AP News: ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆమె వేదన వింటే...
ABN , First Publish Date - 2023-08-03T15:43:42+05:30 IST
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తివారి శారదావతి (60) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. అయితే వెంటనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. భీమవరం జిల్లా మొగల్తూరుకు చెందిన బాధితురాలు తివారి శారదావతి.. మొగల్తూరులోని తమ భూములను అధికారులు అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని వాపోయింది. కోట్లరూపాయల విలువైన 2.60 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారని తెలిపింది. తమ ప్రమేయం లేకుండానే మొగల్తూరు ఎమ్మార్వో, వీఆర్వోలు ఆన్‌లైన్‌లో తమ పేర్లు మార్చారని మహిళ తెలిపింది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ఆస్తులను బదలాయించారని బాధితురాలు ఆరోపించారు.
ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, సీఎం కార్యాలయం వద్ద స్పందనలో వినతి పత్రాలు ఇచ్చినట్టు మహిళ వెల్లడించింది. తనకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ న్యాయం చేయాలని వేడుకున్నా ఫలితం లేదని వాపోయింది. స్పందనలో సీఎం జగన్‌కు విన్నవించేందుకు గురువారం మరోసారి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బాధితురాలు వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్‌కు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమై పోలీసులు మహిళ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు న్యాయం చేయాలని మహిళ కన్నీటి పర్యంతమవడం అక్కడున్న వారిని కలిచివేసింది.