అదానీ గ్రూప్ అప్పులు భారత జీడీపీలో ఒక శాతం పైమాటే
ABN , First Publish Date - 2023-02-10T01:50:45+05:30 IST
అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మొత్తం అప్పు రూ.3.39 లక్షల కోట్ల వరకు ఉంటుందని, భారత జీడీపీలో ఇది ఒక శాతానికి పైమాటేనని...
నిక్కీ ఏషియా విశ్లేషణ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మొత్తం అప్పు రూ.3.39 లక్షల కోట్ల వరకు ఉంటుందని, భారత జీడీపీలో ఇది ఒక శాతానికి పైమాటేనని నిక్కీ ఏషియా తాజా విశ్లేషణలో వెల్లడైంది. ‘‘ఐఎంఎఫ్ రిపోర్టు ప్రకారం.. 2022 అక్టోబరు చివరి నాటికి నామినల్ జీడీపీ విలువ రూ.273 లక్షల కోట్లు. ఈ లెక్కన జీడీపీలో అదానీ గ్రూప్ మొత్తం అప్పుల వాటా 1.2 శాతానికి సమానమ’’ని నిక్కీ ఏషియా పేర్కొంది. గత ఏడాది అదానీ గ్రూప్ మూడు లిస్టెడ్ కంపెనీల (ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, ఎన్‌డీటీవీ) చేజిక్కించుకుంది. దాంతో గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలు 7 నుంచి 10కి చేరుకున్నాయి. ‘‘ఈ పది లిస్టెడ్ కంపెనీల మొత్తం ఆస్తుల విలువ రూ.4.8 లక్షల కోట్ల వరకు ఉన్నప్పటికీ, అప్పులు అంతకు మించడం ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే, ఈ గ్రూప్‌లో పదుల సంఖ్యలో ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి రుణాలనూ పరిగణలోకి తీసుకుంటే, మొత్తం అప్పుల భారం మరింత అధిక స్థాయిలో ఉండవచ్చ’’ని నిక్కీ భావిస్తోంది. అంతేకాదు, హిండెన్‌బర్గ్ ఆరోపణలతో గ్రూప్ మార్కెట్ విలువ ఇప్పటికే సగానికి తగ్గింది.
అదానీకి నార్వే వెల్త్ ఫండ్ రాంరాం: అదానీ గ్రూప్ కంపెనీల నుంచి తమ పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు నార్వే ప్రభుత్వ వెల్త్ ఫండ్ వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభం నుంచి 3 అదానీ కంపెనీల్లో తమకున్న 20 కోట్ల డాలర్లకు (రూ.1,640 కోట్లు) పైగా వాటాను దాదాపుగా విక్రయించడం జరిగిందని, ప్రస్తుతం తమకు ఈ గ్రూప్‌లో వాటాల్లేవని నార్వే వెల్త్ ఫండ్ ఈఎ్‌సజీ రిస్క్ మానిటరింగ్ హెడ్ క్రిస్టఫర్ రైట్ స్పష్టం చేశారు. గత ఏడాది చివరినాటికి ఈ ఫండ్.. అదానీ టోటల్ గ్యాస్‌లో 8.36 కోట్ల డాలర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 6.34 కోట్ల డాలర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీలో 5.27 కోట్ల డాలర్ల విలువైన వాటాలు కలిగి ఉంది. గడిచిన కొన్ని వారాల్లో ఈ వాటాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. 1.35 లక్షల కోట్ల డాలర్ల నిధి కలిగిన నార్వే వెల్త్ ఫండ్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఈక్విటీ ఇన్వె్‌స్టమెంట్ కంపెనీ.