Viveka case: ‘జగన్‌తో పోరు’లో.. సునీత పైచేయి!
ABN , First Publish Date - 2023-06-10T02:37:49+05:30 IST
సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ముఖ్యమంత్రికి, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డికి మధ్య జరుగుతున్న పోరాటంలో సునీతారెడ్డి మరోసారి న్యాయపరంగా పైచేయి సాధించారు.
భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నో
న్యాయం కోసం వివేకా కుమార్తె అవిశ్రాంత యుద్ధం
అటు చిన్నాన్న హత్య కేసులో అవినాశ్ అండ్ కోను
కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న జగన్
తమ్ముడు ఇబ్బందుల్లో పడగానే ఢిల్లీకి పరుగులు
జైలుపాలు కాకుండా పైస్థాయిలో ప్రయత్నాలు
అయినా పట్టువిడవని వివేకా కుమార్తె
సీబీఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు..
ప్రతి చోటా, ప్రతి పిటిషన్‌లోనూ ఇంప్లీడ్
నిందితులకు వ్యతిరేకంగా సమర్థ వాదనలు
ఫలితంగా భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో ఝలక్
అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు కోసం
వేసిన పిటిషన్‌లోనూ ముందడుగు
13న విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
న్యాయం కోసం పోరుబాట బయట ఉంటే ప్రమాదం
వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను భయబ్రాంతులకు గురిచేస్తారు. ఆయన బయట ఉండడం అత్యంత ప్రమాదకరం. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నా విచారణకు సహకరించలేదు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు ఈ నెల 30 వరకు గడు విచ్చింది. విస్తృత కుట్రపై కీలక దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ ఇవ్వొద్దు.
- సీబీఐ
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ముఖ్యమంత్రికి, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డికి మధ్య జరుగుతున్న పోరాటంలో సునీతారెడ్డి మరోసారి న్యాయపరంగా పైచేయి సాధించారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి, ఏ-7 భాస్కర్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోగలిగారు. ఆమె పోరాడుతోంది భాస్కర్‌రెడ్డి, ఏ-8 అవినాశ్‌రెడ్డిలపైనే అయినప్పటికీ.. వారి వెనుక ఉన్నది మాత్రం సీఎం జగనే. అంగబలం, అర్థ బలం సమృద్ధిగా ఉన్న అత్యంత బలమైన వ్యక్తిని కోర్టుల్లో ఎదుర్కోవడం సామాన్య విషయం కాదు. తండ్రి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగక.. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆమె సంతృప్తి చెందలేదు.
కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించేదాకా పోరాడారు. వివేకా హత్యలో సొంత కుటుంబ సభ్యుల పాత్ర ఉందని నిర్ధారణ అయ్యాక.. వారికి శిక్షపడేందుకు, న్యాయం కోసం, తండ్రి ఆత్మశాంతి కోసం పోరాడుతున్నారు. సీబీఐతో పాటు ఆమె కూడా సమాంతరంగా న్యాయపోరాటం చేస్తున్నారు. కేవలం ఫిర్యాదు చేసి వదిలేయడం కాకుండా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో, తెలంగాణ హైకోర్టులో, సుప్రీంకోర్టులో విచారణకు స్వయంగా హాజరవుతున్నారు. విచారణ క్రమాన్ని నిశితంగా గమనిస్తూ.. న్యాయవాదులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వాదనలకు పదునుపెడుతున్నారు. కొండొకచో సీబీఐ చేయాల్సిన పని కూడా తానే చేస్తున్నారని చెప్పవచ్చు. ఏ-7 వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు కాకుండా సీబీఐతో సమానంగా తానూ కోర్టులో సమర్థ వాదనలు వినిపించారు. తాజాగా ఆయన కుమారుడైన ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరుచేసిన ముందస్తు బెయిల్‌ను రద్దుచేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లోనూ ముందడుగు పడింది. సదరు వ్యాజ్యంపై వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది.
భాస్కర్‌రెడ్డికి బెయిలివ్వడానికి కోర్టు ససేమిరా
వివేకా హత్య కేసులో ఏ-7గా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 6న తీర్పు రిజర్వు చేసిన ఆయన.. తాజాగా బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆదేశాలిచ్చారు. భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి స్టేట్‌మెంట్ తప్ప ఒక్క ప్రత్యక్ష సాక్ష్యం కూడా లేదని.. అన్నీ వినికిడి (హియర్ సే) సాఽక్ష్యాలేనని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిపై సీబీఐ ఒకేరకమైన ఆరోపణలు చేసిందని.. అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు.. అదే స్థితిలో ఉన్న భాస్కర్‌రెడ్డి జైల్లో ఉండడం సమంజసం కాదని తెలిపారు. అనారోగ్య సమస్యలున్న సీనియర్ సిటిజెన్ అయిన పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వాలని.. ఇప్పటికే దాదాపు నెలన్నర రోజులకు పైగా జైల్లో ఉన్నారని చెప్పారు.
వాళ్లు అత్యంత బలవంతులు: సీబీఐ
సీబీఐ పీపీ కొంపల్లి అనిల్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను భయబ్రాంతులకు గురిచేస్తారని.. ఏ-7 భాస్కర్‌రెడ్డి, ఏ-8 అవినాశ్‌రెడ్డి కడప, పులివెందుల ప్రాంతాల్లో అత్యంత బలవంతులని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు జరిగిన ధర్నాలు, నిరసనల ద్వారా వారి ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చిందని.. విస్తృత కుట్రపై కీలక దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ ఇవ్వరాదని కోరారు. భాస్కర్‌రెడ్డి తరహాలోనే హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-5 శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో సైతం బెయిల్ రాలేదని.. భాస్కర్‌రెడ్డి బయట ఉండడమూ అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు.
వారి బలప్రదర్శనల ద్వారా వాంగ్మూలం ఇవ్వడానికి స్థానిక సాక్షులు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా ప్రాసిక్యూషన్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. భాస్కర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నా విచారణకు సహకరించలేదని.. ఏప్రిల్ 16 నుంచి జైల్లో ఉండడం బెయిల్ మంజూరు చేయడానికి ప్రాతిపదిక కాదన్నారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇక భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని వివేకా కుమార్తె సునీతారెడ్డి తన లిఖితపూర్వక వాదనల్లో పేర్కొన్నారు. విస్తృత కుట్రలో భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ పిటిషన్‌లో దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాశ్‌రెడ్డి 8వ నిందితుడని తొలిసారి సీబీఐ వెల్లడించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
సునీతారెడ్డి పిటిషన్‌పై 13న సుప్రీం విచారణ
అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దుకు వివేకా కుమార్తె అభ్యర్థన
న్యూఢిల్లీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 13న (మంగళవారం) విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆమె తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రస్తావించారు. ఏప్రిల్ 24న ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించిందని, వేసవి సెలవుల కారణంగా విచారణ జరుపలేదని.. దాంతో హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించాలని సుప్రీం సూచించిందని ఆయన గుర్తుచేశారు.
ఆ సమయంలో సీబీఐ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. తల్లి ఆస్పత్రిపాలయ్యారన్న కారణంగా అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘అసలు విషయమేంటి ఈ కేసులో’ అని ధర్మాసనం ప్రశ్నించగా.. వివేకా హత్యలో అవినాశ్ ప్రధాన కుట్రదారు అని, స్థానిక ఎంపీ అయిన ఆయనకు అధికార వర్గాల నుంచి ‘రాజకీయ’ సహకారం అందుతోందని.. దాంతో సీబీఐ అరెస్టు చేయలేకపోయిందని లాథ్రా బదులిచ్చారు. ‘ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారా’ అని ధర్మాసనం అడుగగా.. బెయిల్ రద్దు చేయాలని, ఎందుకంటే ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తికావలసి ఉన్నందున.. ఆలస్యం చేస్తే పిటిషన్‌కు కాలం చెల్లుతుందని ఆయన సమాధానమిచ్చారు. ఆధారాల ధ్వంసం వంటి అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, పైగా మీడియా కథనాలను తీర్పులో ప్రస్తావించిందని తెలిపారు. వచ్చే వారం విచారణ జరుపుతామని ధర్మాసనం అనగా.. సోమవారం చేపట్టాలని లూథ్రా అభ్యర్థించారు. చివరకు మంగళవారం విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది. అలాగే, దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐకి విధించిన గడువును కూడా పొడిగించాలని లూథ్రా కోరారు.
న్యాయం కోసం అవిశ్రాంత పోరు
వివేకా హత్య కేసు ప్రపంచ చరిత్రలోనే అరుదైనదిగా చెప్పవచ్చు. నిందితులకు తన అన్న, రాష్ట్రప్రభుత్వం సంపూర్ణంగా దన్నుగా నిలుస్తున్నా.. న్యాయం కోసం సునీత అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. వైఎస్ కుటుంబం కఠినంగా ఉంటుందని కడప జిల్లాలో.. ప్రధానంగా పులివెందుల ప్రాంతంలో ఓ ముద్ర ఉంది. కానీ అదే కుటుంబానికి చెందిన వివేకానందరెడ్డి మాత్రం భిన్నమైన వ్యక్తి. జనం మనిషి. వారితో కలిసిమెలిసి ఉండేవారు. వారి సమస్యల పరిష్కారానికి ముందుండేవారు. తన అన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ఎంపీగా తానేంటో, తన పనేంటో అన్నట్లుగా ఉండేవారు. అలాంటి వ్యక్తిని హత్య చేయడాన్ని ఆయన కుమార్తె సునీత జీర్ణించుకోలేకపోయారు. రాజకీయాలకు దూరంగా డాక్టరు వృత్తిలో స్థిరపడిన ఆమె.. తండ్రిని చంపినవారికి శిక్షపడేలా చేసేందుకు న్యాయపోరాటానికి దిగారు.
మరోవైపు.. తనకు వరుసకు సోదరుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసినప్పుడు.. తమ్ముడి అరెస్టుకు అడుగులు వేసిన ప్రతిసారీ జగన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. సీబీఐ అవినాశ్ జోలికి రాకుండా పై స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రిమినల్ లాయర్లను రంగంలోకి దించుతున్నారు. ఇంకోవైపు.. వివేకా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అవినాశ్, భాస్కర్‌రెడ్డి అక్రమ సంబంధాల కథలు అల్లుతున్నారు. ఈ కుట్రపూర్వక యత్నాలపై సునీతారెడ్డి నిత్యం పోరాడుతున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో, తెలంగాణ హైకోర్టులో, సుప్రీంకోర్టులో నిందితులు బెయుల్ కోసమో, మరొకదాని కోసమో పిటిషన్లు వేసినప్పుడు.. వాటిలో ఎప్పటికప్పుడు ఇంప్లీడ్ అవుతూ.. తన వైఖరిని కోర్టుల దృష్టికి తీసుకొస్తున్నారు. సీబీఐ వాదనకు దన్నుగా నిలుస్తున్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని బెదిరింపులు వస్తున్నా.. ఆమె వెనుకంజ వేయడం లేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
జగన్ యత్నాలు విఫలం..
ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి అంటే పులివెందుల ప్రాంతంలో బలమైన వ్యక్తి.. ఆయనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పనీ జరగదంటే అతిశయోక్తి కాదు. అలాంటి తన చిన్నాన్నను సీబీఐ అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. సీబీఐ ఆకస్మికంగా ఆయన్ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచి చంచల్‌గూడ జైలుకు తరలించింది. అరెస్టును అడ్డుకోలేకపోయిన జగన్.. ఆయనకు బెయిల్ ఇప్పించేందుకు కూడా శతవిధాలుగా యత్నించి విఫలమయ్యారు. దాంతో అవినాశ్‌రెడ్డినైనా కాపాడుకోవాలనుకుంటున్నారు. ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. పెద్ద పెద్ద లాయర్లను మోహరించారు. సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేయడానికి కర్నూలు వచ్చినప్పుడు.. వారిని అడ్డుకునేందుకు పులివెందుల, జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తలు వేల సంఖ్యలో కర్నూలుకు తరలివచ్చి ధర్నాలకు దిగి శాంతిభద్రతలకే సవాల్ విసిరారంటే.. అవినాశ్‌కు ఏ స్థాయిలో సహకారం లభిస్తోందో అర్థమవుతోంది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఆ తీర్పులోని సాంకేతిక అంశాల ఆసరాతో ఈ నెల 3న సీబీఐ అవినాశ్‌ను అరెస్టుచేసి.. అదే రోజు పూచీకత్తులపై విడుదల చేసింది. ఆయన విడుదలైనా.. ఆయన అరెస్టు వరకు వ్యవహారాన్ని తీసుకురావడంలో సునీత విజయం సాధించారనే చెప్పాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు అవినాశ్‌రెడ్డికిచ్చిన ముందస్తు బెయిల్ రద్దు కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.