YCP movie is over : ఇక వంద రోజులే!
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:02 AM
ఇక మిగిలింది వంద రోజులే. వైసీపీ సినిమా అయిపోతుంది. ఈలోపు యువత ఇంట్లో ఉండొద్దు. మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ వంద రోజులు కష్టపడండి.

వైసీపీ సినిమా అయిపోయింది
మీకోసం, రాష్ట్రం కోసం కష్టపడండి.. రాష్ట్ర భవిత కోసం కదిలిరండి
సంపద సృష్టించే సామర్థ్యం టీడీపీది.. దోచుకునే నైజం వైసీపీది
అవినీతిని, రౌడీయిజాన్ని పెంచింది జగనే.. చంద్రబాబు ధ్వజం
కుప్పంలో 3 రోజుల పర్యటన ప్రారంభం
గుడుపల్లె, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇక మిగిలింది వంద రోజులే. వైసీపీ సినిమా అయిపోతుంది. ఈలోపు యువత ఇంట్లో ఉండొద్దు. మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ వంద రోజులు కష్టపడండి. మీ జీవితాల్లో నేను వెలుగు తెస్తాను’’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజుల పర్యటనను ఆయన గురువారం ప్రారంభించారు. బెంగళూరు నుంచి వచ్చిన చంద్రబాబుకు గుడుపల్లె మండలంలోని సరిహద్దు ప్రాంతం బిసానత్తం గ్రామంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుడపల్లె బస్టాండులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే అవినీతిని, రౌడీయిజాన్ని సీఎం జగన్ ప్రోత్సహించారు. ఇప్పుడు వాళ్లను మార్చేసి పతివ్రత అనుకుంటే ఉపయోగం లేదు’’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘క్రీడా మైదానాలు లేకుండానే ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్నారు. దోచుకుందాం.. దాచుకుందాం.. కార్యక్రమాన్ని చేస్తే వారికి సరిపోతుంది’ అని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే..
పోలీసులూ మారాలి...
‘సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వారికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఇక సాధారణ పౌరులకేం ఉంటుంది? వైసీపీకి ఇక మిగిలింది వంద రోజులే. ఆ పార్టీ సినిమా అయిపోయింది. ఈ ప్రభుత్వం పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తోంది. పోలీసులకూ నేనే దిక్కు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇకనైనా పోలీసులు ముందుకు రావాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. మీరు ప్రస్తుతం సైకో సీఎం కింద కాదు, ఈసీ కింద పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మేం అధికారంలోకి రాగానే మహిళలు గౌరవంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తాం. వచ్చే ఐదేళ్లలో జాబ్ కేలెండర్ విడుదల చేసి, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తాం. నేను వచ్చిన వెంటనే రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తా. ఐటీ ప్రొఫెషనల్స్ కలిసి బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటు చేసుకుని, నన్ను సమావేశానికి ఆహ్వానించారు. మీరు మాకు దారి చూపించారని వారంతా కృతజ్ఞత తెలిపారు. అప్పట్లో ఐటీ రంగాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేసింది నేనే. కానీ, ఇప్పుడు ఒక్క అవకాశం పేరుతో జగన్ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి ప్రతి రైతూ బాగుపడేలా చేస్తా. బీసీల్లో 140 కులాలున్నాయి. జయహో బీసీ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి బీసీల రుణం తీర్చుకుంటా.
ఒకటో తేదీన జీతమేదీ?
‘‘చాలీచాలని జీతాలతో అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తేదీన జీతం అందక ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా హయాంలో ఒకటో తేదీన జీతాన్ని ఇచ్చేవాళ్లం.
ఏపీ కోసం వంద రోజులు పనిచేయండి
బెంగళూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు విశ్వవ్యాప్తంగా స్థిరపడిన ప్రవాసాంధ్రులైన ఐటీ నిపుణులు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు, టీడీపీ అభిమానులు వందరోజులపాటు కష్టపడి పనిచేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు. గురువారమిక్కడ వైట్‌ఫీల్డ్‌లో బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి బెంగళూరుతోపాటు కర్ణాటక వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబుకు యాపిల్ పండ్ల గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నాకు కష్టం వచ్చినప్పుడు బెంగళూరులో నిరంతరంగా పోరాటాలతో మద్దతు పలికారు. పలు రాష్ట్రాలతోపాటు 70-80 దేశాల్లో నాపై చూపిన అభిమానం ఏ నాయకుడికీ దక్కదు. ఇందుకు ధన్యవాదాలు’ అని అన్నారు.
‘‘వైసీసీ వాళ్లు ఆంబోతుల్లా ఊరికొకరు తయారయ్యారు. ఊళ్ల మీద పడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ జడ్పీటీసీ... వృద్ధురాలిపై దాడి చేశాడు. యథారాజా తథా ప్రజా అన్నట్టు జగన్ పార్టీలో నాయకుల తీరు ఉంది. కుప్పంలో వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న అక్రమ క్వారీలను చూసి, నేను లెటర్లు రాస్తే ఓ వారం పనులు ఆపారు. మళ్లీ ప్రారంభించి, ఇప్పుడు కొనసాగిస్తున్నారు. కేంద్రాన్ని మోసం చేసి ఉపాధి హామీ నిధులు రూ.వందల కోట్లను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు’’
- చంద్రబాబు
చంద్రబాబుతో డీకే శివకుమార్ ముచ్చట
బెంగళూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కలిశారు. బెంగళూరు పర్యటన నిమిత్తం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి గురువారం చేరుకున్నారు. అదే సమయంలో నాగపూర్ వెళ్తున్న డీకే శివకుమార్... చంద్రబాబుకు ఎదురుపడ్డారు. ఇరువురూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. ఆ తర్వాత భద్రతా బలగాలు, అధికారులకు దూరంగా డీకే, చంద్రబాబును తీసుకెళ్లారు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య రాజకీయా అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
గజదొంగ కథ
‘ఓ గజ దొంగ ఒకసారి పోలీసులకు దొరికిపోయాడు. కోర్టులో శిక్ష వేసే సమయంలో చివరి కోరిక ఏంటని దొంగను జడ్జి అడిగారు. మా అమ్మను పిలవమని ఆ దొంగ కోరాడు. చివరిసారిగా అమ్మను చూసి నమస్కరిస్తాడనుకున్నారంతా. కానీ, ఆ దొంగ తన అమ్మను గట్టిగా కొరికేశాడు. అదేంటని అందరూ షాక్ అయ్యారు. దొంగను అడిగితే.. నేను మొదట్లో తప్పు చేసినప్పుడే మా అమ్మ నన్ను దండించి ఉంటే నేను గజదొంగ అయ్యేవాడిని కాను. ఇప్పుడు నాకీ శిక్ష పడేది కాదని దొంగ చెప్పాడు. ఇప్పుడు జగన్ తీరు కూడా గజదొంగ తల్లిలా మారింది. తన ఎమ్మెల్యేలతో తప్పులు చేయించి, వారు చేసే అవినీతిని, రౌడీయిజాన్ని ప్రోత్సహించి ఇప్పుడు వాళ్లను మారిస్తే ఏం లాభం’’ అంటూ చంద్రబాబు కథను ముగించారు.
నాకు చెబితే చాలా!
తమ ఊరికి 4గంటలకు ఒకసారి కూడా ఆర్టీసీ బస్సు రావడంలేదని ఇంటర్ విద్యార్థిని గిరిజ... చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థిని: సార్, గతంలో మా ఊరికి గంటకు ఒక బస్సు వొస్తా ఉండింది. ఇప్పుడు నాలుగైదు గంటలకు కూడా రావడంలేదు.
బాబు: మన బస్సులన్నీ పుంగనూరు వెళ్లిపోయాయ్. ఉన్న ఒక బస్సూ తీసేస్తారు.
విద్యార్థిని: అందుకే కదా సార్, మీకు ఇన్ఫామ్ చేస్తా ఉండేది?
బాబు: నాకు చెబితే చాలా? మీరేం చేయాలి?
విద్యార్థిని: గెలిపించాలి సార్.
చంద్రబాబు: గెలిపించాలంటే..
విద్యార్థిని: మా ఇంట్లో అందరికీ చెప్పి మీకే ఓట్లేయిస్తాను సార్.
చంద్రబాబు: వెరీ గుడ్. ఈ అమ్మాయికి వచ్చిన ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది.
కనిగిరి నుంచి సమర శంఖారావం
నెలపాటు చంద్రబాబు జిల్లాల్లో పర్యటన
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి చంద్రబాబు ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు. ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటన జనవరి ఐదో తేదీన కనిగిరి నుంచి ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 7న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో సభలు జరగనున్నాయి. 9న తిరుపతి జిల్లా వెంకటగిరి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సభలు ఉంటాయి. పదోతేదీన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సభలు నిర్వహిస్తారు.
నాది తెలుగు కులం
‘‘నా ప్రాణం, నా ఆశయం తెలుగు కులం అభివృద్ధే. తెలుగు కులం అంటే కులమతాలకు అతీతమైనది. తెలుగువారంతా కలిస్తే తెలుగు కులం. సొంత గ్రామాలకు వెళ్లండి. అక్కడి అవసరాలు గుర్తించండి. మీ సంపాదనలో 5, 10శాతం గ్రామాల ప్రగతికి కేటాయించండి. మీరు ఎక్కడ ఉన్నా రోజుకు గంట కేటాయించండి. మీ గ్రామంలో బంధుమిత్రులతో 20-30 మందికి ఫోన్లు చేయండి. రైతుబిడ్డగా నేను ఐటీ అభివృద్ధి చేశాను. చదివారు, ఉద్యోగాలు పొందారు, సంతృప్తి చెందకండి. సొంత పరిశ్రమలు పెట్టండి. వంద కుటుంబాలకు శక్తినిచ్చే ఆశయంతో ముందుకు సాగండి’’ అని చంద్రబాబు పిలుపిచ్చారు. బెంగళూరు తెలుగుదేశం ఫోరం కార్యాలయం కోసం సుబ్రహ్మణ్యం అనే దాత ఓ భవనం ఇవ్వడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.