YCP sarpanch: చెప్పుతో చెంపలు వాయించుకుని..
ABN , First Publish Date - 2023-04-11T02:23:37+05:30 IST
జగన్ సర్కారు పంచాయతీల నిధులను లాగేసుకోవడం, అభివృద్ధికి సహకరించనందుకు నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ చెప్పుతో తన చెంపలు వాయించుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులు లాక్కోవడంపై వైసీపీ సర్పంచ్ నిరసన
పార్టీ తరఫున పోటీ చేసినందుకు బాధపడుతున్నా
బెజవాడలో పంచాయతీరాజ్ చాంబర్ భేటీలో ఘటన
జగన్ సర్కారుపై డీజీపీకి ఫిర్యాదు: వైవీబీ
విజయవాడ (ఆంధ్రజ్యోతి)/రాచర్ల, ఏప్రిల్ 10: జగన్ సర్కారు పంచాయతీల నిధులను లాగేసుకోవడం, అభివృద్ధికి సహకరించనందుకు నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ చెప్పుతో తన చెంపలు వాయించుకుని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ తరఫున ఎందుకు పోటీ చేశానా అని బాధపడుతున్నానని, ఆ పార్టీలో ఉండాలో, వెళ్లిపోవాలో అర్థం కావటం లేదని వాపోయారు. సోమవారం విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ తరఫున జరిగిన సమావేశంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా చినాంపల్లె సర్పంచ్ పగడాల రమేశ్ ఈ చర్యకు పాల్పడ్డారు. సమావేశం అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పెండింగ్ బిల్లులు, పంచాయతీల అభివృద్ధి సమస్యతో ఏ సర్పంచ్ అయినా ఆత్మహత్య చేసుకుంటే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లైనా తాము నిధులు తెచ్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే రెండు నెలల్లో ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం
పంచాయతీల సమస్యలపై జరిగిన సమావేశంలో పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్రం ఇచ్చిన రూ.2 వేల కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల నిధులను ప్రభుత్వం లాక్కొంటున్నందున డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్టు ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.