Share News

Adani : అదానీ బొగ్గు దందా!

ABN , First Publish Date - 2023-10-19T03:54:47+05:30 IST

గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ దందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. తాజాగా ఆ గ్రూపునకు సంబంధించిన బొగ్గు దందా

Adani  : అదానీ బొగ్గు దందా!

ఇండోనేషియాలో తక్కువ ధరకు థర్మల్‌ కోల్‌ కొనుగోలు

దిగుమతి రికార్డుల్లో ధరలు పెంచేసి రూ.వేల కోట్లు స్వాహా

పెంచిన ధరలకే ఇక్కడి విద్యుత్తు సంస్థలకు బొగ్గు సరఫరా

2019 నుంచి.. అదానీ పవర్‌కు రూ.4,250 కోట్ల మేర

అదనంగా చెల్లింపులు చేసిన గుజరాత్‌ విద్యుత్తు సంస్థలు!

ఆ భారం వినియోగదారులపై: ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం

అదానీ దోపిడీ రూ.32 వేల కోట్లు

బొగ్గు అమ్మకాలతోనే 12వేల కోట్ల లూటీ.. అందుకే కరెంటు చార్జీల బాదుడు

మోదీ ఎందుకు దర్యాప్తు జరపట్లేదు?.. మేం వచ్చాక దర్యాప్తు చేస్తాం: రాహుల్‌

గాంధీ కుటుంబమే అత్యంత అవినీతిమయం: బీజేపీ

అది.. 2019, జనవరి. ఇండోనేషియాలోని పోర్టు నుంచి 74,820 టన్నుల థర్మల్‌ కోల్‌ (బొగ్గు)తో డీఎల్‌ అకాసియా అనే భారీ ఓడ బయల్దేరింది. అక్కడి అధికారిక రికార్డుల ప్రకారం ఆ కార్గో విలువ రూ.13 కోట్లకు పైమాటే. కానీ, ఆ నౌక భారత్‌కు చేరుకునేసరికి దాని విలువను రూ.30 కోట్లుగా చూపించారు. ఇదొక్కటే కాదు.. 2019-2021 నడుమ ఇలాంటి 30షిప్‌మెంట్ల రికార్డులను పరిశీలించగా.. రూ.500 కోట్ల తేడా తేలింది! ఇది అదానీ గ్రూప్‌ సాగిస్తున్న బొగ్గు దందా అంటూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. అడ్డగోలుగా పెంచేసిన ధరలకే విద్యుత్తు సంస్థలకు ఆ బొగ్గును సరఫరా చేస్తుండడంతో.. వినియోగదారులపై భారం పడుతోందని విశ్లేషించింది.

(బిజినెస్‌ డెస్క్‌-ఆంధ్రజ్యోతి)

గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ దందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. తాజాగా ఆ గ్రూపునకు సంబంధించిన బొగ్గు దందా బయటకొచ్చింది. తైవాన్‌కి చెందిన హీలింగోస్‌, దుబాయ్‌కి చెందిన టారస్‌ కమోడిటీస్‌ జనరల్‌ ట్రేడింగ్‌, సింగపూర్‌లోని పాన్‌ ఏషియా ట్రేడ్‌లింక్‌ అనే మధ్యవర్తి/డొల్ల కంపెనీల ద్వారా ఇండోనేషియా నుంచి చౌకగా బొగ్గు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌.. దాని ధరను అధికంగా చూపి, ఇక్కడి విద్యుత్‌ సంస్థలకు అడ్డగోలు ధరలకు అమ్మి వేల కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకుందంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. కస్టమ్స్‌ రికార్డులు సమీక్షించి మరీ ఆ పత్రిక ఈ ఆరోపణలు చేసింది. ఇన్వాయి్‌సల్లో అసలు ధర చూపించకుండా.. రెట్టింపు ధరకు కొన్నట్టు తప్పుడు రికార్డులు సృష్టించి ఈ అక్రమానికి పాల్పడినట్టు ఆరోపించింది. చివరికి ఆ భారమంతా వినియోగదారుల నెత్తినే పడినట్టు పేర్కొంది. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను కూడా యథావిధిగా తోసిపుచ్చింది. ఎలాంటి ఆధారాలూ లేని, పాత ఆరోపణల ఆధారంగా ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఈ కథనాన్ని ప్రచురించిందని పేర్కొంది. బొగ్గు దిగుమతుల కోసం అదానీ గ్రూప్‌ సింగపూర్‌, దుబాయ్‌, తైవాన్‌ల్లోని మధ్యవర్తి కంపెనీలను వాడుకుంది. నేరుగా ఇండోనేషియా నుంచి తానే బొగ్గు దిగుమతి చేసుకుంటున్నట్టు చూపకుండా ఈ మధ్యవర్తి కంపెనీల నుంచి కొన్నట్టు రికార్డులు సృష్టించింది. అలాగే.. అదానీకి బొగ్గు సరఫరా చేసిన సింగపూర్‌ సంస్థ పాన్‌ ఏషియా ట్రేడ్‌లింక్‌ సంస్థ భారత్‌లో మరెవ్వరికీ బొగ్గు సరఫరా చేయకపోవడం గమనార్హం. ఇలాంటి డొల్ల కంపెనీల ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన నిధలతోనే అదానీ గ్రూప్‌ తన లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలను మేనేజ్‌ చేస్తోందని ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

వినియోగదారులపై భారం

ఇండోనేషియా నుంచి వయా మధ్యవర్తి/డొల్ల కంపెనీల ద్వారా దిగుమతి చేసుకున్న బొగ్గును అదానీ గ్రూప్‌ తన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ఈ విద్యుత్‌ కేంద్రాల విద్యుత్‌ను వివిధ రాష్ట్రాల డిస్కమ్‌లు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) ద్వారా కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోలు ధర ఆయా కేంద్రాల్లో ఉపయోగించే బొగ్గు ధర, ఇతర ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఈ క్లాజును ఉపయోగించుకునే.. అదానీ గ్రూప్‌ తాను దిగుమతి చేసుకునే ధరను అధికంగా చూపిస్తూ.. డిస్కమ్స్‌ ఉసురు తీస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గుజరాత్‌లో ఇప్పటికే అక్కడి విపక్షాలు ఆ రాష్ట్రంలోని అదానీ థర్మల్‌ కేంద్రాల అధిక విద్యుత్‌ ధరలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఐదేళ్లలో గుజరాత్‌ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు అదానీ పవర్‌కు 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.4,250 కోట్లు) అధికంగా కట్టబెట్టాయని ఆరోపించాయి.

దోపిడీ 32 వేల కోట్లు: రాహుల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గౌతమ్‌ అదానీ దేశ పేద ప్రజల నుంచి రూ.32వేల కోట్ల వరకు దోచుకున్నారని రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ దోపిడీపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ.. అదానీ దోపిడీపై బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. అదానీ ఇండోనేషియా నుంచి బొగ్గును కొనుక్కుని భారతదేశానికి అమ్ముతున్నారని, తద్వారా ఆయన రూ.12వేల కోట్లు ప్రజల జేబుల్లో నుంచి కొట్టేశారని ఆరోపించారు. గతంలో హిండెన్‌ బర్గ్‌ నివేదిక ప్రకారం అదానీ షెల్‌ కంపెనీల ద్వారా రూ.20 వేల కోట్లు దోపిడీ చేశారని, బొగ్గు ద్వారా వచ్చిన మొత్తంతో రూ.32వేల కోట్లు దోచుకున్నట్లయిందని రాహుల్‌ విశ్లేషించారు. బొగ్గు ధరలు పెరగడం వల్ల విద్యుత్‌ ధరలు పెరిగి, సామాన్యుడిపై భారంగా మారిందన్నారు. మనం విద్యుత్‌ స్విచ్‌ వేస్తే అదానీ జేబులోకి డబ్బు పోతోందన్నారు. రాహుల్‌ ఆరోపణలను బీజేపీ ఖండించింది. గాంధీ కుటుంబమే అత్యంత అవినీతిమయమైందని ఆరోపించింది.

Updated Date - 2023-10-19T03:54:47+05:30 IST