క్రెడిట్‌ స్విస్‌.. యూబీఎస్‌ చేతికి

ABN , First Publish Date - 2023-03-21T02:13:22+05:30 IST

ప్రపంచ ప్రముఖ బ్యాంక్‌ల్లో ఒకటైన క్రెడిట్‌ స్విస్‌ శకం ముగిసింది. ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిన ఈ బ్యాంక్‌ను యూబీఎస్‌ 325 కోట్ల డాలర్లకు (రూ.26,650 కోట్లు) కొనుగోలు చేయనుంది...

క్రెడిట్‌ స్విస్‌..  యూబీఎస్‌ చేతికి

రూ.26,650 కోట్లకు కొనుగోలు

60 శాతం డిస్కౌంట్‌కే డీల్‌!

జెనీవా: ప్రపంచ ప్రముఖ బ్యాంక్‌ల్లో ఒకటైన క్రెడిట్‌ స్విస్‌ శకం ముగిసింది. ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయిన ఈ బ్యాంక్‌ను యూబీఎస్‌ 325 కోట్ల డాలర్లకు (రూ.26,650 కోట్లు) కొనుగోలు చేయనుంది. గత శుక్రవారం షేర్ల ముగింపు ధర ప్రకారంగా క్రెడిట్‌ స్విస్‌ మార్కెట్‌ విలువ కంటే 60 శాతం తక్కువిది. ఈ రెండూ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంక్‌లే. యూబీఎస్‌ ఆ దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌ కాగా.. క్రెడిట్‌ స్విస్‌ రెండో అతిపెద్ద బ్యాంక్‌. అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎ్‌సవీబీ), సిగ్నేచర్‌ బ్యాంక్‌ల తరహాలోనే క్రెడిట్‌ స్విస్‌ కూడా కుప్పకూలవచ్చన్న భయాల నేపథ్యంలో బ్యాంక్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించేందుకు 5,000 కోట్ల స్విస్‌ ఫ్రాంక్‌ల (రూ.4.43 లక్షల కోట్ల) వరకు రుణమిచ్చేందుకు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అంగీకరించింది. అయినప్పటికీ, బ్యాంక్‌ భవిష్యత్‌పై ఖాతాదారులు, మార్కెట్‌ ఇన్వెస్టర్లకు భరోసా కల్పించలేకపోయింది. దాంతో బ్యాంక్‌ను గండం నుంచి గట్టెక్కేందుకు యూబీఎ్‌సను రంగంలోకి దింపింది. సెంట్రల్‌ బ్యాంక్‌ కోరిన మేరకు క్రెడిట్‌ స్విస్‌ను యూబీఎస్‌ టేకోవర్‌ చేసింది. ఈ డీల్‌కు మద్దతిచ్చేందుకు స్విస్‌ ప్రభుత్వం 10,000 కోట్ల ఫ్రాంక్‌లకు పైగా సమకూర్చనుంది. ఈ టేకోవర్‌ ద్వారా యూబీఎస్‌ మొత్తం ఇన్వె్‌స్టమెంట్‌ ఆస్తులు 5 లక్షల కోట్ల డాలర్లు దాటనున్నాయి.

30 కీలక బ్యాంక్‌ల్లో ఒకటి: క్రెడిట్‌ స్విస్‌ కూడా కుప్పకూలి ఉంటే గనుక స్విట్జర్లాండ్‌తో పాటు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ప్రపంచంలో వ్యవస్థాగతంగా అత్యంత కీలకమైన 30 బ్యాంక్‌ల్లో క్రెడిట్‌ స్విస్‌ ఒకటి.

భారీగా పతనమైన క్రెడిట్‌ స్విస్‌ షేర్లు: క్రెడిట్‌ స్విస్‌ను యూబీఎస్‌ టేకోవర్‌ చేయబోతోందన్న వార్తలతో ఈ రెండు బ్యాంక్‌ల షేర్లు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఒకదశలో 60 శాతానికి పైగా క్షీణించిన క్రెడిట్‌ స్విస్‌ షేరు నష్టాలు కాస్త తగ్గించుకుని 50 శాతం తక్కువ స్థాయిలో ట్రేడైంది. కాగా, యూబీఎస్‌ షేరు ధర సైతం ప్రారంభ ట్రేడింగ్‌లో 14 శాతం వరకు పతనమైనప్పటికీ, మళ్లీ కోలుకుని 6 శాతం వరకు లాభాల్లో ట్రేడైంది.

ఏటీ1 బాండ్‌హోల్డర్లకు రూ.1.43 లక్షల కోట్ల నష్టం: డీల్‌లో భాగంగా, క్రెడిట్‌ స్విస్‌కు చెందిన 1,600 కోట్ల ఫ్రాంక్‌ల (సుమారు రూ.1.43 లక్షల కోట్లు) విలువైన అడిషనల్‌ టైర్‌-1(ఏటీ1) బాండ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్విస్‌ ఆర్థిక నియంత్రణ మండలి ఫిన్మా ప్రకటించింది. దాంతో ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారికి భారీ నష్టం వాటిల్లనుంది.

క్రెడిట్‌ స్విస్‌ భారత విభాగం మూత?

క్రెడిట్‌ స్విస్‌ భారత్‌లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్‌బీఐ నుంచి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కూడా పొందిన ఈ సంస్థ.. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాం కింగ్‌, బ్రోకరేజీ సేవలందిస్తోంది. గత ఏడాది మార్చి నాటికి రూ.2,800 కోట్ల డిపాజిట్లను కలిగి ఉంది. ఈ గ్రూప్‌ను టేకోవర్‌ చేసిన యూబీఎస్‌.. భారత విభాగాన్ని కొనసాగిస్తుందా..? లేదా..? అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే, దాదాపు దశాబ్దకాలం పాటు భారత్‌లో ఏకైక శాఖతో సేవలందించిన యూబీఎస్‌.. 2016లో వైదొలిగింది. పైగా, క్రెడిట్‌ స్విస్‌ను టేకోవర్‌ చేస్తున్న నేపథ్యంలో భారత కార్యకలాపాలు కొనసాగించాంటే ఆర్‌బీఐ నుంచి మళ్లీ అనుమతులు పొందాల్సి ఉంటుంది. కాబట్టి, క్రెడిట్‌ స్విస్‌ కార్యకలాపాలనూ కొనసాగించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారీగా ఉద్యోగాల కోత!

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు క్రెడిట్‌ స్విస్‌.. యూబీఎ్‌సతో డీల్‌ కుదరకముందే 9,000 ఉద్యోగులను తొలగించే ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. యూబీఎ్‌సతో డీల్‌ నేపథ్యంలో ప్రతిపాదిత 9,000కు మరిన్ని రెట్ల తీసివేతలుండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది చివరినాటికి క్రెడిట్‌ స్విస్‌లో మొత్తం 50,000కు పైగా ఉద్యోగులుండగా.. అందు లో 17,000 మంది స్విట్జర్లాండ్‌లో పనిచేస్తున్నారు. క్రెడిట్‌ స్విస్‌, యూబీఎస్‌ మొత్తం సిబ్బంది 1.25 లక్షలు కాగా.. అందులో 30 శాతం స్విట్జర్లాండ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

భారత ఐటీకి దెబ్బే..!

అమెరికా, ఐరోపా బ్యాంకింగ్‌ సంక్షోభం భారత ఐటీ రంగంపై గణనీయ ప్రభావం చూపనుందని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. పశ్చిమ దేశాల బీఎ్‌ఫఎ్‌సఐ కంపెనీల నుంచి లభించే కొత్త డీల్స్‌పై స్వల్పకాలికంగా ప్రభావం చూపనుందని వారు పేర్కొన్నారు. వచ్చే 2-3 త్రైమాసికాల వరకు కంపెనీల ఆదాయ, లాభా ల వృద్ధిపై ఇది ప్రభావం చూపనుందన్నారు. ఎందుకంటే, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి బడా దేశీ ఐటీ కంపెనీలకు 30 శాతానికి పైగా ఆదాయం బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎ్‌సఐ) రంగం నుంచే సమకూరుతోంది.

సౌదీ నేషనల్‌ బ్యాంక్‌కు భారీ లాస్‌

ప్రస్తుత డీల్‌తో క్రెడిట్‌ స్విస్‌లో పెట్టుబడులు పెట్టిన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌కు 100 కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. క్రెడిట్‌ స్విస్‌కు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు, మరిన్ని నిధులు సమకూర్చే ఆలోచన లేదని బ్యాంక్‌ బడా వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ (ఎన్‌ఎన్‌బీ) ప్రకటించడంతోనే బ్యాంక్‌కు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. గత వారంలో క్రెడిట్‌ స్విస్‌ షేర్ల భారీ పతనానికిది ప్రధాన కారణమైంది.

Updated Date - 2023-03-21T02:13:22+05:30 IST