అదానీ కంపెనీల రేటింగ్‌పై ప్రతికూల వైఖరి

ABN , First Publish Date - 2023-03-04T01:24:07+05:30 IST

అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ రేటింగ్‌పై భవిష్యత్‌ వైఖరిని ప్రతికూల స్థాయికి తగ్గిస్తున్నట్లు దేశీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది....

అదానీ కంపెనీల రేటింగ్‌పై ప్రతికూల వైఖరి

ముంబై: అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ రేటింగ్‌పై భవిష్యత్‌ వైఖరిని ప్రతికూల స్థాయికి తగ్గిస్తున్నట్లు దేశీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గడిచిన కొద్ది రోజుల్లో గ్రూప్‌ ఆర్థిక పరపతి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కంపెనీల రేటింగ్‌ వైఖరిని సవరించినట్లు స్పష్టం చేసింది. ఈక్విటీ లేదా రుణాల రూపంలో దేశీయంగా, అంతర్జాతీయంగా గ్రూప్‌ నిధుల సమీకరణ సామర్థ్యాన్ని నిశితంగా గమనించనున్నట్లు ఇక్రా తెలిపింది. అదానీ గ్రూప్‌ చాలాకాలంగా అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడటంతో పాటు అక్రమ విధానాల్లో కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ జనవరి 24న విడుదల చేసిన నివేదికలో ఆరోపించింది. దాంతో నెల రోజులకు పైగా అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలు పోటెత్తిన విషయం తెలిసిందే. గడిచిన మూడు సెషన్లలో మళ్లీ కాస్త తేరుకున్నాయి.

మూడో రోజూ అదానీ షేర్ల ర్యాలీ

అదానీ గ్రూప్‌ షేర్లు వరుసగా మూడో రోజూ ఎగిశాయి. వారాంతంలో గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎరటర్‌ప్రైజెస్‌ షేరు ఏకంగా 17 శాతం పుంజుకుంది. అదానీ పోర్ట్స్‌ 9.81 శాతం, అంబుజా సిమెంట్స్‌ 5.70 శాతం, ఏసీసీ 5.11 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌, ఎన్‌డీటీవీ షేర్లు 5 శాతం చొప్పున పెరిగాయి. అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్‌.. 4 అదానీ కంపెనీల్లో స్వల్ప వాటాలను రూ.15,446 కోట్లకు కొనుగోలు చేయడం నేటి ర్యాలీకి తోడ్పడింది. దాంతో ఒక్కరోజే గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.68,430 కోట్లు పెరిగింది. గడిచిన ఏడు నెలల్లో గ్రూప్‌నకు అతిపెద్ద సంపద వృద్ధి ఇది. అంతేకాదు, మూడు ట్రేడింగ్‌ సెషన్లలో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1.42 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

నష్టాల నుంచి తేరుకున్న ఎల్‌ఐసీ

మూడ్రోజులుగా అదానీ షేర్లు ర్యాలీ తీస్తుండటంతో ఈ గ్రూప్‌లో పెట్టిన పెట్టుబడులపై ఏర్పడిన నష్టాల నుంచి ఎల్‌ఐసీ కూడా గట్టెక్కింది. అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడింటిలో ఎల్‌ఐసీ పెట్టుబడులున్నాయి. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో గడిచిన నెల రోజులకు పైగా కాలంలో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. దాంతో గ్రూప్‌లోని ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ కూడా షేర్ల కొనుగోలు స్థాయి కంటే తగ్గింది. అదానీ గ్రూప్‌ ఈక్విటీల్లో ఎల్‌ఐసీ రూ.30,127 కోట్ల పెట్టుబడులు పెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల కాకముందు రూ.80 వేల కోట్ల ఎగువకు వృద్ధి చెందిన ఈ పెట్టుబడుల విలువ.. గత నెల 24 నాటికి రూ.29,893 కోట్లకు జారుకుంది. గడిచిన మూడు రోజుల్లో రూ.9,000 కోట్ల మేర పెరిగి రూ.39 వేల కోట్ల స్థాయికి చేరుకుంది.

అదానీ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసింది భారతీయుడే!

నాలుగు అదానీ కంపెనీల్లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసిన అమెరికన్‌ ఈక్విటీ ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ ‘జీక్యూజీ పార్ట్‌నర్స్‌’ భారతీయుడిదే. పేరు రాజీవ్‌ జైన్‌. యూనివర్సిటీ ఆఫ్‌ మియామీలో ఎంబీఏ అభ్యసించేందుకు 1990లో అమెరికా వెళ్లిన జైన్‌.. 1994లో వోంటోబెల్‌ అనే స్విస్‌ కంపెనీలో చేరారు. వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అగ్రగామి ఫండ్‌ మేనేజర్లలో ఒకరిగా ఎదిగారు. 2002లో వోంటోబెల్‌ చీఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ)గా నియమితులయ్యారు. 2016 జూన్‌లో సొంతంగా జీక్యూజీ పార్ట్‌నర్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి చైర్మన్‌, సీఐఓ మాత్రమే కాదు.. మెజారిటీ వాటాదారు కూడా. జైన్‌ తన వ్యక్తిగత సంపదలో చాలా వరకు కంపెనీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తారు. 2021లో ఆస్ట్రేలియాలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన జీక్యూజీ.. తద్వారా 89.3 కోట్ల డాలర్లు సమీకరించింది. తమ గ్రూప్‌లోని 4 కంపెనీల్లో రూ.15,446 కోట్ల విలువైన షేర్లను జీక్యూజీ పార్ట్‌నర్స్‌ బ్లాక్‌ డీల్స్‌ ద్వారా కొనుగోలు చేసిందని అదానీ గ్రూప్‌ గురువారం ప్రకటించింది. తద్వారా అదానీ ఎంటర్‌ప్రైజె్‌సలో 3.4 శాతం, అదానీ పోర్ట్స్‌లో 4.1 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 3.5 శాతం వాటాను జీక్యూజీ చేజిక్కించుకుంది. జీక్యూజీ పెట్టుబడులతో అదానీ కంపెనీల షేర్లు భారీగా పుంజుకోగా.. ఆస్ట్రేలియా ఎక్స్ఛేంజ్‌లో జీక్యూజీ షేరు మాత్రం 3 శాతానికి పైగా క్షీణించింది.

Updated Date - 2023-03-04T01:24:07+05:30 IST