ఆసియా కుబేరుడు అంబానీయే

ABN , First Publish Date - 2023-04-05T02:56:54+05:30 IST

ప్రముఖ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాదికి గాను బిలియనీర్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ.. భారత్‌ సహా ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుడిగా నిలిచారు...

ఆసియా కుబేరుడు  అంబానీయే

అదానీని వెనక్కి నెట్టి మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న రిలయన్స్‌ చైర్మన్‌

న్యూఢిల్లీ: ప్రముఖ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాదికి గాను బిలియనీర్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ.. భారత్‌ సహా ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న స్టాక్‌ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్ల ధరల ముగింపు, ఎక్స్ఛేంజ్‌ రేటు ఆధారంగా బిలియనీర్ల సంపదను లెక్కగట్టినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఆ తేదీ నాటికి అంబానీ వ్యక్తిగత సంపద 8,340 కోట్ల డాలర్లుగా నమోదైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీకి 9వ స్థానం దక్కింది. వరల్డ్‌ టాప్‌-10 ధనవంతుల్లోని ఏకైక వ్యక్తి అంబానీయే. ఇక గౌతమ్‌ అదానీ విషయానికొస్తే, 4,720 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో భారత ధనవంతుల్లో రెండో స్థానానికి జారుకున్నారు. గ్లోబల్‌ లిస్ట్‌లో 24వ స్థానంలో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ముకేశ్‌ అంబానీ ఆస్తి 8 శాతం క్షీణించినప్పటికీ, ఆయన ఈసారి మళ్లీ అగ్రస్థానానికి చేరుకోగలిగారు. గడిచిన మూడు నెలల్లో అదానీ ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోవడం ఇందుకు తోడ్పడింది. ఈ ఏడాది జనవరి 24 నాటికి అదానీ దాదాపు 12,600 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అత్యధిక ధనికుడుగా ఎదిగారు. కానీ, హిండెన్‌బర్గ్‌ ఆరోపణల దెబ్బకు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పేకమేడలా కుప్పకూలాయి. దాంతో గ్రూప్‌తో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా భారీగా క్షీణించింది. మరిన్ని విషయాలు..

  • ప్రపంచ కుబేరుల జాబితాలో ఈ ఏడాది భారత్‌ నుంచి 169 మందికి చోటు దక్కింది. గత ఏడాది 166 మందితో పోలిస్తే మరో ముగ్గురికి ఎంట్రీ లభిం చింది. అయితే, భారత కుబేరుల మొత్తం సంపద మాత్రం 10 శాతం తగ్గి 67,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. గత ఏడాది లిస్ట్‌లోని వారి మొత్తం ఆస్తి 75,000 కోట్ల డాలర్లుగా ఉంది.

  • ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ 1,750 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో భారత్‌లోని అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. టాప్‌-టెన్‌ ధనవంతుల్లోని ఏకైక మహిళ కూడా ఆమే.

  • ఈసారి జాబితాలో కొత్తగా 16 మందికి (అందులో ముగ్గురు మహిళలు) ప్రవేశం లభించింది.

  • మహీంద్రా అండ్‌ మహీంద్రా గౌరవ చైర్మన్‌, 99 ఏళ్ల కేశుబ్‌ మహీంద్రా లిస్ట్‌లోని అత్యధిక వయసు కలిగిన ధనవంతుడిగా ఉన్నారు. ఆయన ఆస్తి 120 కోట్ల డాలర్లు.

  • గత ఏడాది జాబితాలో ఉన్న వారిలో 23 మందికి ఈసారి చోటు దక్కలేదు. మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌, పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర్‌ శర్మ కూడా అందులో ఉన్నారు.

  • డిస్కౌంట్‌ బ్రోకరేజీ సంస్థ జీరోధా సహ వ్యవస్థాపకుడైన నిఖిల్‌ కామత్‌.. లిస్ట్‌లో కొత్తగా చోటు దక్కించుకున్న భారత బిలియనీర్లలో అత్యంత పిన్న వయస్కుడు. 36 ఏళ్ల కామత్‌ ఆస్తి 110 కోట్ల డాలర్లు. ఆయన సోదరుడు నితిన్‌ కామత్‌ ఆస్తి 270 కోట్ల డాలర్లుగా ఉంది.

ఫోర్బ్స్‌ టాప్‌-10 భారత కుబేరులు

పేరు కంపెనీ ఆస్తి ప్రపంచ

(కోట్ల డాలర్లు) ర్యాంకింగ్‌

1. ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 8,340 9

2. గౌతమ్‌ అదానీ అదానీ గ్రూప్‌ 4,720 24

3. శివ్‌ నాడార్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌ 2,560 55

4. సైరస్‌ పూనావాలా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2,260 68

5. లక్ష్మీ మిత్తల్‌ ఆర్సెలార్‌ మిత్తల్‌ 1,770 93

6. సావిత్రి జిందాల్‌, కుటుంబం ఓపీ జిందాల్‌ గ్రూప్‌ 1,750 94

7. దిలీప్‌ సంఘ్వీ సన్‌ ఫార్మా 1,560 112

8. రాధాకిషన్‌ దమానీ డీ-మార్ట్‌ 1,530 114

9. కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌ 1,420 124

10. ఉదయ్‌ కోటక్‌ కోటక్‌ గ్రూప్‌ 1,290 138

ప్రపంచ జాబితాలో భారత్‌ నుంచి 169 మందికి చోటు

అందులో 10 మంది తెలుగువారు

ఈ ఏడాదికి ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా విడుదల

తెలుగు సంపన్నుల్లో మురళి దివి నం.1

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది తెలుగువారికి స్థానం లభించింది. దివీస్‌ ల్యాబ్స్‌ అధిపతి మురళి దివి 490 కోట్ల డాలర్ల సంపదతో అత్యంత సంపన్న తెలుగు వ్యక్తిగా మరోసారి అగ్రస్థానాన నిలిచారు. అంతేకాదు, పదిలో ఐదు మంది ఔషధ రంగానికి చెందినవారే కావడం విశేషం.

పేరు కంపెనీ ఆస్తి ప్రపంచ

(కోట్ల డాలర్లు) ర్యాంకింగ్‌

మురళి దివీ, కుటుంబం దివీస్‌ ల్యాబ్స్‌ 490 552

ప్రతాప్‌ సీ రెడ్డి అపోలో హాస్పిటల్స్‌ 220 1,368

పీపీ రెడ్డి ఎంఈఐఎల్‌ 210 1,434

పీవీ కృష్ణా రెడ్డి ఎంఈఐఎల్‌ 200 1,516

ఎం సత్యనారాయణ రెడ్డి ఎంఎస్‌ఎన్‌ 140 2,020

జూపల్లి రామేశ్వర్‌ రావు మై హోమ్‌ 130 2,133

జీఎం రావు జీఎంఆర్‌ 130 2,133

పీవీ రాంప్రసాద్‌ రెడ్డి అరబిందో ఫార్మా 130 2,133

కే సతీశ్‌ రెడ్డి డాక్టర్‌ రెడ్డీస్‌ 130 2,133

జీవీ ప్రసాద్‌ డాక్టర్‌ రెడ్డీస్‌ 110 2,405

ప్రపంచవ్యాప్తంగా 2,640 మంది బిలియనీర్లు వారి మొత్తం ఆస్తి 12.2 లక్షల కోట్ల డాలర్లు

ఈ ఏడాది ఫోర్బ్స్‌ ప్రపంచ ధనవంతుల జాబితాలో 2,640 మందికి చోటు దక్కింది. గత ఏడాది లిస్ట్‌లోని వారి సంఖ్య 2,668తో పోలిస్తే తగ్గింది. ఈ ఏడాది ప్రపంచ కుబేరుల మొత్తం ఆస్తి 12.2 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. గత ఏడాది నమోదైన 12.7 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే 50,000 కోట్ల డాలర్లు తగ్గింది. అంతేకాదు, టాప్‌-25 ధనవంతుల మొత్తం సంపద కూడా 2.3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2.1 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌కు చెందిన జెఫ్‌ బెజోస్‌ సహా ఈసారి లిస్ట్‌లోని సగం మంది సంపద గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఏడాది ప్రపంచ నం.1 ధనవంతుడిగా ఉన్న మస్క్‌.. ఈసారి రెండో స్థానానికి జారుకున్నారు. లూయీ విట్టన్‌ గ్రూప్‌ అధిపతి బెర్నార్డ్‌ అర్నో 21,100 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఈసారి అగ్రస్థానానికి ఎగబాకారు. కాగా, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ ఈసారి 6వ స్థానానికి జారుకున్నారు.

Updated Date - 2023-04-05T02:58:38+05:30 IST