Share News

AP CM Jagan : ఏపీకి ఎందుకీ జగన్‌?

ABN , First Publish Date - 2023-11-09T03:54:28+05:30 IST

‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అంటూ పెద్ద శీర్షిక... పక్కనే తనమార్కు నవ్వుతో జగన్‌ బొమ్మ! చివర్లో మళ్లీ...

AP CM Jagan : ఏపీకి ఎందుకీ జగన్‌?

ప్రభుత్వ కార్యక్రమంగా వైసీపీ అజెండా

‘ఈ రాష్ట్రానికి మళ్లీ నేనే సీఎం కావాలి’... అని జగన్‌ చెప్పుకొంటున్నారు. తాను, తన పార్టీ వాళ్లు చెబితే జనం నమ్మరని కాబోలు... ‘నా గురించి చాటింపు వేయండి’ అంటూ ఈ కార్యక్రమాన్ని అధికారికం చేసి, ఆ బాధ్యతను అధికారులకు అప్పగించారు. గురువారం నుంచి ఇంటింటికీ వెళ్లి ‘జగన్నామ స్మరణ’ చేయాలని ప్రభుత్వ సిబ్బందిని ఆదేశించారు. దీనికోసం ఏకంగా 24 పేజీల రంగురంగుల బ్రోచర్‌ను సిద్ధం చేశారు. అందులో అనేక అంకెలు అచ్చు వేశారు. పొట్ట విప్పి చూడ... అన్నట్లుగా అందులో అన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలు, తప్పుదారి పట్టించే గణాంకాలే! ఇదే తన గొప్పగా చెప్పుకొంటూ... ఇంటింటా ఈ డప్పు కొట్టాలని జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ సిబ్బందితో, ప్రభుత్వ ఖర్చుతో ఫక్తు రాజకీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారీ ఖర్చుతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అంటూ మొదలైన ఈ బ్రోచర్‌... ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ముగుస్తోంది. ఇందులోని అంశాలను పరిశీలించి... అసలు వాస్తవాలతో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది...

ఈ ప్రశ్నలకు బదులేదీ...

‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే కావాలి’ అంటూ సర్కారు ముద్రించిన బ్రోచర్‌పై అధికారులు, మేధావులు, విశ్లేషకులు, విపక్షాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవీ వారు సంధిస్తున్న ప్రశ్నలు...

ఈ రాష్ట్రానికి జగన్‌ ఎందుకు? కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రచారంచేసి... అధికారంలోకి రాగానే బీజేపీ పెద్దలకు సాగిలపడినందుకా?

జల జీవనాడి ‘పోలవరం’ ప్రాజెక్టును రివర్స్‌ టెండర్లతో దెబ్బతీసి... నీటి నిల్వస్థాయి బ్యారేజీగా మార్చినందుకా?

కృష్ణా జలాల పంపకాలను పునఃసమీక్షించాలన్న కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించకుండా రాయలసీమను ఎడారి చేస్తున్నందుకా?

ప్రజాధనంతో రాజకీయ ప్రచారానికి రెడీ

నేటి నుంచి ప్రభుత్వ సిబ్బందితో జగన్‌ భజన

జనాన్ని నమ్మించేందుకు రూ.10 కోట్లతో బుక్‌లెట్లు

అబద్ధాలు, కట్టుకథలతో మాయలు

సంక్షేమం, గ్రామాభివృద్ధి, మహిళా సాధికారతపై డొల్ల మాటలు

అప్పులు, అభివృద్ధిపై అసత్య గణాంకాలు

పెట్టుబడులపైనా కోట్లతో కనికట్టు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అంటూ పెద్ద శీర్షిక... పక్కనే తనమార్కు నవ్వుతో జగన్‌ బొమ్మ! చివర్లో మళ్లీ... ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ మళ్లీ జగన్‌ బొమ్మ! దీనిని చూస్తే ఏమనిపిస్తుంది? ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ ముద్రించుకున్న కరపత్రం అనుకుంటారు కదా? కానే కాదు! ఇది ప్రభుత్వ వ్యయంతో, అధికార పార్టీ చేసుకుంటున్న ఎన్నికల ప్రచారం! దీని పేరు ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే!’ ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని తొలుత పార్టీ కార్యక్రమంగా చేపట్టారు. కానీ... ఎక్కడికక్కడ నిలదీతలు, నిరసనలు ఎదురుకావడంతో పార్టీ నేతలు జనంలోకి వెళ్లలేక మొఖం చాటేశారు. దీంతో దానిని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసిన సంగతి తెలిసిందే. ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు కావాలంటే!’ అనేది మొదట రాజకీయ నినాదంగా మొదలైంది. ఇప్పుడు దానిని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. గురువారం నుంచే ఈ కార్యక్రమం మొదలుకానుంది. దీనికోసం రూ.10 కోట్ల వ్యయంతో ఏకంగా 24 పేజీల బ్రోచర్లను ముద్రించారు. తనది ‘విప్లవాత్మక పాలన’గా చెప్పుకొన్నారు.

పల్లెల ప్రాణం తీసి...

తాను చేస్తున్నదే గొప్ప పాలన అని చెప్పుకొనేందుకు... గాంధీ, అంబేడ్కర్‌, కలాం కొటేషన్లను వాడుకున్నారు. ఇందు లో... గ్రామ స్వరాజ్యం, సామాజిక స్వేచ్ఛ, మ హిళా వికాసం గురించి ఆ మహనీయులు చెప్పిన మాటలున్నా యి. జగన్‌ అధికారంలోకి రాగానే గ్రామస్వరాజ్యాన్ని చావుదెబ్బకొట్టారు. పల్లెలకు ఇచ్చే నిధులను దారిమళ్లించే శారు. నిధుల కోసం సర్పంచ్‌లు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. రాష్ట్రపతిని కలిసి జగన్‌ సర్కారు తీరుపై ఫిర్యాదు చేశారు. ఇక... సామాజిక స్వేచ్ఛ గురిం చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. దళిత వైద్యుడు సుధాకర్‌ ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కొట్టిన ఘటన నుంచి తాజాగా కృష్ణా జిల్లాలో ఓ దళిత యువకుడిపై దాడిచేసి ఒంటిపై మూత్రం పోయడం వరకు... దళితులపై జరిగిన దారుణాలు ఎన్నెన్నో! ఇక జగన్‌ పాలనలో మహిళలకు కొత్తగా దక్కిన సాధికారత ఏమిటో ఎవరికీ తెలియదు. డ్వాక్రా మహిళలను బలవంతంగా సభలకు రప్పించి, నిర్బంధించడమే ఇప్పుడు జరుగుతోంది. ఇక... సోషల్‌ మీ డియాలో ప్రశ్నించారంటూ వృద్ధ మహిళలపైనా కేసులు పెట్టి, వేధించిన చరిత్ర జగన్‌ సర్కారుది! మహిళలపై వైసీపీ నేతలు దాడులకు దిగిన ఘటనలు కోకొల్లలు.

మాట తప్పలేదట...

మాటతప్పం, మడమతిప్పం... నేను విన్నాను, నేను ఉన్నాను... అభివృద్ధి ఎంతముఖ్యమో, సంక్షేమం అంతే ముఖ్యం అనే సూత్రాల ఆధారంగా తనపాలన సాగుతోందంటూ జగన్‌ చెప్పుకొచ్చారు. ఇందులో తండ్రి వైఎస్‌ ఫొటో ముద్రించారు. ‘మాట తప్ప ం... మడమ తిప్పం’ అని అధికారంలోకి వచ్చిన కొత్తలో చెబితే నమ్మరేమోకానీ, ఇప్పుడు జనం పగలబడి నవ్వుకుంటున్నారు. వారంలో సీపీఎ్‌సను రద్దుచేస్తామన్న మాటను అటకెక్కించారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు సరిగ్గా డీఏ బకాయిలు ఇవ్వట్లే దని జగన్‌ సారు నానా పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చా క డీఏలకు, బకాయిల సంగతి పక్కనపెడితే జీతాల కోసమే ఎదురుచూపులు చూసే దుస్థితి తెచ్చారు. మెగా డీఎస్సీ, అమరావతే రాజధాని, సంపూర్ణ మద్య నిషేధం, చదువుకునే పిల్లలందరికీ అ మ్మఒడి, 3వేల పింఛను.. ఇలా మడమ తిప్పిన మాటలు ఎన్నెన్నో!

లెక్కల్లో వీకా?

ఈజ్‌ ఆఫ్‌ డూ యింగ్‌ బిజినె్‌సలో 2019, 2020 సంవత్సరాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని జగన్‌ సెలవిచ్చారు. నిజానికి, 2018లో జరిగిన ప్రభుత్వ వ్యవహారాలు, నిర్ణయాలు, అమలు ఆధారంగా 2019 రిపోర్టు తయారు చేస్తారు. అంటే... అది టీడీపీ ఘనతే. జగన్‌ గ్రేట్‌ అనుకుంటే... 2021, 2022 సంవత్సరాల ర్యాంకులను ప్రకటించాలి. కానీ... అది చెప్పుకొనే ధైర్యంలేక కాబోలు, ‘దాచి పెట్టారు’.

ఆరిట్లో ఒక్కటైనా సరిగ్గా చేశారా?

ఆరు అంశాలపై జగన్‌ ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకొన్నారు. అవన్నీ ఉత్తుత్తి ప్రగల్భాలే...

పాలనా వికేంద్రీక రణ కింద జిల్లాల విభజన, సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్ధల ద్వారా మెరుగైన పాలన, సేవలు అందిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తున్నట్లు బ్రోచర్‌లో గొప్పగా చెప్పారు. జిల్లా కేంద్రాల ఏర్పాటులో రాజకీయ పక్షపాతాన్ని ప్రదర్శించారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేట కాకుండా రాయచోటిని కేంద్రం చేయడం... నరసాపురం కాకుండా భీమవరం జిల్లా కేంద్రం చేయడం ఇందులో భాగమే. డివిజన్‌లు, మండలాల విభజనలో సర్కారు సకల విన్యాసాలు ప్రదర్శించింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఫక్తు రాజకీయ వ్యూహంలో భాగమే. వలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలనే నియమించారు. గ్రామ స్థాయిలో పంచాయతీల్లో జరిగే పనులను సచివాలయాలకు మార్చారు. పింఛన్లు,

ప్రజలందరికి మెరుగైన జీవనప్రమాణాలు కల్పించే క్రమంలో పింఛన్లు, ఆర్థికసాయం, ఆరోగ్య సంరక్షణ ద్వారా పేదలకు సాయం చేస్తున్నట్లు జగన్‌ చెప్పారు. ఇవేవీ జగన్‌ ప్రవేశ పెట్టినవి కావు. దశాబ్దాలుగా అమలవుతున్నవే.

కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ప్రయోజనాలు అందిస్తున్నామని జగన్‌ చెప్పారు. సంక్షేమ పథకాలకు కులం, మతం ప్రాతిపదిక కాదు. పేదరికం, వెనకబాటుతనమే ప్రాతిపదిక. ఏ ప్రభుత్వమైనా దీనినే పాటిస్తుంది. పాటిస్తోంది.

సంక్షేమ పథకాలను అందించడంలో మధ్యవర్తులు, అవినీతి వంటివి తొలగించి వలంటీర్లు, డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకే సేవల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తుల పాత్ర లేదు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌(డీబీటీ) జగన్‌ కనిపెట్టింది కానేకాదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇది అమల్లోకి వచ్చింది. జగన్‌ కొత్తగా వలంటీర్లనే మధ్యవర్తులను తెరపైకి తీసుకొచ్చారు.

సుపరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీటవేశామని జగన్‌ తనపాలన గురించి అద్భుతమైన సూత్రీకరణ చెప్పారు. అవి డొల్లమాటలే. ఎందుకంటే, సీఎం జగన్‌ తన సామాజికవర్గానికే పెద్దపీటవేశారు. ఇతర వర్గాలకు పదవులు ఇచ్చినా... అవి ప్రాధాన్యంలేనివే. కొందరికి పెద్ద పదవులు ఇచ్చినా పెత్తనం సొంత సామాజిక వర్గ అధికారులు, నాయకులదే!

మహిళా సాధికారత ద్వారా ప్రతి కుటుంబ సాధికారతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు సర్కారు గొప్పగా చెప్పింది. మహిళా సాధికారత అంటే ఏమిటి? మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందడుగువేసి స్వీయ నిర్ణయాధికారం తీసుకోవడం! జగన్‌ పాలనలో మహిళలకు అమ్మఒడి కింద ఆర్ధిక సహాయం చేస్తున్నారు. అంతే, మహిళా కార్పొరేషన్‌కు పనిలేకుండా చేశారు. స్వయం ఉపాధి పథకాలు లేవు. జీవనోపాధికి కొత్త అవకాశాలు లేనేలేవు.

పేర్లు మార్చడం.. జగన్‌ సిద్ధాంతం

జగన్‌ తన సిద్ధాంతాలను ఎలా అమలు చేస్తున్నారో చెప్పుకొనేందుకు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. అందులో జగనన్న అమ్మఒడి అనేది తప్ప మిగిలినవన్నీ పాత సంక్షేమ పథకాలే. ఇందులో కేంద్ర సర్కారు నిధులతో సుదీర్ఘకాలంగా అమలవుతున్నవి, గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినవి అనేకం ఉన్నాయి. జగన్‌ ఎమ్మెల్యే కాకముందు నుంచే రైతు భరోసా పథకం ఉంది. కానీ ఆయనే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చే సిద్ధాంతాన్ని కనిపెట్టినట్లుగా చెబుతున్నారు. ఉచిత పంటల బీమా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌, ఆసరా, చేయూత, పించను, ఇళ్ల నిర్మాణం... ఇవన్నీ జగన్‌ ఎమ్మెల్యే కాకముందు నుంచే అమలవుతున్న పథకాలు. జగన్‌ చేసిందల్లా... వాటి పేర్లు, అమలు తీరు మార్చడమే!

అభివృద్ధి, అప్పులపై కాకిలెక్కలు

తన హయాంలో అభివృద్ధి ఎక్కువ, అప్పులు తక్కువ అని చెప్పేందుకు బ్రోచర్‌లో అనేక కాకిలెక్కలను ముద్రించారు. జీఎ్‌సడీపీ వృద్ధిరేటులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉందని... 2021-22లో దేశంలో తొలిస్థానంలో ఉందని చెప్పారు. జీఎ్‌సడీపీ పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరగాలి కదా! అదే నిజమైతే అప్పులు చేస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వేలకోట్ల బిల్లులు పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయి?

ఈ ప్రశ్నలకు బదులేదీ..

మూడు రాజధానులంటూ.. చివరికి ఒక్క రాజధాని నగరం కూడా లేకుండా చేసి ఇతర రాష్ట్రాల ప్రజల ముందు నవ్వుల పాలు చేసినందుకా?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపనందుకా? విశాఖ రైల్వేజోన్‌ సాధించనందుకా? కడప స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు రాబట్టనందుకా?

కొత్త ఇసుక విధానం పేరుతో నెలల తరబడి ఇసుకను ఆపి, భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసినందుకా?

నాసిరకం మద్యం తీసుకొచ్చి పేదల ఆరోగ్యంతో ఆడుకున్నందుకా?

కేవలం తెలుగుదేశం హయాంలో నిర్మించారనే కక్షతో టిడ్కో ఇళ్ల పనులను పూర్తి చేయకుండా పాడు పెడుతున్నందుకా?

మద్యనిషేధం గురించి అడగొద్దు

దశలవారీగా మద్య నిషేధం చేస్తామని జగన్‌ మహిళా లోకానికి హామీఇచ్చారు. ‘మాట తప్పని ఈ నాయకుడు’ దీనిపై మడమ తిప్పేశారు. మద్య నిషేధం కాస్తా... మద్య నియంత్రణగా మారింది. చివరికి... మద్యంపై వచ్చేఆదాయంతోనే అమ్మ ఒడిలాంటి పథకాలు అమలుచేస్తున్నామని మొహమాటం లేకుండా ప్రకటించుకున్నారు. ఇక... అప్పట్లో ఎక్కడో ఒక చోట బెల్టుషాపు. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్టు షాపులే.

ఉన్నారు సరే... విన్నారా?

ఎన్నికల ముందు ‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అని జగన్‌ ఊదరగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే మాయ మాట చెబుతున్నారు. తాడేపల్లి నివాసానికి కూతవేటు దూరంలో యువతిని రేప్‌ చేసి చంపేశారు. గంజాయి మత్తులో ఒక దుండగుడు 17 ఏళ్ల బాలికపై దాడిచేసి చంపేశాడు. కుమార్తెకు వైద్య ఖర్చుల కోసం ఇంటిని అమ్ముకోనివ్వడంలేదని ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసినా దిక్కులేదు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ విషయంలో న్యాయం చేయాలని ఉద్యోగులు నెత్తీనోరూ బాదుకున్నా పట్టించుకోలేదు. మరి... జగన్‌ ఉన్నారు సరే! ఏం విన్నారు, విని ఏం చేశారు?

పరిశ్రమలపై కోతల రాతలు

నాలుగున్నరేళ్లలో రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్ధిక అభివృద్ధిలో దూసుకుపోయిందని గ్రాఫిక్స్‌ బొమ్మలు వేశారు. విశాఖ జీఐఎస్‌ సదస్సు ద్వారా 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని గొప్పగా చెప్పారు. సదస్సు జరిగి 10 నెలలు కావొస్తోంది. ఇప్పటికి నికరంగా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పుకోలేని పరిస్థితి. తమ హయాంలో 67వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 127 పెద్ద పరిశ్రమల స్ధాపించడం ద్వారా 85వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని నివేదించారు. ఆ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, ఏర్పాటైన పరిశ్రమలు, ఒప్పందం ఎప్పుడు కుదిరింది, పనులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిశాయి... అనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయగలదా?

Updated Date - 2023-11-09T04:40:12+05:30 IST