దగ్గు మందు ఎఫెక్ట్‌!

ABN , First Publish Date - 2023-05-21T01:56:31+05:30 IST

భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసిన దగ్గు మందు బ్రాండ్లలో నాణ్యత సమస్యలు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది...

దగ్గు మందు ఎఫెక్ట్‌!

  • ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షలు జరిగాకే ఔషధాల ఎగుమతికి అనుమతులు

  • కేంద్రం కొత్త ప్రతిపాదన

న్యూఢిల్లీ: భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసిన దగ్గు మందు బ్రాండ్లలో నాణ్యత సమస్యలు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇకపై ప్రభుత్వ లేబొరేటరీలో పరీక్షించాకే భారత ఔషధాలను ఎగుమతికి అనుమతించాలన్న ప్రతిపాదనలో కేంద్రం ఉంది. ఔషఽధాల నియంత్రణ సర్వోన్నత మండలి ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ (సీడీఎస్‌సీఓ) ఈ ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం.. ఔషధాలను కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించాక జారీ చేసే సర్టిఫికెట్‌ ఆధారంగానే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) వాటి ఎగుమతికి క్లియరెన్స్‌ జారీ చేస్తుంది. ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌, సీడీఎస్‌సీఓకు హైదరాబాద్‌, చండీగఢ్‌, కోల్‌కతా, చెన్నై, ముంబై, గువాహటిలో ఉన్న పరీక్షా కేంద్రాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఏబీఎల్‌ అక్రెడిటెడ్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌లో ఎగుమతి కన్సైన్‌మెంట్ల పరీక్షలకు అనుమతించే అవకాశాలున్నాయి. గడిచిన 8 నెలల్లో భారత కంపెనీలు ఎగుమతి చేసే ఔషధాల నాణ్యతపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిబ్రవరిలో తమిళనాడుకు చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ఎగుమతి చేసిన కంటి చుక్కల మందు ఔషధాన్ని వెనక్కి రప్పించుకుంది. అమెరికాలో ఈ కంపెనీ బ్రాండ్‌ ఐ డ్రాప్స్‌ వినియోగించవారిలో కొందరు చూపు కోల్పోవడం ఇందుకు కారణం. అంతకు ముందు, గాంబియాలో 66 మంది, ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు చనిపోవడానికి భారత కంపెనీలు ఎగుమతి చేసిన దగ్గు మందు వినియోగమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి.

Updated Date - 2023-05-21T01:56:31+05:30 IST