అదానీ బాండ్స్.. విలువ సున్నా
ABN , First Publish Date - 2023-02-02T03:45:02+05:30 IST
అదానీ గ్రూప్ ప్రతిష్ఠ మసక బారుతోంది. నిన్నమొన్నటి వరకు ఇన్వెస్టర్లకు ఫ్యాన్సీ గా ఉన్న ఈ గ్రూప్.. హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రశ్నార్థకంగా మారింది...
హామీ రుణాలకూ కొరగావు.. స్పష్టం చేసిన క్రెడిట్ సూయీస్
‘బేర్’మన్న గ్రూప్ కంపెనీల షేర్లు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఒక్కరోజే 29ు పతనం
ఐదు రోజుల్లో గ్రూప్ కంపెనీ సంపద రూ.7 లక్షల కోట్లు ఔట్
ముంబై: అదానీ గ్రూప్ ప్రతిష్ఠ మసక బారుతోంది. నిన్నమొన్నటి వరకు ఇన్వెస్టర్లకు ఫ్యాన్సీ గా ఉన్న ఈ గ్రూప్.. హిండెన్‌బర్గ్ నివేదికతో ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్ కంపెనీల బాండ్స్ (రుణ పత్రాలు)ను హామీగా పెట్టుకుని బ్రోకర్లకు మార్జిన్ రుణాలు ఇచ్చేందుకూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే క్రెడిట్ సూయిస్ ఏజీ ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసినట్టు బ్లూంబర్గ్ వార్తా సంస్థ కథనం.
చిత్తు కాగితంతో సమానం: అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై కంపెనీలు జారీ చేసిన బాండ్స్‌కు.. క్రెడిట్ సూయిస్ సంస్థ జీరో వాల్యూ ఇచ్చినట్టు ఆ కథనం పేర్కొంది. అంటే ఈ కంపెనీలు జారీ చేసిన బాండ్స్ చెల్లింపులకు ఏ మాత్రం హామీ లేని చిత్తు కాగితాలతో సమానమని అర్థం.
రూ.7 లక్షల కోట్లకుపైగా నష్టం: ఈ వార్తలతో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం మార్కెట్లో మరింత పడిపోయాయి. భయంతో ఇన్వెస్టర్లు పోలోమంటూ అమ్మకాలకు దిగటమే ఇందుకు కారణం. దీంతో గత ఐదు సెషన్స్‌లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది.
‘బేర్’మన్న షేర్లు: ఈ అమ్మకాల హోరుతో బీఎ్‌సఈలో బుధవారం ఇంట్రాడేలో గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) కంపెనీ షేరు 30 శాతం నష్టపోయి రూ.1,942కి చేరింది. ట్రేడింగ్ ముగిసేసరికి కొద్దిగా కోలుకుని 28.45 శాతం నష్టంతో రూ.2,128.70 వద్ద క్లోజైంది. అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీల షేర్లూ 2.46 శాతం నుంచి 19.69 శాతం వరకు నష్టపోయాయి. ఇటీవల అదానీ గ్రూప్ చేతికి వచ్చిన అంబుజా సిమెంట్, ఏసీసీ, ఎన్‌డీటీవీ షేర్ల ధరలూ 4.98ునుంచి 16.56ుపడిపోయాయి.
బ్యాంకులపైనా ఒత్తిడి: అదానీ గ్రూప్ కష్టాల ప్రభావం ప్రభుత్వ రంగ బ్యాంకులపైనా కనిపిస్తోంది. అదానీ గ్రూప్ రుణాల్లో తమ వాటా అర శాతం కూడా లేదని పీఎ్‌సబీలు ఎంత మొత్తుకుంటున్నా, ఇన్వెస్టర్లు నమ్మడం లేదు. క్రెడిట్ సూయిస్ వంటి విదేశీ ఇన్వె్‌స్టమెంట్ సంస్థలూ పీఎ్‌సబీల షేర్లను వదిలించుకుంటున్నాయి. దీంతో నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంకు సూచీ బుధవా రం ఇంట్రాడేలో 9.4 శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ, బీఓ బీ, పీఎన్‌బీ, యూబీఐ, ఇండియన్ బ్యాంక్, ఐఓబీ వంటి పీఎ్‌సబీల షేర్లు 5ు నుంచి 10ు వరకు బేర్‌మన్నాయి.
అన్నీ గమినిస్తున్నాం: ఇక్రా: తాజా పరిణామాల నేపథ్యంలో రేటింగ్ సంస్థలు.. అదానీ గ్రూప్ కంపెనీల పరపతి రేటింగ్‌పై దృష్టి పెట్టాయి. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఇక్రా తెలిపింది.
ఆస్ట్రేలియాలోనూ కష్టాలు: హిండెన్‌బర్గ్ నివేదిక ఆస్ట్రేలియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక నేపథ్యంలో ఆ దేశ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ అదానీ గ్రూప్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక కథనం వెల్లడించింది. ఆస్ట్రేలియాలోనూ అదానీ గ్రూప్ ఒక బొగ్గు గని ప్రాజెక్టు, ఒక రేవుని నిర్వహిస్తోంది.
ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ
స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ కరిగిపోతోంది. దీంతో ఆయన బుధవారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడి హోదాను కోల్పోయారని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. దాదాపు 8,370 కోట్ల డాలర్ల ఆస్తులతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానానికి చేరారు. ప్రపంచ శ్రీమంతుల జాబితాలోనూ అదానీ స్థానం 3 నుంచి 15వ స్థానాని (7,510 కోట్ల డాలర్లు)కి పడిపోయింది. ఇదే సమయంలో అంబానీ తొమ్మిదో స్థానాని (8,370 కోట్ల డాలర్లు)కి ఎదిగారు.