భారత టెకీల డాలర్ డ్రీమ్స్‌కు బ్రేక్!
ABN , First Publish Date - 2023-01-08T01:26:36+05:30 IST
ఈ ఏడాదిలో మూడో వంతు ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ మధ్యనే హెచ్చరించింది...
మాంద్యం భయాల నేపథ్యంలో
టెక్ కంపెనీల్లో పెరిగిన తీసివేతలు
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో మూడో వంతు ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ మధ్యనే హెచ్చరించింది. మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలు గత ఏడాది చివరి త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు) నుంచే ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించాయి. వ్యయాలను తగ్గించుకునేందుకు భారీ సంఖ్య లో ఉద్యోగాల కోతలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగం ఊడిన వారికి కొత్త కొలువు దొరకడం కూడా గగనమవుతోంది. ఎందుకంటే, బడా కంపెనీలు కొత్త నియామకాలను సైతం నిలిపివేశాయి. అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా, ట్విటర్, గూగుల్, ఉబెర్ సహా పలు అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు సిబ్బం ది తీసివేతలకు పాల్పడటంతో పాటు హైరింగ్‌నూ తాత్కాలికంగా నిలిపివేశాయి. దాంతో, హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లిన భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో కొత్త జాబ్ వె తుక్కోలేని పక్షంలో వారు అమెరికాను వీడాల్సి రావటమే ఇందుకు కారణం.
హెచ్1బీ వీసా రుసుము భారీగా పెంపు
మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ఫీజును ఏకంగా 70 శాతం పెంచి 780 డాలర్లకు చేర్చాలని ప్రతిపాదించింది. హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు 215 డాలర్ల ప్రీ-రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది 10 డాలర్లుగా ఉంది.
రెండేళ్లు గడ్డుకాలమేనా..?
ఈ సంవత్సరం టెక్ రంగానికి అత్యంత గడ్డుకాలంగా పరిణమించవచ్చని, ఉద్యోగాల కోతలు మున్ముందు మరింత పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 తొలి వారంలోనే (జనవరి 1-5) ప్రపంచ టెక్ కంపెనీలు 28,096 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అందులో, అమెజాన్, సేల్స్‌ఫోర్స్ మొత్తంగా 25,000కు పైగా ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. అమెజాన్ ఇండియాలో 1,000 మందిపై వేటు వేయనుంది. నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో దాదాపు 700 మందిని ఇంటికి పంపినట్లు ప్రకటించింది. మున్ముందు ఈ సంఖ్య 4,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ఏడాదిలో గూగుల్ 6 శాతం (దాదాపు 11,000 మంది) సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేయనుంది. ఈ విషయాన్ని గత ఏడాదే ప్రకటించింది. 2022 డిసెంబరులోనూ టెక్ సంస్థలు 17,000 మందికి పైగా సిబ్బందిని బయటికి సాగనంపాయి. నవంబరులో 51,489 మంది జాబ్ కోల్పోయారు. లేఆఫ్స్ ద్వారా గత ఏడాదిలో మెటా, ట్విటర్, ఒరాకిల్, ఎన్‌విడియా, స్నాప్, ఉబెర్, స్పాటిఫై, ఇంటెల్, సేల్స్‌ఫోర్స్ సహా పలు కంపెనీలు మొత్తం 1,53,110 మందికి ఉద్వాసన పలికాయి. మరోవైపు అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగానికి రెండేళ్ల పాటు సవాళ్లు తప్పవని, ఇండస్ట్రీ మళ్లీ పునరుద్ధరణ బాట పట్టేముందు మరిన్ని అవరోధాలను ఎదుర్కోవాల్సి రావచ్చని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఈ వారం భారత్‌లో పర్యటించిన సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ గత డాది అక్టోబరులోనే దాదాపు 1,000 మందిని తొలగించింది.