Visakha steel: విశాఖ ఉక్కుకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2023-01-31T02:56:26+05:30 IST

పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు తామంతా అండగా ఉంటామని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రకటించారు.

Visakha steel: విశాఖ ఉక్కుకు  అండగా ఉంటాం

ఉక్కు ప్రజా గర్జన వేదికగా రాజకీయ పార్టీల ప్రకటన

ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాం: మంత్రి అమర్‌

తుది వరకు పోరాటం: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం: టీడీపీ

ఎంపీల రాజీనామాకు రెడీ: బండారు

ప్రత్యక్షంగా పాల్గొంటా..: జేడీ లక్ష్మీనారాయణ

ఎంపీలంతా నిలబడితే అబ్బ దిగివస్తాడు: సీపీఐ రామకృష్ణ

విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు తామంతా అండగా ఉంటామని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉక్కు నగరంలోని త్రిష్ణా మైదానంలో ఉక్కు కార్మిక ప్రజా గర్జన నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. ఇకపై ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్లాంటును దొంగచాటుగా ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను అడ్డుకుందామన్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలతో సీఎం జగన్‌ చర్చించారని, మద్దతు తెలియజేశారని వివరించారు. టీటీడీ చైర్మన్‌, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామన్నారు. అన్ని పార్టీలు ముందుకువస్తే ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ భయపడుతున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారని, ఆయన ఎవరికీ భయపడే వ్యక్తి కాదని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే తీర్మానం చేశామన్నారు.

2ukku2.jpg

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు అని, దీన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పోరాటాన్ని సాగించి పరిశ్రమను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై ఇప్పటికే తమ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించారని, తమకున్న ముగ్గురు ఎంపీలతోనూ రాజీనామా చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతినిధిగా చెబుతున్నానన్నారు. వైసీపీ, కమ్యూనిస్టు ఎంపీలు ముందుకువచ్చి పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, కమ్యూనిస్ట్‌ నాయకులు కలిసి ప్రధాని వద్దకు వెళ్లి కూర్చుంటే చిటికెలో సమస్య పరిష్కారమవుతుందన్నారు. పార్లమెంటులో ఎంపీలు గట్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇకపై తాను ఉక్కు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో ఉంటేనే మేలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కును పోస్కోకు, అదానీకి కట్టబెడతామని అంటున్నారని, ఇంతకీ ఎవడీ అదానీ అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 25 మంది లోక్‌సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులతోపాటు వామపక్షాలకు చెందిన 15 మంది ఎంపీలు...మొత్తం 52 మంది ప్రధాని కార్యాలయం ముందు నిలబడితే వాళ్ల అబ్బ కూడా దిగివస్తారన్నారు. గర్జనకు ఒక్క ఎంపీ కూడా రాలేదని, ఎంపీలు ముందుకువచ్చి పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన నేత కోన తాతారావు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకే శ్‌రెడ్డి, ఉక్కు ఉద్యమ నాయకులు ఆదినారాయణ, అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, తదితరులు మాట్లాడారు.

వైసీపీ నేతలకు నిరసన సెగ..

వైసీపీ నేతలకు స్టీల్‌ప్లాంటు కార్మికులు, ఉద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీ్‌పరాజ్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతున్న సమయంలో మాట్లాడొద్దంటూ చేతులు అడ్డంగా ఊపుతూ, ప్రసంగం ఆపేయాలంటూ జనం నినాదాలు చేశారు. తమ పార్టీ ముందు నుంచి ఉద్యమానికి అండగా ఉందని సుబ్బారెడ్డి అన్నప్పుడు ‘లేదు...లేదు’ అంటూ కార్మికులు, ఉద్యోగులు నినాదాలు చేశారు. అయితే నిసనలను పట్టించుకోకుండానూ ముగ్గురూ ప్రసంగాలను కొనసాగించారు.

Updated Date - 2023-01-31T02:56:27+05:30 IST