో 2,800 హెక్టార్లలో, నంద్యాల వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో 425 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని వ్యవసాయ అధికారుల అంచనా. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో 410 ఎకరాల్లో మొక్కజొన్న, 150 ఎకరాల్లో అరటి పంట నేలవాలింది. పదెకరాల్లో బొప్పాయి, సుమారు 50 ఎకరాల్లో జీడి మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతంలో కల్లాల్లో ఆరబోసి ఉన్న వేలాది టన్నుల మొక్కజొన్న, మిర్చి, మినుము తడిసి ముద్దయింది.

నేడూ వర్షాలు

విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నలుగురు మనుషులతోపాటు మూగజీవాలు సైతం..

నందాల జిల్లా శిరివెళ్ల మండలంలో గురువారం రాత్రి పిడుగుపడి మహదేవపురానికి చెందిన గొర్రెల కాపరి రాచకుంట్ల ఆంజనేయులు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. 32 గొర్రెలు కూడా చనిపోయాయి. అతనితోపాటే గొర్రెల కాపలాకు వెళ్లిన శంకర్‌, మద్దిలేటి, సాయి, విశ్వనాథ్‌, సుభాన్‌లకు గాయాలవగా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే పిడుగుపాటుకు గడివేముల, బేతంచర్ల మండలాల్లోని ఎల్‌కే తండా, బుగ్గనపల్లె తండాల రైతులకు చెందిన 12 ఆవులు మృతి చెందాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో గురువారం అర్ధరాత్రి పిడుగుపాటు శబ్దాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన నారాయణమ్మ(62), కమ్మలమ్మ (65) జడుసుకుని మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. నంబులపూలకుంట మండలం కుమ్మంవారిపల్లిలో రమణమ్మ అనే మహిళ ఇంటి వద్ద పిడుగుపడి ఇంటి గోడ బీటలు వారింది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌ తదితర వస్తువులు కాలిపోయాయి. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం ఆరవేటి పల్లెలో ఇంటి నిర్మాణం కోసం ఉంచిన టైల్స్‌ పెనుగాలుల తాకిడికి పై నుంచి పడటంతో సంకేపల్లి విశ్వనాథరెడ్డి(28) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందాడు. పెద్దముడియం మండలం పాలూరులో గొర్రెల మందపై వడగండ్ల వాన విరుచుకుపడింది. మందలోని 5 మంది గొర్రెలకాపరులకు చెందిన రూ.10 లక్షల విలువ చేసే దాదాపు 150 గొర్రెలు, మేకలు చనిపోయాయి. అకాల వర్షానికి అరటి, బొప్పాయి, పులుసునిమ్మ, చీనీనిమ్మ, మామిడి తదితర పంటలకు దాదాపు కోట్లల్లో నష్టం జరిగింది.

Updated Date - 2023-03-18T03:59:12+05:30 IST