Polavaram project : పోలవరంపై ఏం తేలుస్తారో?!

ABN , First Publish Date - 2023-07-09T03:44:57+05:30 IST

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు.. సందేహాలు తెరమీదికి వచ్చాయి. ప్రాజెక్టు పరిస్థితిపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన జలశక్తి శాఖ తాజా భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏ

 Polavaram project : పోలవరంపై ఏం తేలుస్తారో?!

డయాఫ్రమ్‌ వాల్‌ కట్టమంటారా?

మరమ్మతుచేస్తే చాలని వదిలేస్తారా?

‘గైడ్‌బండ్‌’ బాధ్యులను గుర్తిస్తారా?

ప్రాజెక్టు నిధులపై స్పష్టత ఇస్తారా?

నిర్మాణం పూర్తికి డెడ్‌లైన్‌ విధిస్తారా?

సర్వత్రా ఉత్కంఠ.. అనేక సందేశాలు

రేపు జలశక్తి ఉన్నతస్థాయి కీలక భేటీ

హాజరుకానున్న జలవనరుల అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు.. సందేహాలు తెరమీదికి వచ్చాయి. ప్రాజెక్టు పరిస్థితిపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన జలశక్తి శాఖ తాజా భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏ విధమైన దిశానిర్దేశం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్త వాల్‌ను నిర్మిస్తారా.. లేక ప్రస్తుతం ఉన్న వాల్‌ను ఆధారం చేసుకుని ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అదేవిధంగా.. కగైడ్‌బండ్‌ కుంగిపోవడానికి కారణాలేమిటి? అందుకు బాధ్యులెవరనే విషయంపైనా ఈ సమావేశంలో ఏం తేలుస్తారనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరుకు అయ్యే వ్యయం రూ.12,911.15 కోట్లతో సరిపుచ్చుతారా? రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా రూ.17,144 కోట్లకు కేంద్రం ఆమోదిస్తుందా? అనేది ఈ భేటీలో తేలిపోతుందని జలవనరుల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. అదేసమయంలో 45.72 మీటర్ల కాంటూరు మేరకు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు కేంద్రం అంగీకరిస్తుందా? అనే కూడా చర్చసాగుతోంది.

సవరించిన అంచనాలపైనా చర్చ!

పోలవరం నిర్మాణంలో కొత్తగా 16,642 నివాసాలు ముంపునకు గురవుతాయని లెక్కతేల్చారు. వారిని ఆదుకునేందుకు రూ.5,142 కోట్లు ఖర్చవుతుందని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని కూడా కలిపి.. రూ.60,690.87 కోట్లకు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్రం మంజూరు చేస్తుందా? అనే విషయం ఈ భేటీలో తేలుతుందని భావిస్తున్నారు. డయాఫ్రమ్‌వాల్‌ మరమ్మతులతో సరిపుచ్చితే.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కాలపరిమితిని ఎంత పెడుతుందనేది మరో ప్రశ్న. ఒకవేళ కొత్తగా మళ్లీ డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలంటే.. సాంకేతికంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంత గడువు ఇస్తుందనేది జలవనరుల నిపుణులు చర్చిస్తున్నారు.

గైడ్‌బండ్‌పై ఏం చేస్తారు?

గైడ్‌బండ్‌ కుంగిపోవడాన్ని కేంద్ర జలశక్తి శాఖ సీరియస్‌ గా తీసుకుంది. ఇప్పటివరకు పోలవరం నిర్మాణ నాణ్యతపై సందేహం వ్యక్తం చేయని ఆ శాఖ గైడ్‌బండ్‌ కుంగిపోయాక కేంద్ర సంస్థలపైనే సందేహాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా ప్రాజెక్టు పనులను థర్డ్‌పార్టీ పర్యవేక్షక సంస్థగా బాధ్యతలు నిర్వహిస్తున్న వాప్కో్‌సపై 3న జరిగిన సమీక్షలో జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నాణ్యతపై ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దీనిపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 45.72 మీటర్ల కాంటూరులో భూసేకరణ కోసం మరో రూ.28,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా, 41.15 మీటర్ల కాంటూరుకు హెడ్‌వర్క్స్‌తో కలుపుకొని రూ.17,144 కోట్ల దాకా ఖర్చవుతుందని జల వనరుల శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో.. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ ఢిల్లీలో సోమవారం కేంద్ర జలశక్తి ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో సమాధానాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర జల శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌తో పాటు.. సీడబ్ల్యూసీ, వాప్కోస్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డీడీఆర్‌పీ, ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎస్‌ఈ తదితరులు పాల్గొననున్నారు.

ఇదే జరిగితే మరో ఐదేళ్లు!!

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్‌వాల్‌ పూర్తిగా దెబ్బతినలేదని, కొన్నిచోట్ల మరమ్మతులు చేస్తే సరిపోతుందని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో కేంద్ర జలశక్తి శాఖ కొన్నాళ్ల కిందట ఏకీభవించింది. అయితే.. ఈ నెల 3న జరిగిన సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి కొత్త డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాలని సూచించారు. ఇదే కనుక ఆచరణలోకి వస్తే సమయం సహా నిధుల వ్యయం భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాలని తీర్మానిస్తే.. సర్వేలు, నివేదికల కోసం ఆరునెలలు, నిర్మాణానికి రెండేళ్లు, దాని నాణ్యత నిర్ధారణకు మరో 6 మాసాలు పడుతుందని చెబుతున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌పై ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి మరో రెండేళ్లు పడుతుంది. ఇలా మొత్తంగా ఐదేళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా డయాఫ్రమ్‌వాల్‌కు మరమ్మతులు చేపట్టి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను వేయొచ్చని సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. 2024 జనవరి నుంచి పనులు ప్రారంభించేందుకు వీలుంటుందని చెబుతున్నారు.

ఎల్‌ అండ్‌ టీ, బావర్‌తో సంప్రదింపులు

పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన డయాఫ్రం వాల్‌ మరమ్మతుల అంశం ముందుకు కదలడం లేదు. దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్త వాల్‌ నిర్మించి ఇప్పుడున్న వాల్‌తో అనుసంధానించాలని నేషనల్‌ హైడ్రో-ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు సూచించారు. దీనితో కేంద్ర జలశక్తి శాఖ విభేదిస్తోంది. అనుసంధానం చేసిన తర్వాత భవిష్యత్తులో ఏదైనా భారీ విధ్వంసం జరిగి, అపార ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. అందుకు తాము బాధ్యత వహిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు గానీ, ప్రాజెక్టును నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ గానీ ముందుకు రావడం లేదు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే మొగ్గు చూపుతున్న మేఘా... గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపింది.

Updated Date - 2023-07-09T03:44:57+05:30 IST