దొంగ మోహన్‌ను ఎందుకు నమ్మాలి?

ABN , First Publish Date - 2023-04-08T03:56:14+05:30 IST

పదో తరగతి ఫెయిల్‌ అయిన దొంగ మోహన్‌కి అన్నీ కన్నింగ్‌ తెలివితేటలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

దొంగ మోహన్‌ను ఎందుకు నమ్మాలి?

‘నువ్వే మా నమ్మకం’ అంటూ కొత్త డ్రామా

ఇళ్లకు స్టిక్కర్ల ముసుగులో గోబెల్స్‌ ప్రచారం

63వ రోజు యువగళం పాదయాత్రలో లోకేశ్‌

అనంతపురం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫెయిల్‌ అయిన దొంగ మోహన్‌కి అన్నీ కన్నింగ్‌ తెలివితేటలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ చేసేవన్నీ దొంగ పనులే కాబట్టి.. దొంగ మోహన్‌ అని పేరు పెట్టాల్సి వచ్చిందన్నారు. ‘దొంగ మోహన్‌ స్టైలే వేరప్పా... కొత్తగా నువ్వే మా నమ్మకం... నువ్వే మా భవిష్యత్తు.. జగన్‌కు చెబుదాం.. అంటూ ఇళ్లకు స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని ప్రారంభించారని విమర్శించారు. సొంత కుటుంబ సభ్యులే నమ్మని జగన్‌ని.. ఎందుకు నమ్మా లో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువగళం పాదయాత్ర 63వ రోజు శుక్రవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొనసాగింది. గార్లదిన్నె మండలం మర్తాడు శివారులోని విడిది కేంద్రం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అదే మండలంలోని జుంబులదిన్నె కొట్టాల విడిది కేంద్రం వరకూ 10.03 కి.మీ. నడక సాగించారు. మొత్తం మీద ఇప్పటి వరకూ 815.7 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు. గురువారమే 800 కి.మీ. మైలురాయి దాటిన సందర్భంగా మర్తాడు వద్ద శుక్రవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ‘జనచైతన్యమే యువగళం ధ్యేయం. సమస్యల పరిష్కారానికి మార్గం. అందుకు దిక్సూచిగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. ఈ ప్రాంతంలో చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతాం’ అని లోకేశ్‌ ప్రకటించారు. గార్లదిన్నెలో నియోజకవర్గ టూమెన్‌ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు.

కొత్త డ్రామాకు తెర... ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం మొట్టికాయలు వేయడంతో దిగొచ్చిన జగన్‌, ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశాడని లోకేశ్‌ విమర్శించారు. వలంటీర్లు, గృహసారథులు.. ప్రజల ఇళ్లకు వెళ్లి జగన్‌కు డప్పుకొట్టాలంట.. ఇదీ మరో కొత్త డ్రామా అని అన్నారు. ‘నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు.. జగన్‌కు చెబుదాం’ అంటూ స్టిక్కర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సొంత కుటుంబసభ్యులే నమ్మని జగన్‌ని జనమెందుకు నమ్మాలని ఆయన ప్రశ్నించారు. వలంటీర్‌ స్టిక్కర్‌ అతికిస్తే... ఆ స్టిక్కర్‌ పీకి.. మేమెందుకు నమ్మాలని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. జొన్నలగడ్డ పద్మావతి పేరుకే ఎమ్మెల్యే అని... పెత్తనమంతా ఆమె భర్త సాంబశివారెడ్డిదే అని లోకేశ్‌ విమర్శించారు.

యువత భవితతో ఆటలొద్దు జగన్‌

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘గంజాయి వద్దు బ్రో’ అంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ యువగళం బృందంతో వినూత్న కార్యక్రమం చేపట్టాం. గంజాయి సమస్య రాష్ట్రంలో తీవ్రమైనదిగా గుర్తించి, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని నిర్ణయించాను. చంద్రగిరిలో పాదయత్ర సందర్భంగా ఓ తల్లి నన్ను కలిసి, తన కుమార్తె గంజాయికి బానిసైందని చెప్పిన మాటలు తీవ్రంగా కలిచివేశాయి. కొందరు వైసీపీ పెద్దలే తూర్పుగోదావరి, విశాఖ ఏజెన్సీల్లో గంజాయి సాగు చేస్తుండటం కలవరపరుస్తోంది. దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా... వాటి మూలాలు రాష్ట్రంలో ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థంచేసుకోవాలి. యువత భవితతో ఆటలాడొద్దు జగన్‌..! ఈ అరాచక పాలనను అంతమొందించేందుకే యువగళం పాదయాత్ర. యువతా... కలిసి పోరాడుదాం రండి. - నారా లోకేశ్‌

Updated Date - 2023-04-08T03:56:21+05:30 IST